‘గ్యాంగ్‌లీడర్‌’ అసలు కథ అదికాదు..!

‘చేయి చూశావా ఎంత రఫ్ఫాగా ఉందో రఫ్ఫాడించేస్తా’ అనే మాస్‌ డైలాగ్‌లతో మెగాస్టార్‌ చిరంజీవి ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌...

Updated : 04 Oct 2020 15:01 IST

డ్యాన్స్‌, ఫైట్స్‌తో రఫ్ఫాడించిన మెగాస్టార్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉందో రఫ్ఫాడించేస్తా’ అనే మాస్‌ డైలాగ్‌లతో మెగాస్టార్‌ చిరంజీవి ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించి చిరంజీవి కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్ చిత్రంగా నిలిచింది. చిరంజీవి యాక్షన్‌కు రావుగోపాలరావు, ఆనందరాజ్‌ విలనిజం తోడవడంతోపాటు మురళీమోహన్‌, నిర్మలమ్మ వంటి సీనియర్‌ నటులతో ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. ఓవైపు యాక్షన్‌, క్రైమ్‌ సీక్వెన్స్‌తో సాగుతూనే మరోవైపు విజయశాంతి, చిరు మధ్య కెమీస్ట్రీ, ప్రేమ పాటలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు

మొదట నో చెప్పిన చిరు..

మ్యాగజైన్‌ ఎడిటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న విజయ బాపినీడు సినిమా మీద ఉన్న ఆసక్తితో ‘డబ్బు డబ్బు డబ్బు’ చిత్రంతో దర్శకుడిగా మారారు. అనంతరం చిరు హీరోగా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘హీరో’, ‘మగధీరుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. మెగాస్టార్‌తో ఓ విభిన్నమైన చిత్రాన్ని తీయాలని భావించిన బాపినీడు ‘గ్యాంగ్‌లీడర్‌’ కథ రాసి చిరుకి వినిపించారు. అయితే బాపినీడు చెప్పిన కథ నచ్చకపోవడంతో చిరంజీవి ఎలాంటి మొహమాటం లేకుండా చేయనని చెప్పేశారు.

కథలోకి పరుచూరి ఎంట్రీ..

చిరు నో చెప్పిన గ్యాంగ్‌లీడర్‌ కథను ఒకానొక సందర్భంలో పరుచూరి బ్రదర్స్‌కు వినిపించారు దర్శకుడు బాపినీడు. కథ విన్నా వెంటనే అందులోని లోపాన్ని కనిపెట్టిన పరుచూరి బ్రదర్స్‌ మూడు రోజులు టైమ్‌ ఇస్తే మొత్తం మార్చి ఇస్తాను అని దర్శకుడికి మాట ఇచ్చారు. అలాగే అదే మాటను చిరంజీవికి ఫోన్‌ చేసి చెప్పారు. పరుచూరి బ్రదర్స్‌పై ఉన్న నమ్మకంతో చిరు సరేనన్నారు. అలా మూడు రోజులు టైమ్‌ తీసుకుని బాపినీడు రాసిన కథకు కొన్ని ఆసక్తికర విషయాలను జోడించి పరుచూరి గోపాలకృష్ణ చిరుకి వినిపించారు. కథ విన్న వెంటనే చిరు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

రికార్డ్‌ చేసుకున్న అల్లు అరవింద్‌..

గోపాలకృష్ణ చెప్పిన కథకు ఫిదా అయిన చిరు వెంటనే డేట్స్‌ చూడమని అల్లు అరవింద్‌కి సూచించారు. అయితే కథ విషయంలో కొంచెం అనుమానంగా ఉన్న అరవింద్‌, గోపాలకృష్ణకు ఫోన్‌ చేసి ఒక్కసారి మద్రాస్‌ రమ్మని పిలిచారు. అరవింద్‌ పిలుపు మేరకు మద్రాస్‌ వెళ్లిన గోపాలకృష్ణ ఆయనకు కూడా కథను వివరించారు. అయితే గోపాలకృష్ణ కథ చెబుతున్నప్పుడు అరవింద్‌ రికార్డ్‌ చేసుకున్నారని ఒకానొక సందర్భంలో పరుచూరి బ్రదర్స్‌ తెలిపారు. ‘ఎందుకు రికార్డ్‌ చేసుకుంటున్నారు’ అని గోపాలకృష్ణ అడగగానే.. ‘మీరు మాటలతో మాయాజాలం చేసేస్తారు. కాబట్టి ఇంటికి వెళ్లాక ఒక్కసారి ఈ కథను విని ఎలా ఉందో చెబుతాను’ అని అరవింద్‌ అన్నారని గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

గ్యాంగ్‌ లేకుండా ‘గ్యాంగ్‌లీడర్‌’ ఎలా..

బాపినీడు రాసిన ‘గ్యాంగ్‌లీడర్‌’ కథలో మురళీమోహన్‌తోపాటు హీరో స్నేహితులు కూడా ఒకేసారి మృతి చెందుతారు. ఈ కథను బాపినీడు చెప్పగానే.. ‘అందరూ ఒకేసారి చనిపోతే ఆసక్తి ఏం ఉంటుంది. గ్యాంగ్‌ లేకుండా అసలు గ్యాంగ్‌లీడర్‌కు అర్థం ఏం ఉంటుంది’ అని పరుచూరి బ్రదర్స్‌ అడిగారట. అలా పరుచూరి గోపాలకృష్ణ.. అందరూ ఒకేసారి చనిపోకూడదనే ఉద్దేశంలో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు మనం చూస్తున్న ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా కథగా మార్చారు. అంతేకాకుండా విజయశాంతి, రావుగోపాలరావు పాత్రల్లో కూడా ఆసక్తి ఉండేలా మార్పులు చేశారు.

వానపాటలో మెప్పించిన తండ్రీ కొడుకులు

చిరు కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఉన్నాయి. అందులో ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలోని ‘వానా వానా వెల్లువాయే’ పాట ఒకటి. అయితే ఈ పాటలో చిరు-విజయశాంతి హావభావాలు ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సూపర్‌హిట్‌ పాటను రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘రచ్చ’ సినిమాలో రీమేడ్‌ చేశారు. 2012లో విడుదలైన ఈ సినిమాలో చెర్రీ-తమన్నా డ్యాన్స్‌ థియేటర్‌లో ప్రేక్షకులచేత విజిల్స్‌ వేయించింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని