కరణ్‌ జోహార్‌-సారా మూవీ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Ae Watan Mere Wata: భారత స్వాత్రంత్య ఉద్యమం నేపథ్యంలో రూపొందిన ‘ఏ వతన్‌ మేరే వతన్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమైంది.

Published : 13 Feb 2024 14:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సారా అలీఖాన్‌ (Sara Ali khan) కీలక పాత్రలో కరణ్‌జోహార్‌ నిర్మించిన తాజా చిత్రం ‘ఏ వతన్‌ మేరే వతన్‌’ (Ae Watan Mere Watan). కణ్ణన్‌ అయ్యర్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime Video) వేదికగా మార్చి 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్‌ ప్రైమ్‌ గ్లింప్స్‌ను పంచుకుంది. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ ప్రస్తావించని సరికొత్త అధ్యాయాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు ప్రైమ్ వీడియో తెలిపింది. ఇమ్రాన్‌ హష్మి, సచిన్‌ ఖేడ్కర్‌, అభయ్‌ వర్మ, స్పార్ష్‌ శ్రీవాత్సవ, అలెక్స్‌ ఓ నేలి, ఆనంద్‌ తివారీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేసే క్రమంలో ఎంతోమంది నిస్వార్థంగా పనిచేశారు. అలా అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపిన ఓ మహిళ కథను తెరపై చూపించబోతున్నారు. ఉషా మెహతా జీవిత కథ నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ‘‘ఏ వతన్‌ మేరే వతన్‌’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి తలవంచకుండా ఎంతో మంది పోరాటం చేశారు. అలాంటి వారిలో ఒకరి జీవిత కథే మా చిత్రం. నాటి స్ఫూర్తికథలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ’’అని ప్రైమ్‌ వీడియో ఇండియా హెడ్‌ అపర్ణా పురోహిత్‌ అన్నారు. ‘స్వాతంత్ర్య పోరాటంలో రేడియో కీలక పాత్ర పోషించింది. సమాచారాన్ని చేరవేయడంతో పాటు, ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిలించడానికి ఎంతగానో ఉపయోగపడింది. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన ఈ మూవీని  ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21న స్ట్రీమింగ్‌కు తీసుకురావడం సంతోషంగా ఉంది’ అని కరణ్‌ జోహార్‌ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని