Oscars 2021: క్లోవీ చావ్‌ రికార్డ్‌

డేవిడ్‌ ఫించర్‌, థామస్‌ వింటెబెర్గ్‌, లీ ఐసాక్‌ చంగ్‌ వంటి పురుష దర్శకులను దాటి ఉత్తమ దర్శకత్వ విభాగంలో 93వ అకాడమీ అవార్డును ముద్దాడారు క్లోవీ చావ్‌. ‘నో మ్యాడ్‌ ల్యాండ్‌’ చిత్రానికి గానూ ఆమెను ఈ అవార్డు వరించింది....

Updated : 26 Apr 2021 12:07 IST

మూడు విభాగాల్లో అవార్డు పొందిన ‘నోమడ్‌ ల్యాండ్‌


ఇంటర్నెట్‌డెస్క్‌: డేవిడ్‌ ఫించర్‌, థామస్‌ వింటెబెర్గ్‌, లీ ఐసాక్‌ చంగ్‌ వంటి పురుష దర్శకులను దాటి ఉత్తమ దర్శకత్వ విభాగంలో 93వ అకాడమీ అవార్డును ముద్దాడారు క్లోవీ చావ్‌. ‘నోమడ్‌ ల్యాండ్‌’ చిత్రానికి గానూ ఆమెను ఈ అవార్డు వరించింది. ఆస్కార్‌ గెలుచుకున్న తొలి ఆసియన్‌ మహిళా దర్శకురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఉత్తమచిత్రం, ఉత్తమ నటి విభాగాల్లోనూ కూడా ‘నోమడ్‌ ల్యాండ్‌’ అవార్డు గెలుచుకుంది. దీంతో క్లోవీ చావ్‌, ఆమె తెరకెక్కించిన ‘నోమడ్‌ ల్యాండ్‌’ గురించే అందరూ గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు.

క్లోవీ జావ్‌ బీజింగ్‌లో పుట్టారు. ఆమె తండ్రి చైనాలో ప్రముఖ పారిశ్రామికవేత్త. సినిమాలంటే ఆమెకు చిన్నతనం నుంచే ఆసక్తి. చైనీస్‌ దర్శకుడు వాంగ్‌ కార్‌ వై చిత్రాలను ఆమె ఎక్కువగా ఇష్టపడేది. ఉన్నత చదువుల కోసం బ్రిటన్, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లారు. అదే సమయంలో సినిమా తీయాలని ఆలోచన ఆమెలో బలపడింది. దాంతో న్యూయర్క్‌లో ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కోర్సు చేసి.. ‘సాంగ్స్‌ ఆఫ్‌ మై బ్రదర్స్‌ టాట్‌ మీ’ చిత్రంతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ మేకర్‌గా మంచి పేరు సంపాదించారు. ‘సాంగ్స్‌ మై బ్రదర్స్‌ టాట్‌ మి’, ‘ది రైడర్‌’తో అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్న క్లోవీ జావ్‌ ఇప్పుడు ‘నోమడ్‌ ల్యాండ్‌’తో ప్రతి ఒక్కర్నీ మెప్పించారు.

ముచ్చటగా మూడుసార్లు: ఉత్తమ నటిగా రెండు సార్లు ఆస్కార్‌ గెలిచిన ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌ ముచ్చటగా మూడోసారి ఈ అవార్డు గెలుచుకున్నారు. క్లోవీ చావ్‌ దర్శకత్వం వహించిన ‘నోమడ్‌ ల్యాండ్‌’ చిత్రానికి గానూ ఆమెను అకాడమీ అవార్డు వరించింది. ‘ఫార్గో’, ‘బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి’ చిత్రాల్లో నటనకు గానూ ఆమెను ఇప్పటికే రెండుసార్లు ఆస్కార్‌ వరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని