TeluguCinema: మ్యూజికల్‌ కాంబినేషన్‌ మారింది..!

టాలీవుడ్‌లో హీరో- హీరోయిన్‌, హీరో- డైరెక్టర్‌ కాంబినేషన్లకే కాదు డైరెక్టర్‌- మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌కీ మంచి క్రేజ్‌ ఉంటుంది. కొరటాల శివ- దేవి శ్రీ ప్రసాద్‌, శ్రీకాంత్‌ అడ్డాల- మిక్కీ జె. మేయర్‌, శివ నిర్వాణ- గోపీ సుందర్‌ కాంబోలు అలాంటివే. ఇప్పటి వరకు కొరటాల చిత్రాలన్నింటికీ దేవి, శ్రీకాంత్‌ అడ్డాల సినిమాకి మిక్కీ, శివ నిర్వాణ మూవీస్‌కి గోపీసుందర్‌ సంగీతం అందించారు.

Updated : 07 Dec 2022 19:55 IST

టాలీవుడ్‌లో హీరో- హీరోయిన్‌, హీరో- డైరెక్టర్‌ కాంబినేషన్లకే కాదు డైరెక్టర్‌- మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌కీ మంచి క్రేజ్‌ ఉంటుంది. కొరటాల శివ- దేవి శ్రీ ప్రసాద్‌, శ్రీకాంత్‌ అడ్డాల- మిక్కీ జె.మేయర్‌, శివ నిర్వాణ- గోపీ సుందర్‌ కాంబోలు అలాంటివే. ఇప్పటివరకు కొరటాల చిత్రాలన్నింటికీ దేవి, శ్రీకాంత్‌ అడ్డాల సినిమాలకు మిక్కీ, శివ నిర్వాణ మూవీస్‌కి గోపీ సుందర్‌ సంగీతం అందించారు. అవన్నీ మ్యూజికల్‌గా మంచి హిట్‌ అయ్యాయి. అయితే ‘బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌’ అనుకున్నారో! ఆయా సంగీత దర్శకుల డేట్స్‌ సర్దుబాటు కాలేదో కానీ ఈ ముగ్గురు దర్శకులూ తమ కొత్త చిత్రాలకి ఇతర సంగీత దర్శకుల్ని ఎంపిక చేసుకున్నారు. అవేం సినిమాలు, ఆ సంగీత దర్శకులెవరో తెలుసుకుందామా..! 

దేవి టు మణిశర్మ..

కొరటాల శివ- దేవి శ్రీ ప్రసాద్‌ కలయికలో వచ్చిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. దేవి అందించిన నేపథ్య సంగీతం కొరటాల కథల్ని మరోస్థాయికి తీసుకెళ్లిందనడంలో అతిశయోక్తి లేదు. అంతలా తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారాయన. కొరటాల చిత్రాలకు దేవి స్వరపరిచిన ప్రతి పాటా శ్రోతల్ని ఉర్రూలూగించింది. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్‌కి బ్రేక్‌ వచ్చింది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ‘లాహే లాహే’ పాట విశేషంగా ఆకట్టుకుంది. మరి మణిశర్మతో కొరటాల ఇంకా ఎలాంటి పాటలు రాబట్టుకున్నారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఈ సినిమాలో చిరు సరసన కాజల్‌ నటిస్తోంది. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలన్నింటికీ మిక్కీ జె. మేయర్‌ స్వరాలు సమకూర్చారు. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ఆల్బమ్స్‌ శ్రోతల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ సారి తన కొత్త సినిమా సంగీత దర్శకుడిగా మణిశర్మకి అవకాశం ఇచ్చారు శ్రీకాంత్‌. వెంకటేశ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల ‘నారప్ప’ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం అందుకున్న ‘అసురన్‌’కి రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్రానికే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కథలో భాగంగా వచ్చే పాటలు తప్ప ఐటెమ్‌ గీతాలు, ఫాస్ట్‌బీట్‌లు, మెలొడీలు ఇందులో ఉండవు. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రధాన బలం. బీజీఎమ్‌ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌) ఇవ్వడంలో మణిశర్మకి మంచి పేరుంది. మరి ఈసారి మణిశర్మ ఏం రేంజ్‌లో బీజీఎం ఇస్తారో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియమణి, ప్రకాశ్‌ రాజ్‌, కార్తీక్‌ రత్నం, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వి. క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రానుంది. శ్రీకాంత్‌ గతంలో తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి మణిశర్మనే బీజీఎం అందించారు.  

వాటికి గోపీ సుందర్‌.. ‘జగదీష్‌’కి తమన్‌

‘నిన్నుకోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన కథల్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మాయ చేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ రెండు సినిమాలకు గోపీ సుందర్‌ అందించిన పాటలు శ్రోతల్ని హత్తుకున్నాయి. తన మూడో చిత్రానికి తమన్‌కి అవకాశం ఇచ్చారు శివ. నాని హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి తమన్‌ అందించిన సంగీతం అద్భుతమని ఇప్పటికే విడుదలైన ‘కోలో కోలన్న’, ‘ఇంకోసారి’, ‘నీటి నీటి సుక్కా’ పాటలు నిరూపించాయి. షైన్‌ స్ర్కీన్స్‌ సంస్థ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు