
Dasari Narayana Rao: ‘దర్శకరత్న’.. దాసరి పాత్రలో జాతీయస్థాయి నటుడు!
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత దివంగత దాసరి నారాయణరావు జీవిత కథ ఆధారంగా ‘దర్శకరత్న’ అనే చిత్రం తెరకెక్కనుంది. ధవళసత్యం దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై తాడివాక రమేష్ నాయుడు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విశేషాల గురించి చెప్పేందుకు ఫిలిం ఛాంబర్లో చిత్ర బృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది.
‘‘దాసరి నారాయణరావు గారితో నాకున్న అనుబంధమే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పురిగొల్పింది. ఆయన జీవితానికి సంబంధించి.. నాకు తెలిసిన సంఘటనలతో పాటు ఆయనతో పరిచయమున్న చాలామందిని సంప్రదించి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నా. ఓ గొప్ప చిత్రంగా తెరకెక్కించబోతున్నాం’’ అని దర్శకుడు ధవళసత్యం అన్నారు. ‘‘కొవిడ్ మూడో వేవ్ రాకపోయి ఉంటే ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యేది. పరిస్థితులు చక్కబడగానే షూటింగ్ మొదలుపెడతాం. జాతీయస్థాయి నటుడు దాసరి గారి పాత్రలో కనిపిస్తారు. ఆయన భార్య దాసరి పద్మ పాత్రలో ప్రముఖ నటి కనిపిస్తారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించబోతున్నాం’’ అని నిర్మాత తాడివాక రమేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, నటుడు కాశీ విశ్వనాథ్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ పి. రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.