వీరయ్య ఎన్నో సవాళ్లని అధిగమించారు: చిరంజీవి

ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలియజేశారు. చిత్ర పరిశ్రమకు వీరయ్య అందించిన సేవల్ని కొనియాడారు.

Published : 26 Apr 2021 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలియజేశారు. ‘వీరయ్య వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లని అధిగమించి, వందల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణించారన్న వార్త నన్ను ఎంతో కలచి వేసింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని అన్నారు.

వీరయ్య నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుకి చికిత్స పొందుతూ హైదరబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ‘అగ్గిదొర’ చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఆయన ఎన్టీఆర్‌, కాంతారావు, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌, రజనీకాంత్‌, కృష్ణ తదితర అగ్ర కథానాయకులతో కలిసి తెరను పంచుకున్నారు.

వైకల్యాన్ని జయించారు: జీవిత రాజశేఖర్‌

నటులు రాజశేఖర్, జీవిత దంపతులు వీరయ్యకు నివాళులు అర్పించారు. వీరయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. వీరయ్యతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  ‘వీరయ్య గారు తెలియని వాళ్లు ఉండరేమో. అగ్ర హీరోలందరితో ఆయన నటించారు. మాతోనూ కలిసి నటించారు. వైకల్యాన్ని జయించిన వీరుడు వీరయ్య. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మీటింగ్స్‌, అవార్డుల వేడుక.. ఇలా ఏ కార్యక్రమానికి పిలిచినా తప్పకుండా పాల్గొనేవారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. అలాంటి ఆయన మరణం బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి వీలైనంత సహాయం చేయాలని అనుకుంటున్నాం’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని