Leo: థియేటర్లలో ‘లియో’ సందడి.. దండలు మార్చుకున్న యువజంట

విజయ్ తాజా చిత్రం ‘లియో’ థియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ పోస్ట్‌ చేశారు. అలాగే చెన్నైలో థియేటర్లో ఓ జంట దండలు మార్చుకోవడం వైరల్‌గా మారింది.

Published : 19 Oct 2023 13:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌-లోకేశ్‌ కనగరాజ్‌ల (Lokesh Kanagaraj) కాంబోలో తెరకెక్కిన ‘లియో’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరి అంచనాలను అందుకుని హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన ప్రముఖులు కూడా సోషల్‌ మీడియాలో అభినందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై దర్శకుడు ప్రశాంత్‌నీల్ పొగడ్తల వర్షం కురిపించారు.

‘‘లియో’ సినిమా అద్భుతం. విజయ్‌ (Vijay) యాక్షన్‌ మరో లెవెల్లో ఉంది. ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజ్‌ ఉంది. అలాగే అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ఆ సర్‌ప్రైజ్‌ను మ్యూజిక్‌ను చూసి థ్రిల్‌ అవ్వండి. చివరి 30 నిమిషాలు సినిమాకే అదనపు ఆకర్షణ. ‘లియో’ సినిమా మాత్రమే కాదు.. ఓ వేడుక’’ అని పోస్ట్‌ చేశారు. ఈ సినిమాను మొదటిరోజు మొదటి ఆట చూసినట్లు పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు ‘సలార్‌’ డిసెంబర్‌ 22న రానుందంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. 

రివ్యూ: భగవంత్‌ కేసరి.. బాలకృష్ణ యాక్షన్‌ డ్రామా ఎలా ఉంది?

ఇక మరోవైపు థియేటర్ల దగ్గర విజయ్‌ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమా మొదలు కాగానే బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. చెన్నైలోని ఓ థియేటర్లో విజయ్‌ను అభిమానించే ఓ జంట దండలు మార్చుకోవడం వైరల్‌గా మారింది. చెన్నైకు చెందిన వెంకటేష్, మంజుష అనే జంట అక్టోబర్‌ 20న పెళ్లిచేసుకోనున్నారు. వాళ్లిద్దరూ నేడు ‘లియో’ థియేటర్లో ఆడియన్స్ ఎదుట దండలు, ఉంగరాలు మార్చుకొన్నారు. ఇలా చేయడం కోసం వాళ్లు ఎనిమిది నెలల నుంచి వేచిచూసినట్లు తెలిపారు.

తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ మాట్లాడుతూ.. షూటింగ్‌ చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదు గానీ.. రిలీజ్‌కు ముందు మాత్రం కాస్త కంగారు పడినట్లు తెలిపారు. ఐమాక్స్‌లో రిలీజ్‌ చేయాలని ముందు భావించలేదని ఆ నిర్ణయం తర్వాత తీసుకున్నట్లు చెప్పారు. ‘లియో’(Leo) తీయడానికి అసలు కారణం ‘మాస్టర్‌’ సినిమానే అని అన్నారు. విజయ్‌ సినిమాలు అంటే ఏదో ఒక కాంట్రావర్సీ అవుతుందని.. ‘లియో’ వియషంలో ట్రైలర్లో అభ్యంతర పదాలు వాడినందుకు ఎన్నో విమర్శలు వచ్చాయన్నారు. ఒకవేళ అది కాకపోతే మరొక విషయం వార్తల్లో నిలిచేదని చెప్పారు. అలాగే చిత్రాన్ని తెరకెక్కించడం మాత్రమే తన చేతిలో ఉంటుందని.. బిజినెస్‌ తనకు సంబంధించిన వ్యవహారం కాదని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని