Malashri: కొవిడ్‌ తీసుకెళ్లినా..ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా..!

బాలనటిగా, హీరోయిన్‌గా, సూపర్‌ ఉమెన్‌గా సినీరంగంలో రాణించారు. ప్రేమఖైదీగా యువత గుండెల్లో నిలిచిపోయారు

Published : 24 Mar 2022 01:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలనటిగా, హీరోయిన్‌గా, సూపర్‌ ఉమెన్‌గా సినీరంగంలో రాణించారు. ‘ప్రేమఖైదీ’గా యువత గుండెల్లో నిలిచిపోయారు.. తెలుగు, తమిళ, మళయాళం, కన్నడంలో హీరోయిన్‌గా ఎన్నో పాత్రలను పోషించారు. కన్నడంలో యాక్షన్‌ క్వీన్‌గా ప్రసిద్ధిగాంచిన మాలాశ్రీ 25 ఏళ్ల తర్వాత ఆలీతో సరదా కార్యక్రమానికి వచ్చారు. నాటి, నేటి విశేషాలను పంచుకున్నారు.

ఏ సంవత్సరం సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు..?

మాలాశ్రీ: ఆరు నెలల పాపగా ఉన్నప్పుడే సావిత్రిగారి సినిమాలో నటించానని అమ్మ చెప్పింది. ఆ తర్వాత 32 సినిమాలు చేశా. ఎక్కువగా మగ వేషాలే ఉన్నాయి. చాలా సినిమాల్లో ప్రధాన పాత్రలే చేశాను.

సొంత ఊరు ఏది..?
మాలాశ్రీ: మా అమ్మగారిది భీమవరం. నేను పుట్టి పెరిగింది చెన్నైలో.. నాన్న పంజాబీ. కానీ కోల్‌కతాలో ఉండేవారు. నేను కడుపులో ఉండగానే అమ్మ విడాకులు తీసుకుంది. ఇప్పటి వరకు మా నాన్నను కలవలేదు. కేవలం ఫొటో మాత్రమే చూశాను. మా అమ్మ నన్ను వాళ్ల అక్కకు ఇచ్చి పెంచమన్నారు. వాళ్లే నాకు అమ్మా నాన్న. మా పెద్దమ్మకు ముగ్గురు పిల్లలు. వాళ్లు మా అమ్మను పిన్ని అని పిలిస్తే..నేను అలాగే పిలిచేదాన్ని. ఇప్పుడు అమ్మ నాతోనే ఉంటుంది. ఆమె పేరు చంద్రలేఖ.

25ఏళ్ల పాటు తెలుగు పరిశ్రమ వైపు రాకపోవడానికి కారణమేంటి..?

మాలాశ్రీ: సాహసవీరుడు సాగరకన్య సినిమా అయిపోయాక పెళ్లి చేసుకున్నా. పెళ్లి అయిన తర్వాత నా సినిమాల ఒరవడి మారిపోయింది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమాలన్నీ కూడా కన్నడలోనే చేశా. అందుకే తెలుగులోకి రాలేదు.

ప్రేమఖైదీ ఆఫర్ ఎలా వచ్చింది..?

మాలాశ్రీ: ‘నంజుండ కల్యాణ’ సినిమా చూసిన తర్వాత వెంటనే ప్రేమఖైదీకి తీసుకొన్నారు. గతంలో రామానాయుడిగారి సినిమా ‘రాము’లో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటించాను. ఆ తర్వాత మూడు నాలుగు సినిమాల్లో చిన్న పాత్రలే వచ్చాయి.

మాలాశ్రీ అనగానే గ్లామరస్‌ హీరోయిన్‌..సడెన్‌గా కన్నడలో యాక్షన్‌ హీరోయిన్‌గా మారి పోవడానికి కారణం?

మాలాశ్రీ: నంజుండ కల్యాణ తర్వాత డైరెక్టర్లు, నిర్మాతలు విభిన్న పాత్రలను ఇవ్వడం మొదలెట్టారు. సోమశేఖర్‌ పోలీస్‌ ప్రధాన పాత్రతో ఎస్పీ భార్గవి తీశారు. సిల్వర్‌జూబ్లీ సినిమా ఇది. అందులోని పాత్ర గురించి చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నాను. నాతో పోలీసు పాత్రేంటి? అనుకున్నా. ఆ తర్వాత అన్నీ యాక్షన్‌ సినిమాలే వచ్చాయి. దుర్గి పెద్ద హిట్‌. తెలుగులో ఎన్టీఆర్‌తో రీమేక్‌ చేశారు.

శ్రీదుర్గ ఇంట్లో వాళ్లు పెట్టిన పేరు..రసిక పెట్టిందెవరు..?

మాలాశ్రీ: తమిళంలో పాండ్యరాజన్‌తో ముక్తఫిలిమ్స్‌లో సినిమా చేస్తున్నపుడు ముక్త శ్రీనివాస్‌ రసికగా పేరు మార్చారు. రాజ్‌కుమార్‌గారి భార్య పార్వతమ్మ నా పేరు మాలాశ్రీగా మార్చారు. అప్పటి నుంచి మాలాశ్రీగానే ఉండిపోయా.

ప్రేమఖైదీ తర్వాత ఎన్ని తెలుగు సినిమాల్లో నటించారు..? మిగతా భాషల్లో ఎన్ని సినిమాలున్నాయి..?

మాలాశ్రీ: ప్రేమఖైదీ తర్వాత 26 తెలుగు సినిమాలు చేసి ఉంటా. తమిళం, మలయాళం, కన్నడలో కలిపి 112 సినిమాలు చేశా.

సినిమాలు చేస్తుండగానే రాముతో పెళ్లి అయిపోయింది..ఆయన ఎలా పరిచయమ్యారు..?

మాలాశ్రీ: రాము గారు తొలిసారిగా లేడీ ఒరియెంటెడ్‌, సాఫ్ట్‌ క్యారెక్టర్‌ చేయాలని సూచించారు. ఆయన నాతో విభిన్నమైన సినిమా చేయాలని ఉందని వచ్చారు. తెలుగులో ముత్యంలాంటి పెళ్లాం..అని అర్థం వచ్చే కన్నడ సినిమా చేద్దామన్నారు. విలేకరుల సమావేశంలోనూ యాక్షన్‌ సినిమాల నిర్మాత ఇలాంటి సినిమా తీయడంపై ఆయన గురించి ప్రశ్నవేస్తే ఆయనకు ముత్యం లాంటి పెళ్లాం దొరకాలని అని చెప్పా..ఆ పెళ్లాం నేనే అవుతానని అనుకోలేదు. అక్కడి నుంచి స్నేహం మొదలయ్యింది. అది ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్లింది. 

పెళ్లి ఎప్పుడు అయ్యింది. పిల్లలెంత మంది..?

మాలాశ్రీ: 1997లో పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు. పాప, బాబు. పాప ఫైనల్‌ డిగ్రీ చేస్తోంది. ఆమెకు సినిమాలంటే ఇష్టం. తెలుగులోనే చేయాలనుకుంటోంది. బాబు ఇంటర్‌. వాడు పుట్టినప్పుడే వాడిని మాస్‌ హీరోగా చేయాలని రాము నిర్ణయించారు. చిన్నప్పటి నుంచే వాడిని ప్రోత్సహిస్తున్నారు. ఏ సినిమా విడుదలైనా వాడిని మొదటి రోజే తీసుకెళ్తారు. పిల్లలిద్దరికీ సినిమాలు చేయాలని ఉన్నా మా ఇద్దరికీ మాత్రం వాళ్లు డిగ్రీ పూర్తి చేయాలని ఉంది.

సడెన్‌గా రాము గారు ఎలా చనిపోయారు..?

మాలాశ్రీ: అంతా ఐదురోజుల్లో జరిగిపోయింది. ఏమయ్యిందో తెలియదు. ఒంట్లో బాగోలేకపోతే చెప్పరు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటారు.. ఓకే అంటారు. కానీ ఓ రోజు బాగోలేదు..ఫ్యామిలీ డాక్టర్‌ను పిలవమన్నారు. అప్పుడు కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ చాలా ఉద్ధృతంగా ఉంది. డాక్టర్ ముందుగా కొవిడ్‌ పరీక్ష చేయించమన్నారు. పరీక్షలో పాజిటివ్‌గా వచ్చింది. దగ్గు మొదలైంది. మందులు వేసుకోవడం మొదలెట్టినా ఇంకా నయం కాలేదు.  వాంతులు అయ్యాయి. తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చించాలని డాక్టరు చెప్పారు. రాముకి ఆసుపత్రి అంటే పడదు. ఎవరికి బాగా లేకపోయినా ఆసుపత్రికి వెళ్లరు. ఇంటికి వచ్చిన తర్వాతే వెళ్తారు. ఆయనకు రక్త పరీక్ష చేయించాలన్నా చాక్లెట్‌ ఇస్తేనే ఒప్పుకుంటారు. అలాంటిది ఆయనను ఒప్పించి ఆసుపత్రిలో ప్రత్యేక గదిలో చేర్పించినా ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతూనే ఉన్నాయి. తర్వాతి రోజు ఐసీయూలోకి మార్చారు. రెండోరోజు రాము లేరని చెప్పారు. అంతకు ముందు ఓ రోజు రాత్రి ఫోన్‌ చేసి ‘ముందు బెడ్‌పై ఒకరు, పక్కన మరొకరు చనిపోయారు. నేను ఉండలేను. నన్ను డిశ్చార్జి చేయమని చెప్పవా’ అన్నారు. ‘ఈ జబ్బుతో ధైర్యంగా పోరాడు. భయం మాత్రం వద్ద’ని చెప్పా. ‘నువ్వు ఇంటికి రావాలి. వైద్యులు చెప్పినట్టు విను’ అన్నా. భయంతోనే ఆయన చనిపోయారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ షోకు మొదటి సారిగా వచ్చా. బయటకు వస్తున్నా రాము ఉన్నట్టే అనిపిస్తుంది.

తెలుగులో ఒకే ఏడాదిలో 14 సినిమాలా..?

మాలాశ్రీ: ఏ మాత్రం విశ్రాంతి లేకుండా సినిమాలు చేశాను. సుమన్‌, నేను, డీకేఎస్‌బాబు(డ్యాన్సుమాస్టర్‌)ఒకే ఫ్లైట్‌లో చెన్నై వెళ్లి హైదరాబాద్ వచ్చేవాళ్లం. డేట్స్‌ విషయంలో అవగాహనతో పని చేశాం. దాసరిగారి మాయబజారులో అక్కినేనితో పాటంటే రాత్రిపూట నిద్రపోనేలేదు. ఆ ఏడాది ఒక్క కన్నడ సినిమా చేయలేదు.

కన్నడలో రాజ్‌కుమార్‌తో నటించారా..?

మాలాశ్రీ: ఆయనతో చేయాలని ఉండేది. కానీ కథ కుదరలేదు. వాళ్ల బ్యానర్‌లోనే నంజుండ కల్యాణ చేస్తున్నపుడు పునీత్‌తో గోలీ ఆటలు ఆడుకున్నాం. డైరెక్టర్‌ వద్దని చెప్పినా వినలేదు. పార్వతమ్మకు ఫిర్యాదు చేసేవారు. వాళ్ల ఇంటికి తరచూ వెళ్లేదాన్ని. అక్కడే పునీత్‌తో కలిసి భోజనం చేయడమే కాదు..కొట్టుకునేవాళ్లం.

శుభశ్రీ ఎలా ఉంది..?

మాలాశ్రీ: చాలా బాగుంది. నా కంటే ముందే పెళ్లి చేసుకుంది. దానిది పెద్ద లవ్‌ స్టోరీ. అబ్బాయి వాళ్ల ఆచారం, వంటలు నేర్చుకోవడంతో పాటే ఏడాది పాటు సినిమాలు, సోషల్‌మీడియాలో కనిపించకూడదని నిబంధన పెట్టారు. ఆ తర్వాతే పెళ్లి చేశారు. బెంగళూరులో ఉంటోంది. ఆమెకు ఒక అబ్బాయి. 

చైల్డ్‌ ఆర్టిస్టుకు స్క్రిప్టు చదువుకోమని ఇస్తారు..నీకు హార్లిక్సు బాటిల్‌ ఇచ్చారట..?

మాలాశ్రీ: ఏంటో తెలియదు..నాకు హార్లిక్స్‌ అంటే చాలా ఇష్టం. ఇంటికి హార్లిక్స్‌ తెస్తే దొంగతనంగా తినేదాన్ని. ఒక రోజు షూటింగ్‌కు వెళ్లనని మారాం చేస్తుంటే..హార్లిక్స్‌ బాటిల్‌ ఇచ్చి అంతా నీకే అని చెప్పడంతో వెళ్లిపోయా. అలా అందరికి తెలిసిపోయింది. అది తిని తిని లావయ్యా.

‘మన్మథ సామ్రాజ్యం’ సమయంలో భరద్వాజ విసిగించేవారా..?

మాలాశ్రీ: ఆ సినిమా సమయంలో అసలు మాట్లాడేవారు కాదు. చాలా సిగ్గు పడేవారు. ఊర్మిళ సినిమా నాటికి చాలా మారిపోయారు. డైరెక్టర్‌ అంటే  ఏంటో చూపించారు. 

బావబామ్మర్ది సినిమాలో చాలా మంది నటులున్నారు.. ఎలా ఉండేది..?

మాలాశ్రీ: షూటింగ్‌ స్పాట్‌ కళకళలాడేది. విజయవాడలో షూటింగ్‌ చేస్తున్నపుడు ఒకటే హడావుడి. సిల్క్‌స్మితను చూసి అందరూ నోరెళ్లబెట్టేవారు. కృష్ణంరాజులాంటి వారితో నటించడం గొప్ప అనుభవం. 

ప్రేమఖైదీ హిట్‌ తర్వాత రామానాయుడు హీరోహీరోయిన్లకు బహుమతి ఇచ్చారు. ఏంటది..?

మాలాశ్రీ:నాకు ప్రీమియర్‌ 118 కారు ఇచ్చారు. హారీష్‌కు కంటెస్సా అనుకుంటా. ఈ సినిమా హిట్‌ అయితే గొప్ప బహుమతి ఇస్తానని షూటింగ్‌ సమయంలోనే చెప్పారు.

పగలు షూటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి గదిలోకి వెళ్లి ఏడ్చేవారట..?

మాలాశ్రీ: నా మొదటి సినిమా నంజుండ కల్యాణ తీస్తున్నపుడు నాకు కన్నడ రాదు..రాజ్‌కుమార్‌ వాళ్ల బ్యానర్‌లో నటిస్తున్నా.. భాష తెలియకపోవడంతో హావభావాలు రాకపోతే తిరిగి పంపిస్తారమోనని భయపడి ఏడ్చేసేదాన్ని. వారం, పది రోజులు అలాగే ఆందోళన చెందా..30 రోజుల్లో కన్నడ నేర్చుకోవడం అనే పుస్తకాన్ని ఉదయ శంకర్‌ ఇచ్చారు. ఆ తర్వాత భాషపై పట్టు పెంచుకున్నా.

ఎంత డబ్బున్నా మాలాశ్రీ మధ్యతరగతి అమ్మాయిలా ఉండాలనుకుంటుందట..?

మాలాశ్రీ: టి.నగర్‌లో ఉన్నపుడు అక్కడుండే కుటుంబాలను చూశా. రోజూ ఉదయం భర్తకు భోజనం బాక్సు ఇవ్వడం, పిల్లలను సైకిల్‌, బైక్‌పై కూర్చొబెట్టి టాటా చెప్పడం రోజూ చూసే దాన్ని. నేను కూడా అలా ఉండాలనుకున్నా. ఎన్ని సినిమాల్లో నటించినా ఆ భావన నాలో నుంచి పోలేదు. సింపుల్‌గానే ఉంటా.

ఎప్పుడు చూసినా మాన్లీలుక్‌ ప్యాంట్‌షర్ట్‌లోనే కనిపిస్తారు. ఎందుకు..?

మాలాశ్రీ: ఎక్కువగా పోలీస్‌, కలెక్టర్‌, సీబీఐ పాత్రలు చేయడం, యాక్షన్‌ పాత్రల్లో జీన్సు, టాప్స్‌ వేయడంతో అలవాటుగా మారింది. కన్నడలోఅలాగే ఇష్టపడుతారు. 

కన్నడలో ఇప్పుడున్న హీరోలలో ఎవరితో ఎక్కువ పరిచయం ఉంది..?

మాలాశ్రీ: సుదీప్‌తో పరిచయం బాగుంది. నేను బాగుండాలని కోరుకునే వ్యక్తి. శివరాజ్‌కుమార్‌ను కలుసుకుంటా. బాగా మాట్లాడుకుంటాం.

మళ్లీ ఇప్పుడు తెలుగులో అవకాశం వస్తే చేస్తారా..?

మాలాశ్రీ:నేను తెలుగు అమ్మాయిని. తప్పకుండా తెలుగులో సినిమాలు చేస్తా. నాకు తగిన పాత్రలిస్తే కచ్చితంగా నటిస్తా.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు