Salman Khan: సల్మాన్‌ ఖాన్‌- అట్లీ కాంబో.. అర్బాజ్‌ ఖాన్‌ ఏమన్నారంటే?

సల్మాన్‌ ఖాన్‌- అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న రూమర్స్‌పై సల్మాన్‌ సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ స్పందించారు.

Published : 19 Mar 2024 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో ‘జవాన్‌’ (Jawan) చిత్రాన్ని తెరకెక్కించి, తొలి ప్రయత్నంలోనే బాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ (Atlee). దీంతో, ఆయన తదుపరి ఎలాంటి చిత్రం తెరకెక్కిస్తారు? ఎవరు హీరోగా నటిస్తారు? అంటూ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)తో అట్లీ సినిమా తెరకెక్కించే అవకాశాలున్నాయంటూ ప్రచారం సాగింది. మరోవైపు, బాలీవుడ్‌ ప్రముఖ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)తో అట్లీ కలిసి పని చేయనున్నారని రూమర్స్‌ వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌, ఆయన సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌లు అట్లీని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించారని టాక్‌ వినిపించింది. వీటిపై అర్బాజ్‌ స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వాటిని ఖండించారు. తాను, సల్మాన్‌ అట్లీని సంప్రదించామనేది అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ కాంబినేషన్‌పై వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దన్నారు.

‘దబాంగ్‌ 4’ గురించి అర్బాజ్‌ మాట్లాడుతూ.. ‘‘నాలాగే సల్మాన్‌ కూడా ‘దబాంగ్‌ 4’ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ, అది ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియదు. ప్రస్తుతానికి మేమిద్దరం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాం. అవి పూర్తయ్యాక మా కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కొచ్చు’’ అని తెలిపారు. ‘ప్యార్‌ కియా తో డర్నా క్యా’, ‘సోచ్‌’, ‘కుచ్‌ నా కహో’ తదితర హిందీ సినిమాల్లో నటించి మెప్పించిన అర్బాజ్‌ ‘జై చిరంజీవ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో నటించారు. సల్మాన్‌ ఖాన్‌తో ‘దబాంగ్‌ 2’ (Dabangg) తెరకెక్కించి మంచి విజయం అందుకున్నారు. ‘టైగర్‌ 3’తో ప్రేక్షకులను అలరించిన సల్మాన్‌.. ఏఆర్‌ మురుగుదాస్‌ దర్శకత్వంలో నటించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని