Pawan Kalyan: ఇది నేను కోరుకున్న జీవితం కాదు: పవన్‌ కల్యాణ్‌

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. జులై 28న విడుదలకానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది.

Published : 26 Jul 2023 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘ఇది నేను కోరుకున్న జీవితం కాదు. భగవంతుడు ఇలా నడిపిస్తున్నాడు. నటుడిని కావాలని, రాజకీయ నాయకుడిని అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. ‘బ్రో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. సాయిధరమ్‌ తేజ్‌ ( Sai Dharam Tej)తో కలిసి ఆయన నటించిన సినిమా ఇది (BRO). కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) హీరోయిన్లు. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగా హీరోలు వరుణ్‌తేజ్‌ (Varun Tej), వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సందడి చేశారు.

వేడుకనుద్దేశించి పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘బ్రో’ వేడుకకు వచ్చిన మా కుటుంబానికి (అభిమాలను ఉద్దేశిస్తూ) హృదయ పూర్వక నమస్కారం. ఇంత ప్రేమ, అభిమానం సినిమానే నాకు ఇచ్చింది. నా ప్రతి సినిమాలో సమాజానికి ఉపయోగపడే అంశం ఉండాలని కోరుకుంటా. ఈ సినిమాలో ఆ అంశం పూర్తిస్థాయిలో ఉంటుంది. కొవిడ్‌ సమయంలో ఈ సినిమా గురించి దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పారు. రచయిత, దర్శకుడిని నేను 100 శాతం నమ్ముతా. సముద్రఖని రాసిన మూల కథకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే అందించారు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని అద్భుతంగా రాశారు. సముద్రఖనిగారు తమిళనాడుకి చెందినవారు. అయినా తెలుగు భాషపై పట్టు సాధించారు. షూటింగ్‌ తొలిరోజు చూస్తే ఆయన తెలుగులో స్క్రిప్టు చదువుతున్నారు. ఈ వేదికపై మాటిస్తున్నా. ఆయన తెలుగు నేర్చుకున్నారు కాబట్టి నేను తమిళం నేర్చుకుంటా.  

మాతృభాష అయి ఉండి కూడా తెలుగు రాని ఎంతోమందికి సముద్రఖని ప్రయత్నం కనువిప్పు కలిగిస్తుంది. మాతృభాషలో ఉన్నంత బలం వేరే భాషలో ఉండదు. తెలుగు సాహిత్యం విలువని మనం తెలుసుకుంటే గొప్ప సినిమాలు తీయగలం. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లా నేను గొప్ప డ్యాన్స్‌ చేయలేకపోవచ్చు. ప్రభాస్‌, రానాల బలమైన పాత్రలను పోషించలేకపోవచ్చు. కానీ, సినిమా అంటే నాకు ప్రేమ. సమాజం అంటే బాధ్యత. ఈ చిత్ర పరిశమ్ర ఏ ఒక్క కుటుంబానికీ చెందింది కాదు. ఇది అందరిది. రాజకీయం కూడా అంతే. మేమంతా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం. స్టార్‌డమ్‌ సాధించిన తర్వాత ‘నువ్వు హీరో అవుతావా?’ అని అన్నయ్య చిరంజీవి నన్ను అడిగారు. ఆ ప్రశ్నకు నాకు భయమేసింది. ఎందుకంటే నా ఊహలో హీరో అంటే చిరంజీవినే. ఎప్పుడూ నన్ను నేను హీరోగా ఊహించుకోలేదు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ, పొలంలో పనిచేయాలని ఉండేది. మా వదిన నాలో మార్పు తీసుకొచ్చారు. మనల్ని నమ్మేవారు ఒకరుండాలి. 

తమన్నాకు రూ.2కోట్ల విలువైన వజ్రం గిఫ్ట్‌ ఇచ్చిన ఉపాసన.. అసలు కథ ఇది!

వైజాగ్‌ జగదాంబ సెంటర్‌లో బస్‌పై చిత్రీకరణ చేస్తున్న సమయంలో నాకు సిగ్గేసింది. నలుగురిలో నటించలేక ఏడుపొచ్చింది. మా వదినకు ఫోన్‌ చేసి ‘నువ్వెందుకు నన్ను సినిమాల్లోకి పంపించావ్‌’ అని అన్నా.  ‘‘ఆ రోజు మా వదిన చేసిన తప్పు.. ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది. ఆమె చేసిన ద్రోహం గురించి మాటల్లో చెప్పలేను (నవ్వుతూ)’’. అన్నయ్యను మించి కష్టపడాలని నిర్ణయించుకున్నా. శారీరకంగా కష్టపడేవాణ్ని. నేను మొరటు మనిషిని. నాకు తెలిసిదల్లా త్రికరణ శుద్ధితో పనిచేయడం. అదే కోట్లాది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఒకే కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు వచ్చారంటే చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ, మేమంతా గొడ్డు చాకిరి చేస్తాం. ప్రేక్షకులను అలరించేందుకు నిరంతరం శ్రమిస్తాం. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు.

న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించి, సినిమా రంగంలోకి అడుగుపెట్టి కథా రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్‌ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగులోనేకాదు హిందీ, సంస్కృతంలో ఆయనకు పట్టుంది. ఆయన్ను ప్రేరణగా తీసుకుని యువ రచయితలు రావాలని నేను కోరుకుంటున్నా. తెలుగు సినిమాని రాజమౌళిగారులాంటి వాళ్లు హాలీవుడ్‌ వరకు తీసుకెళ్లారు. రాబోయే వారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. అందరు హీరోల అభిమానుల్ని నేను ఇష్టపడతా. ఎందుకంటే ఒక్కో హీరో సినిమా చేయడం వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. సినిమా చేసేటప్పుడు మాత్రం మిగతావారికంటే పెద్ద హిట్‌ కొట్టాలని అనుకుంటా. ఆ విషయంలో కాంప్రమైజ్‌కాను. పోటీతత్వం ఉండాలి. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాంటి విజయాలు సాధించాలని ఉంటుంది. కానీ, నేను పూర్తిగా నటనవైపు మనసు పెట్టడంలేదు. టాలీవుడ్‌లో ఆరోగ్యకర వాతావరణం ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పవన్‌ అన్నారు. 

చిరంజీవి- కల్యాణ్‌ కృష్ణ కాంబో.. రూమర్స్‌పై నిర్మాత క్లారిటీ

సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘కల్యాణ్‌ మామయ్య ఓ రోజు ఫోన్‌ చేసి, కలవమన్నారు. వెళ్లాక ‘మల్టీస్టారర్‌ సినిమా ఒకటుంది.. నువ్వు మెయిన్‌ లీడ్‌, నేను ఓ పాత్ర పోషిస్తా’ అని చెప్పారు. అది వినగానే నేను షాక్‌ అయ్యా. మీ అందరూ కాలర్‌ ఎగరేసే సినిమా ఇది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్‌, నాగచైతన్యతో ‘వెంకీమామ’ నిర్మించింది. ఇప్పుడు మా ఇద్దరితో ‘బ్రో’ ప్రొడ్యూస్‌ చేసింది’’ అని అన్నారు.

బాబాయ్‌ వెనుక ఉంటాం: వరుణ్‌తేజ్‌

‘‘కల్యాణ్‌ బాబాయ్‌తో కలిసి సాయితేజ్‌ ఈ సినిమా చేస్తున్నాడని తెలిసి కొంత ఈర్ష్య పడ్డా. కానీ, తర్వాత 100 రెట్లు ఆనందం కలిగింది. ఎందుకంటే తేజ్‌కి బాబాయ్‌ అంటే చాలా ఇష్టం. ఆయన్ను ఓ గురువులా భావిస్తాడు. బాబాయ్‌ మా అందరికీ కష్టపడేతత్వాన్ని నేర్పించారు. రాజకీయంగా ఆయన ఎండావానల్లో తిరుగుతుంటే కొడుకుగా బాధపడతా. కానీ, మీ అందరికీ దగ్గరవుతున్నారని సంతోషిస్తా. నేను, రామ్‌చరణ్‌, వైష్ణవ్‌.. ఇలా మేం అందరం ఎప్పుడూ బాబాయ్‌ వెనుక ఉంటాం’’ అని పేర్కొన్నారు. సినిమా విజయం అందుకోవాలని వైష్ణవ్‌తేజ్‌ ఆకాంక్షించారు.

‘బ్రో’ చేయడానికి కారణం టైమ్‌: సముద్రఖని

‘‘తమిళనాడులో ఎక్కడో ఓ గ్రామంలో పుట్టి, ఇప్పుడు ‘బ్రో’ సినిమా ద్వారా మీ అందరి ముందు ఉండడానికి కారణం కాలం. నిజాయతీగా పనిచేస్తే ఎప్పుడూ విజయమే. ఈ సినిమా కాన్సెప్ట్‌ (తమిళ సినిమా వినోదాయ సిత్తం)ని ఓ రోజు త్రివిక్రమ్‌తో చెప్పగా వెంటనే తెలుగులో స్క్రిప్టు రెడీ చేశారు. పెద్ద హీరోతో సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెడితే ‘పవన్ కల్యాణ్‌ ఓకేనా’ అని అడిగారు. నేను ఆశ్చర్యపోయా. 70 రోజుల్లో చేయాల్సిన పనిని పవన్‌ 21 రోజుల్లో చేశారు. ఇది నా 15వ సినిమా’’ అని సముద్రఖని తెలిపారు.

వారిలో నేనూ ఒకడిని: బ్రహ్మానందం

‘‘ఈ సినిమాలో నేను చిన్న పాత్ర పోషించా. పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన విజయానికి మీరు అన్ని విధాల సహకరించాలని కోరుకుంటున్నా. ఆయన గురించి మాట్లాడగల అతి తక్కువ మందిలో నేనూ ఒకడిని అని భావిస్తున్నా. పవన్‌ నాకు ఎప్పటి నుంచో పరిచయం. చూడటానికి కాస్త సీరియస్‌గా ఉంటాడుగానీ చాలా సరదా మనిషి. ఆయన నవ్వు స్వచ్ఛమైంది’’ అని అన్నారు.

‘‘ఈ సినిమాలో నటించినందుకు గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. సాయిధరమ్‌ తేజ్‌ మంచి వ్యక్తి’’ అని కేతిక శర్మ తెలిపింది. ‘బ్రో’ సినిమా అవకాశం రావడం మరిచిపోలేని జ్ఞాపకమని ప్రియాప్రకాశ్‌ వారియర్‌ పేర్కొంది. నటుడిగానే కాకుండా వ్యక్తిగా పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తినిస్తుంటారని చెప్పింది. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని