Mooga Manasulu: గోదావరిలో పడిపోయిన సావిత్రి.. బయటకు ఎందుకు రాలేదంటే..?

మూగమనసులు (Mooga Manasulu) షూటింగ్‌ గోదావరి మీద జరుగుతున్న రోజులవి. ‘ఈనాటి ఈ బంధమేనాటిదో...’ పాటను లాంచిపై ఏయన్నార్‌, సావిత్రిల మీద చిత్రీకరిస్తున్నారు

Published : 09 Feb 2024 12:35 IST

మూగమనసులు (Mooga Manasulu) షూటింగ్‌ గోదావరి మీద జరుగుతున్న రోజులవి. ‘ఈనాటి ఈ బంధమేనాటిదో...’ పాటను లాంచిపై ఏయన్నార్‌, సావిత్రిల మీద చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. పి.ఎల్‌.రాయ్‌ కెమెరా. పాటలో ‘ఎవరు పిలిచారనో...’ అనే చరణంలో సావిత్రి ఓ పక్కకు బాగా వంగి అభినయం చేస్తున్నారు. లాంచి తాలూకు ప్రొఫెల్లర్‌కు ఆవిడ చీర కొంగు చిక్కింది. లోపల పళ్ల చక్రం సావిత్రిని బలంగా గుంజింది. ఆ మహానటి లాంచీ మీంచి గోదావరిలో పడిపోయారు. అయినా సమయస్ఫూర్తితో ఆమె మునిగిపోకుండా లాంచి అంచును పట్టుకుని వేలాడారు. లాంచి ఆగిపోయింది.

మరో పడవలో ఉన్న యూనిట్‌ సభ్యులు సావిత్రికి చేయూతనిచ్చేందుకు లాంచీలోకి దూకారు. ఆమెకు తాడును అందించారు. సావిత్రి తాడు అందుకున్నారు. కానీ పైకి రావటం లేదు. రండమ్మా అంటూ సహాయకులు అరుస్తున్నారు. అయినా ఆవిడ నీట్లోంచి పైకి రావటం లేదు. పరిస్థితిని ఏయన్నార్‌ గ్రహించారు. లాంచీలో ఓ మూల ఉన్న కేన్వాస్‌ పట్టాను సావిత్రికి అందించారు. కాసేపటికి ఆ కాన్వాస్‌ పట్టాను చుట్టుకుని సావిత్రి బయటకు వచ్చారు. ఆవిడ చీర మొత్తం లాంచీ ప్రొఫెల్లర్‌కు చుట్టుకుపోయింది. అప్పుడు - నీటిలోంచి బయటకు రావడానికి సావిత్రి ఎందుకు తటపటాయించారో, ఏయన్నార్‌ తెలివిగా కాన్వాస్‌ పట్టాను ఎందుకు అందించారో సిబ్బందికి అర్థమయింది. జనవరి 31, 1964లో విడుదలైన ఈ చిత్రం ఇటీవలే 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 19 కేంద్రాల్లో 100 రోజులు, 9 కేంద్రాల్లో 175 రోజుల పాటు ‘మూగ మనసులు’ ప్రేక్షకులను రంజింపచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని