Bigg boss telugu 7: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-7’ కంటెస్టెంట్స్‌.. పూర్తి జాబితా ఇదే!

bigg boss telugu 7 contestants list: ‘బిగ్‌బాస్‌ 7’ కంటెస్టెంట్‌ల జాబితా. ఈసారి ఎవరెవరున్నారంటే?

Updated : 04 Sep 2023 06:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ ( Big Boss). ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సీజన్‌ 7 (Bigg Boss Telugu 7) ఆదివారం గ్రాండ్‌గా మొదలైంది. ‘ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా’ అంటూ ఇన్ని రోజులు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన నాగార్జున తొలుత ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లి అక్కడి విశేషాలు పంచుకున్నారు. ఆ తర్వాత, ‘సీజన్‌-7’లో అలరించనున్న కంటెస్టెంట్‌లను పరిచయం చేశారు. మరోవైపు, తమ కొత్త చిత్రాలను ప్రమోట్‌ చేసుకునే క్రమంలో యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (ఖుషి సినిమా) (Vijay Deverakonda), నవీన్‌ పొలిశెట్టి (మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా) (Miss Shetty Mr Polishetty) సందడి చేశారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి, కంటెస్టెంట్‌లను ఉత్సాహ పరిచారు.

సీజన్‌-7లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన మొదటి ఐదుగురు కంటెస్టెంట్‌లకు నాగార్జున బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. బ్రీఫ్‌కేస్‌లో రూ.20లక్షలు పెట్టి, ‘వెళ్లిపోవాలనుకున్న వారు ఆ మొత్తాన్ని తీసుకుని ఇప్పుడే బిగ్‌బాస్‌ నుంచి వెళ్లిపోవచ్చు’ అని చెప్పడంతో తొలుత ఎవరూ అంగీకరించలేదు. ఆ తర్వాత రూ.5లక్షలు చొప్పున పెంచుకుంటూ రూ.35లక్షల వరకూ వెళ్లారు. నటుడు శివాజీ కాస్త ఆసక్తి చూపినా, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ఉల్టా-పల్టా అంటూ మొదలైన ‘సీజన్‌-7’ తొలి ఎపిసోడ్‌తోనే ఆసక్తి పెంచారు నాగార్జున. మరి, ఈ సీజన్‌లో వినోదం పంచబోయే జాబితాలో ఎవరెవరున్నారంటే..?


ప్రియాంక జైన్‌

‘వినరా సోదరా వీర కుమార’, ‘చల్తే చల్తే’, ‘ఎవడూ తక్కువ కాదు’ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది ప్రియాంక జైన్‌ (Priyanka Jain). ప్రస్తుతం పలు సీరియళ్లలో నటిస్తోంది.


శివాజీ

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుల్లో శివాజీ (Sivaji) ఒకరు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి’, ‘మిస్టర్‌ ఎర్రబాబు’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘మిస్సమ్మ’, ‘తాజ్‌మహల్‌’ తదితర చిత్రాల్లో హీరోగా మెప్పించారు. ఆయన వెండితెరపై కనిపించిన చివరి చిత్రం ‘సీసా’ (2016). సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ‘గ్యాంగ్‌స్టర్స్‌’ అనే వెబ్‌సిరీస్‌తో అలరించారు. 2018లో ‘ఆమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదలైందీ సిరీస్‌. 


దామిని భట్ల

‘పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో’ (బాహుబలి), ‘ధమ్‌ ధమ్‌ ధమ్‌...’ (కొండపొలం) తదితర హిట్‌ పాటలను ఆలపించి విశేష క్రేజ్‌ సంపాదించుకున్న గాయనే దామిని భట్ల (Damini Bhatla). ‘ధమ్‌ ధమ్‌’ పాటకు చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించిన  సంగతి తెలిసిందే. 


ప్రిన్స్‌ యవార్‌

బాడీ బిల్డర్‌, మోడల్‌ అయిన ప్రిన్స్‌ యవార్‌ (Prince Yawar) పలు ధారావాహికల్లో కీలక పాత్రలు పోషించాడు.


శుభశ్రీ

ఓ హిందీ సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేసిన శుభశ్రీ రాయగురు 2002లో వచ్చిన ‘రుద్రవీణ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒడిశాలో పుట్టి, పెరిగిన ఈమె ఖోఖో, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ పోటీల్లో చురుకుగా పాల్గొనేది. కాలేజీ రోజుల్లో మోడలింగ్‌ చేసింది. ‘వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా 2020’ కిరీటం దక్కించుకుంది. సినిమాల్లోకి రాకముందు లాయరుగా పనిచేసింది.


షకీలా

ఒకప్పుడు మలయాళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో అనేక పాత్రల్లో నటించి స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకున్న నటి షకీలా (Shakila). తాను ఎలా నటిగా మారింది? పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆస్తులు ఎలా కోల్పోయిందో ఈ సందర్భంగా ఆమె వివరించారు.


సందీప్‌

కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌ (Sandeep) సీజన్‌-7లో అడుగు పెట్టారు. ఇప్పటికే ఒక రియాల్టీ షోలో విజయం సాధించిన ఆయన ఇప్పుడు ‘బిగ్‌బాస్‌7’ను గెలిచేందుకు వచ్చానని అన్నారు. కెరీర్‌తో పాటు కుటుంబానికి కూడా తన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.


శోభాశెట్టి

‘కార్తీక దీపం’లో మోనికాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శోభాశెట్టి (Shobha Shetty). అందులో తాను నెగెటివ్‌ రోల్‌ పోషించానని, కానీ, బయట చాలా పాజిటివ్‌గా ఉంటానని తెలిపారు. అలాగే, శారీకంగా ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పింది. బయట ఏ పనీ చేయనన్న పేరు తనకు ఉందని, కానీ, బిగ్‌బాస్‌-7లో అన్నీ పనులు చేస్తానని చెప్పింది. ‘బుల్లితెర రమ్యకృష్ణ’ అంటూ అందరూ తనని పిలుస్తారని, దాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకాస్త మంచి పాత్రలు పోషిస్తానని అన్నారు. హౌస్‌లో ఎవరైనా శోభాను ‘బ్యూటిఫుల్‌, క్యూట్‌’ అంటూ ఎవరి ప్రశంసలు కురిపిస్తే, వీకెండ్‌లో అందుకు శిక్ష ఉంటుందని శోభాకు నాగార్జున ట్విస్ట్‌ ఇచ్చారు.


యూట్యూబర్‌ టేస్టీ తేజ

యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టేస్టీ తేజ (tasty teja) బిగ్‌బాస్‌-సీజన్‌7లో అడుగు పెట్టారు. అన్ని టేస్టులూ చూపిద్దామని హౌస్‌లోకి వచ్చానని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా అమ్మ చేసిన బిర్యానీ అంటే తనకు ఇష్టమని, తాను కూడా వండుతానని చెప్పుకొచ్చారు. యూట్యూబర్‌గా ఇప్పటివరకూ 150కు పైగా సెలబ్రిటీలతో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొన్నానని తెలిపారు. 


కథానాయికగా పలు సినిమాల్లో నటించడమే కాదు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రతిక రోజ్‌ (rathika rose) సీజన్‌-7లో అడుగు పెట్టారు. బిగ్‌బాస్‌ను ‘పెద్దయ్య’ అని పిలుస్తానని, హౌస్‌లోని కంటెస్టెంట్‌లకు గట్టి పోటీ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. డ్యాన్స్‌ చేయడమే కాదు, ఇతరులను కూడా అనుకరిస్తానని రతిక అన్నారు.


డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ

చిన్నప్పటి నటుడు కావాలన్నది తన ఆశ అని, అయితే, ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ (Gautham Krishna)అన్నారు.  బిగ్‌బాస్‌లోకి 11వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన గౌతమ్‌ తాను డాక్టర్‌ నుంచి యాక్టర్‌గా ఎలా మారానో చెప్పుకొచ్చారు. ‘ఆకాశ వీధుల్లో..’ అనే చిత్రంలో నటించిన గౌతమ్‌కు నాగార్జున చిన్న టాస్క్‌ ఇచ్చారు.


కిరణ్‌ రాథోడ్‌ 

నటిగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు కిరణ్‌ రాథోడ్‌ (Kiran Rathore). బిగ్‌బాస్‌ సీజన్‌-7లో 12వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు. ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే ఉద్దేశంతోనే బిగ్‌బాస్‌కు వచ్చినట్లు చెప్పారు. ఫోన్‌, కుక్కలు, ఇంట్లో వాళ్లు లేకుండా ఎప్పుడూ ఉండలేదని అన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేలోపు తెలుగు నేర్చుకుంటానని అన్నారు. నటుడు శివాజీ తెలుగు బాగా నేర్పుతారని, ప్రతివారం పది కొత్త పదాలు అడుగుతానని నాగార్జున అన్నారు.


పల్లవి ప్రశాంత్‌

బిగ్‌బాస్‌కు వెళ్తానంటే అందరూ నవ్వారని, కానీ, పట్టు వదలకుండా వీడియోలు చేయడంతో ‘బిగ్‌బాస్‌7’లో పాల్గొనే అవకాశం వచ్చిందని,  యూట్యూబర్‌, యువ రైతు పల్లవి ప్రశాంత్‌ (pallavi prashanth) అన్నారు. ఇంట్లోకి వెళ్లే ముందు ప్రశాంత్‌కు నాగార్జున ఒక మిర్చి మొక్కను ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఆ చెట్టుకు మిర్చి కాస్తే, కొన్ని బెనిఫిట్స్‌ ఇస్తానని నాగార్జున ఆఫర్‌ ఇచ్చారు. ఎండిపోతే పనిష్‌మెంట్‌ ఉంటుందని హెచ్చరించారు.


అమర్‌దీప్‌

గెలవాలనే తపన, కోరిక తనకు ఎక్కువని, నటుడు అమర్‌దీప్‌ అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టిన తాను ప్రతి గేమ్‌లోనూ పట్టువదలకుండా ఆడతానని చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని