Bro Movie: ‘బ్రో’ సినిమా వచ్చేసింది.. ‘వినోదయసిత్తం’ గురించి ఇవి మీకు తెలుసా?

పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro Movie). సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.

Updated : 28 Jul 2023 13:08 IST

పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro Movie). సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సముద్రఖని రూపొందించిన ‘వినోదయసిత్తం’ రీమేక్‌గా ‘బ్రో’ను తెరకెక్కించారు. మరి ఆ సినిమాకు ‘బ్రో’మూవీకి ఉన్న తేడాలేంటి? ఏయే మార్పులు చేశారు?

‘వినోదయసిత్తం’ కథ ఇది: ప‌ర‌శురామ్ (తంబిరామ‌య్య‌) ఓ ప్రముఖ కంపెనీలో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. సమయపాలన విష‌యంలో చాలా క్లారిటీగా ఉంటాడు. తినే ఫుడ్ నుంచి ఆఫీస్ ప‌నుల వ‌ర‌కూ అన్నీ అనుకున్న సమయానికి జ‌రిగేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని దానిని ఫాలో అవుతుంటాడు. పరశురామ్‌కు భార్య ముగ్గురు పిల్లలు. కంపెనీ ప‌నిమీద వేరే నగరానికి వెళ్లి వస్తుండగా, పరశురామ్‌ కారుకు ప్రమాదం జరిగి చనిపోతాడు. పిల్లలకు పెళ్లి చేయకుండా, మనవలు, మనరాళ్లతో ఆడుకోకుండా చనిపోయానేనని పరశురామ్‌ ఆత్మ తెగ బాధపడిపోతూ ఉంటుంది. అదే సమయంలో పరశురామ్‌ ఆత్మను తీసుకెళ్లేందుకు టైమ్‌ ఒక రూపంలో (సముద్రఖని) వస్తుంది. తన గోడునంతా టైమ్‌కు చెప్పుకొని పరశురామ్‌ బాధపడతాడు. తనని బతికించమని అడుగుతాడు. అందుకు టైమ్‌ 90 రోజులు గడువు ఇస్తుంది. మరి టైమ్‌ ఇచ్చిన సమయంలో పరశురామ్‌ ఏం చేశాడు? బతికి ఉండగా, కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోని అతను ఏం చేశాడు? ఈ క్రమంలో కుటంబ సభ్యుల నుంచి పరశురామ్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

మళ్లీ బతికే అవకాశం వస్తే..: జీవితం ఎవరికీ సెకండ్‌ ఛాన్స్‌ ఇవ్వదు. చాలా అరుదైన సందర్భాల్లో అది లభిస్తుంది. చ‌నిపోయిన వ్య‌క్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జ‌రిగింద‌న్న‌ది ‘వినోద‌య సిత్తం’ క‌థ‌. యాభై ఏళ్ల ప్ర‌యాణంలో తాను చూడలేని అస‌లైన జీవితాన్ని ఓ వ్య‌క్తి మూడు నెల‌ల్లో ఎలా ద‌ర్శించాడ‌న్న‌ది ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని సందేశాత్మ‌కంగా చూపించారు. క‌ళ్ల ముందు క‌నిపించేది అస‌లైన జీవితం కాద‌ని, మ‌నుషులు, వారి మ‌న‌స్త‌త్వాల్లో మ‌రో కోణం దాగి ఉంటుంద‌ని చెప్పారు. అలాగే, ఆశలు, కోరికల వలయం చుట్టూ మనిషి ఎలా తిరుగుతాడు? చ‌దువు, ఉద్యోగాల విష‌యంలో త‌ల్లిదండ్రులు బ‌ల‌వంతంగా త‌మ అభిప్రాయాల్ని ఆలోచ‌న‌ల్ని పిల్ల‌ల‌పై ఎలా రుద్దుతారు? ఈ క్రమంలో పిల్ల‌లు ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొంటారు. ఇలా ప్రతి అంశాన్ని హృద్యంగా చూపించారు. ప్రతి మనిషి జీవితానికి దగ్గరగా ఉండేలా సన్నివేశాలను తీర్చిదిద్ది భావోద్వేగాల జడివానలో సముద్రఖని ప్రేక్షకులను తడిపేస్తారు.

‘బ్రో’లో చేసిన మార్పులివే: ‘వినోదయసిత్తం’ చూసి 70ఏళ్ల పెద్దాయన సముద్రఖనికి ఫోన్‌ చేసి భావోద్వేగంతో ఏడ్చేశారట. ఈ విషయం తెలుసుకున్న త్రివిక్రమ్‌ ఈ సినిమాను తెలుగులో చేద్దామా? అని అడిగారట. ‘మీకు నటించాలని ఉందా’ అని అడిగితే, ‘లేదు కేవలం దర్శకత్వం చేయాలి. కాకపోతే ఎక్కువ మంది ఈ సందేశం చేరాలి’ అన్నారట సముద్రఖని. ఇది విన్న తర్వాత పదినిమిషాలు బయటకు వెళ్లిన త్రివిక్రమ్‌. ‘ఇందులో పవన్‌కల్యాణ్ నటిస్తే మీకు ఓకే కదా’అని అనడంతో సముద్రఖని తెగ ఆనందపడిపోయారు. మాతృకకు కొన్ని మార్పులు చేసి, స్క్రీన్‌ప్లేను కూడా మార్చారు. అందులో తంబిరామయ్య పాత్రను ఇందులో సాయి ధరమ్‌తేజ్‌ చేయగా, సముద్రఖని టైమ్‌ పాత్రను పవన్‌కల్యాణ్‌ చేశారు. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్‌ను, ఇక్కడ సిస్టర్‌ సెంటిమెంట్‌గా మార్చారు.

  • జీ5 వాళ్లకు ఓ సినిమా చేసే క్రమంలో సముద్రఖని ఐదు కథలు చెప్పాల్సి వచ్చింది. వాళ్లు అరగంట సమయం ఇవ్వగా, 20 నిమిషాల్లో వాటిని చెప్పేశారు. మరో పది నిమిషాలు సమయం మిగలడంతో ‘వినోదయ సిత్తం’ కథ చెప్పారు. ఈ కథ వాళ్లకు నచ్చడంతో వాటిని పక్కన పెట్టేసి, చివరిలో చెప్పిన కథను ఓకే చేశారు. అలా మూవీ పట్టాలెక్కింది.
  • ‘వినోద‌య సిత్తం బ‌డ్జెట్ ఐదు కోట్లు కాగా బ్రో మూవీని భారీ బడ్జెట్‌తో, అదనపు హంగులు జోడించి తీర్చిదిద్దారు.
  • వినోద‌య సిత్తంలో పాట‌లు లేవు. కథాగమనంలో ఓ పాట వచ్చి వెళ్లిపోతుంంది.  బ్రో సినిమాలో మూడు పాట‌ల్ని పెట్టారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.
  • మాతృకలో ఎలాంటి యాక్షన్‌సీక్వెన్స్‌ లేవు. పూర్తి కుటుంబ కథా చిత్రం, ఎమోషన్స్‌ మేళవించి తీశారు. ఇందులో ఒకట్రెండు ఫైట్స్‌ సీక్వెన్స్‌ ఉన్నాయి. అలాగే, సాయిధ‌ర‌మ్‌తేజ్ పాత్ర‌కు ల‌వ్ స్టోరీతో పాటు ఇద్ద‌రు హీరోయిన్ల‌ను పెట్టారు.
  • వినోద‌య సిత్తం ర‌న్‌టైమ్ 99 నిమిషాలే కాగా బ్రో మూవీ ర‌న్‌టైమ్ దాదాపు 135 నిమిషాలు. మాతృక‌తో పోలిస్తే ప‌వ‌న్ కల్యాణ్‌ పోషించిన టైమ్‌ క్యారెక్ట‌ర్ నిడివి పెంచారు. సముద్రఖని పాత్రకు పూర్తి భిన్నంగా పూర్తి ఎనర్జిటిక్‌తో చేశారు. మరి తెరపై పవన్‌ పవర్‌ప్యాక్‌ యాక్టింగ్‌ చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు