Akshay Kumar: నేనూ మనిషినే.. కానీ ఆ శక్తి నాకుంది: అక్షయ్‌ కుమార్‌

తాను ఎదుర్కొన్న విమర్శలపై ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ స్పందించారు. మంచిని మంచిలానే.. చెడుని చెడులానే స్వీకరిస్తానని పేర్కొన్నారు.

Published : 20 Jun 2023 21:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో అయినా తానూ మనిషినేనని, మంచిని మంచిలానే.. చెడుని చెడులానే స్వీకరిస్తానని బాలీవుడ్‌ ప్రముఖ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) అన్నారు. కెరీర్‌ పరంగా తనకు ఎదురైన విమర్శలపై ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నా జీవితంలో జయాపజయాలను చూశా. మనకి సక్సెస్‌ వస్తే ప్రశంసలు, ఫెయిల్యూర్‌ వస్తే విమర్శలు రావడం సాధారణం. నన్ను ఎంతగా ట్రోల్స్‌ చేసినా దాన్నుంచి త్వరగా కోలుకునే శక్తి కలిగి ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. నటుడిగా నా కెరీర్‌ ప్రారంభించిన రోజు ఎంతటి బాధ్యతతో ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నా. పని లేకుండా నేను ఉండలేను. ఐ లవ్‌ వర్కింగ్‌. దాన్నుంచి ఎవరూ నన్ను దూరం చేయలేరు. చేస్తున్న పనిని కొనసాగించాలి. మరో మార్గం లేదు. ప్రతిదాన్నీ ఓ అద్భుత శక్తి చూస్తూ ఉంటుంది. నిజాయతీతో కష్టపడితే మంచి ఫలితం వస్తుంది. దాన్ని నేను విశ్వసిస్తా’’ అని తెలిపారు.

సినిమాల ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘బాక్సాఫీస్ వసూళ్ల కారణంగా నటుల కెరీర్‌ గ్రాఫ్‌లో మార్పొస్తుంటుంది. మేం (నటులు) ఏం తప్పు చేస్తున్నామో కలెక్షన్స్‌ ద్వారా ప్రేక్షకులు పరోక్షంగా చెబుతారు. ఒక చిత్రం విజయవంతంకాలేదంటే దానర్థం ఆడియన్స్‌ ఆ స్టోరీకి కనెక్ట్ కాలేకపోవడమే’’ అని అక్షయ్‌ పేర్కొన్నారు. వేగంగా అత్యధిక సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకునే హీరోగా పేరొందిన ఆయన కొంతకాలంగా ఆ మార్క్‌కి దూరంగా ఉంటున్నారు. వరుసగా చిత్రాలు చేసినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. గతేడాది ఐదు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ఈ ఏడాది ఇప్పటికే ‘సెల్ఫీ’ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో ఆరు సినిమాలున్నాయి. వాటిల్లో తమిళ హిట్‌ చిత్రం ‘సూరారై పోట్రు’ (Soorarai Pottru) రీమేక్‌ ఒకటి. మాతృక సినిమా దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara)నే ఈ రీమేక్‌నూ తెరకెక్కిస్తున్నారు. ఆయన నటించిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ రెస్క్యూ’.. 2023 అక్టోబరు 5న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని