Britney Spears:నా తండ్రి చెర నుంచి కాపాడండి

 ప్రముఖ పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ జీవితం ఇలాంటిదే. గాయని, కవయిత్రి, డ్యాన్సర్‌, నటిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న బ్రిట్నీ జీవితం ఆనందంగా సాగలేదు. తన తండ్రే ఆమెను సుఖంగా ఉండనివ్వలేదు.

Updated : 25 Jun 2021 17:29 IST

కన్నీటి పర్యంతమైన గాయని

ఇంటర్నెట్‌ డెస్క్‌:  లోపల ఎంతో బాధ అనుభవిస్తున్నా.. బయటకి ఆనందంగా కనిపిస్తారు కొందరు తారలు. కుటుంబ సభ్యులు వేధించినా ప్రేక్షకులకి వినోదం పంచుతుంటారు. మనోవేదనకు గురవుతున్నా చిరునవ్వు చెదరకుండా ఎన్నాళ్లని ఓపిక పట్టగలరు? ఎప్పుడో ఒకప్పుడు మౌనం వీడాల్సిందే. ప్రముఖ పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ జీవితం ఇలాంటిదే. గాయని, కవయిత్రి, డ్యాన్సర్‌, నటిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న బ్రిట్నీ జీవితం ఆనందంగా సాగలేదు. తన తండ్రే ఆమెను సుఖంగా ఉండనివ్వలేదు. అందుకే తన తండ్రి జేమీ స్పియర్స్‌ చెర నుంచి రక్షించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇకపై తన సంరక్షకుడిగా తండ్రి జేమీ ఉండకూడదని అమెరికాలోని ఓ ఉన్నత న్యాయస్థానాన్ని బ్రిట్నీ కోరింది. సంబంధిత పిటిషన్‌పై వర్చువల్‌గా (వీడియో ఆధారిత) సుమారు 20 నిమిషాలు తన ఆవేదన వ్యక్తం చేసింది.

‘నా జీవితం నాకు ఇచ్చేయండి. నా తండ్రివల్ల నేను ఎప్పుడూ సంతోషంగా లేను. ఏ రోజూ సరిగా నిద్ర కూడా పోలేదు. నా వస్తువులన్నింటినీ ఆయనే తీసుకునేవారు. ఆయన కంట్రోల్‌లోనే అన్నీ జరిగేవి. మరో బిడ్డకు జన్మనివ్వాలనుకున్నా. దానికీ ఆయన అడ్డుపడ్డాడు. సంరక్షకుడిగా ఆయన చేసిన మంచి కంటే చెడే ఎక్కువ. ఇకనైనా ఆయన నుంచి నాకు రక్షణ కల్పించండి’ అని కన్నీటి పర్యంతమైంది బ్రిట్నీ. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో తన మనసులో మాట పంచుకుంది. ‘గత రెండేళ్లుగా నేను బాగానే ఉన్నానని చెప్పినందుకు నన్ను క్షమించండి’ అని కోరింది. ఈ విషయంలో ఎంతోమంది ప్రముఖులు, అభిమానులు బ్రిట్నీకి మద్దతుగా నిలుస్తున్నారు. 39 ఏళ్ల బ్రిట్నీ 2004లో తన చిన్ననాటి స్నేహితుడు జేసన్‌ అలెగ్జాండర్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. జేసన్‌ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం డ్యాన్సర్‌ కెవిన్‌ ఫెడెర్‌లైన్‌ని రెండో పెళ్లి చేసుకుంది. కెవిన్‌తోనూ వివాహ బంధాన్ని కొనసాగించలేదు. దాంతో 2008 నుంచి తండ్రి సంరక్షణలోనే ఉంది. అప్పటి నుంచి ఆయనే బ్రిట్నీ వ్యవహారాల్ని చూసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని