ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్‌ జానకి

ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగారు. ఏ పాత్రలోనైనా వారి ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. నాటి నటీమణులైనప్పటికీ నేటి తరానికి కావాల్సిన విలువలు సైతం వారి సొంతం.....

Published : 23 Apr 2021 01:04 IST

‘ఆలీతో సరదాగా’లో జ్ఞాపకాలు నెమరువేసుకున్న నటీమణులు

ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగారు. ఏ పాత్రలోనైనా వారి ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. నాటి నటీమణులైనప్పటికీ నేటి తరానికి కావాల్సిన విలువలు వారి సొంతం. వారి మాటల్లో ఆత్మీయత కనబడుతుంది. ఆప్యాయత వినపడుతుంది. వాళ్లే అలనాటి తారలు కృష్ణవేణి, డబ్బింగ్‌ జానకి. తాజాగా వీళ్లిద్దరూ ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాఖ్యాత ఆలీతో పలు సరదా విశేషాలను పంచుకున్నారు. అలాగే అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.

మీ పేరు డబ్బింగ్‌ జానకిగా మారడానికి కారణమేమిటి?

జానకి: నా అసలు పేరు దాసరి జానకి. కానీ అందరికీ నేను డబ్బింగ్‌ జానకిగానే పరిచయం. అప్పట్లో ఇండస్ట్రీలో మొత్తం ముగ్గురు జానకిలు ఉండేవాళ్లం. షావుకారు జానకి, సింగర్‌ జానకి, అలాగే నేను. నేను డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించిన తర్వాత పత్రికల్లో వార్తలు రాసేటప్పుడు నా పేరు డబ్బింగ్‌ జానకి అని రాసేవాళ్లు. ‘డబ్బింగ్‌ జానకి’ పేరు నాకు ప్లస్సే అయ్యింది.

యాక్టింగ్‌ లేదా డబ్బింగ్‌.. ఈ రెండింటిలో మీకు ఎక్కువ జీవనోపాధి కలిగించింది ఏమిటి?

జానకి: నటన.. నాటకాలు, సినిమాలు

మీ అసలు ఊరేది?

జానకి: పెద్దాపురం. ఇప్పటికీ మా బంధువులందరూ అక్కడే ఉన్నారు. ఎప్పుడైనా రాజమండ్రి వెళితే ఊరు వెళ్లి మా వాళ్లందర్నీ ఒక్కసారి పలకరించి వస్తాను.

పెద్దాపురం నుంచి చెన్నైకి ఎలా వచ్చారు?

జానకి: మా సొంతూరు నుంచి చెన్నై రావడానికి మా ఆయనే కారణం. ఆయన మిలటరీలో పనిచేసేవారు. నాకు పదహారేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయనే నన్ను చెన్నైకి తీసుకువెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మేమిద్దరం అక్కడే స్థిరపడ్డాం. మిలటరీ పర్సన్‌ కావడంతో ఆయన తరచూ క్యాంపులకు వెళ్లి వస్తుండేవారు. దాంతో నేను నాటకాలు వేసిన అనుభవంతో సినిమాల్లో ప్రయత్నాలు చేశాను.

ఇప్పటివరకూ ఎన్ని సినిమాల్లో నటించారు?

జానకి: తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ పరిశ్రమల్లో ఇప్పటివరకూ సుమారు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశా. మొట్టమొదటిసారి నేను తెరపై కనిపించింది ఏవీఎం వాళ్లు నిర్మించిన చిత్రంలో.

కృష్ణవేణి గారు మీ సొంతూరు ఏది

కృష్ణవేణి: తూర్పుగోదావరి జిల్లా కూళ్ల మల్లవరం.

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కనిపిస్తున్నారు కదా?

కృష్ణవేణి: చాలా చిత్రాల్లో నటించిన తర్వాత కొంతకాలం పాటు చిన్న బ్రేక్‌ తీసుకున్నాను. అలాంటి సమయంలో ధారావాహికల్లో నటించే అవకాశం లభించింది. దాంతో నటిగా మళ్లీ బిజీ అయిపోయాను. అందుకు చాలా సంతోషంగా ఉంది.

చిన్నప్పుడు అమ్మ చేతిలో బాగా దెబ్బలు తిన్నారట?

జానకి: చిన్నప్పుడు తాళాల గుత్తి అలంకరించుకోవడమంటే నాకెంతో ఇష్టంగా ఉండేది. మా అమ్మ ఎప్పుడైనా టేబుల్‌పై తాళాలగుత్తి పెడితే వెంటనే నేను దాన్ని తీసుకుని గౌనుకి తగిలించుకుని ఆనందించేదాన్ని. ఓసారి అలాగే చేసినప్పుడే తాళాలగుత్తి ఎక్కడో పడిపోయింది. మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుందని భయపడి.. మా ఇంట్లో నేత నేసే చోట గొయ్యిలో దాక్కుని నిద్రపోయాను. మా అమ్మవాళ్లు చాలాసేపు వెతికారు. చివరికి నేత నేయడానికి వచ్చిన సమయంలో వాళ్ల కాళ్లకి తగలడంతో నన్ను బయటకు లాగి అమ్మ బాగా కొట్టింది (నవ్వులు).

నటిగా మీకు గుర్తింపునిచ్చిన చిత్రమేది?

జానకి: ‘శంకరాభరణం’. ఆ సినిమాలో నాది చిన్న పాత్రే అయినప్పటికీ బాగా గుర్తింపు వచ్చింది. అలాగే ‘సాగరసంగమం’తో నాకు పాపులారిటీ పెరిగింది.

కెరీర్‌లో మీకు లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు ఎవరు?

జానకి: లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు అంటే చాలా మంది ఉన్నారు. ఒక్కరు అని చెప్పడానికి లేదు. ఈరంకి శర్మగారు మూడు సినిమాల్లో నాకు మూడు విభిన్నమైన పాత్రలు ఇచ్చారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నేను 17 సినిమాల్లో నటించాను. జంధ్యాల, బాపు, భారతీరాజా, భాగ్యరాజా.. ఇలా ఎంతోమంది ప్రముఖ దర్శకులతో వర్క్‌ చేశాను.

మీరు స్క్రీన్‌కి పరిచయమైన చిత్రమేది?

కృష్ణవేణి: విశ్వేశ్వరావు దర్శకత్వం వహించిన ‘నగ్నసత్యం’తో నేను వెండితెరకు పరిచయమయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో నటించాను.

సినిమా థియేటర్‌లోనే నిద్రపోయేవాళ్లంట?

కృష్ణవేణి: చిన్నప్పుడు అంతగా ఏమీ తెలిసేది కాదు. మా ఇంటి దగ్గర టూరింగ్‌ టాకీస్‌ ఉండేది. సినిమా చూడడానికి వెళ్లి నిద్రవస్తే అక్కడే పడుకునిపోయేదాన్ని. ఆ తర్వాత తాతయ్య వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్లేవాడు.

ఒక మనిషితో మాట్లాడితే కొన్ని నిమిషాల్లోనే అతని స్వభావం ఎలాంటిదో మీరు అంచనా వేసేస్తారట?

కృష్ణవేణి: నేను పెద్దగా చదువుకోనప్పటికీ మనుషుల స్వభావం గురించి తెలుసుకోగలిగాను. నాతో ఎవరైనా కొత్త వ్యక్తులు మాటలు కలిపితే.. వెంటనే వాళ్లతో ఎంతవరకూ మాట్లాడాలి అనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చేస్తాను.

మీకు మీ కారు నంబర్‌ గుర్తుందా?

కృష్ణవేణి: 14 సంవత్సరాల నుంచి నేను ఓకే కారులో ప్రయాణం చేస్తున్నాను. కానీ దాని నంబర్‌ గుర్తుపెట్టుకోలేదు. ఎప్పుడైనా షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లినప్పుడు రిమోట్‌తో నా కారు ఎక్కడ ఉందో తెలుసుకుంటాను. ఒకవేళ ఆ రిమోట్‌ పనిచేయకపోతే ఇక అంతే సంగతి. (నవ్వులు)

మీకు డ్రైవింగ్‌ వచ్చా?

కృష్ణవేణి: 1976లోనే నాకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ వచ్చింది. కారు, బస్సు, లారీ, ట్రాక్టర్‌ నడపగలను. ఇక్బాల్‌ అని నాకో ఫ్రెండ్‌ ఉండేవాడు. తను పైలట్‌. ఓసారి అతను నాకు ఫ్లైట్‌ నడపడం కూడా నేర్పించాడు.

ఫ్లైట్‌ అంటే మీకు చాలా భయమంట కదా?

జానకి: అవునండి నాకు చాలా భయం. ఇప్పటికీ ఆ భయముంది. ‘సీతాకోకచిలుక’ చేస్తున్న సమయంలో ‘సప్తపది’ డబ్బింగ్‌ కోసం చెన్నై నుంచి త్రివేండ్రం వరకూ విమానంలో వెళ్లాను. విమానం టేకాఫ్‌ అవ్వగానే కంగారు వచ్చేసింది. ‘దేవుడా.. నేను అయిపోయాను’ అనుకున్నా. బస్సులో కూడా తక్కువగా ప్రయాణిస్తా. నేను ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడతా.

ఇండస్ట్రీలో మీరు కాకుండా మీ కుటుంబసభ్యులు ఎవరైనా ఉన్నారా?

జానకి: మా పెద్దబ్బాయ్‌ శ్యామ్‌ సంగీత దర్శకుడిగా చేస్తున్నాడు. రెండు, మూడు సినిమాలకు సంగీతం అందించాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలు విడుదల కాలేదు. దాంతో ఇప్పుడు దైవభక్తికి సంబంధించిన పాటలు రికార్డు చేస్తున్నాడు. ఇక మా అమ్మాయి లక్ష్మి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చేస్తోంది. రెండో అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.

మీకు కూడా ఫ్లైట్‌ ఎక్కడమంటే ఏమైనా భయం ఉందా?

కృష్ణవేణి: నేను మూడు రోజులపాటు ఫ్లైట్‌లోనే జర్నీ చేశాను. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన సతీమణితో కలిసి ఆయన.. నేను నటించిన ‘ధర్మవడ్డీ’ చిత్రాన్ని వీక్షించారు. మిలటరీ వాళ్లందరూ తప్పకుండా ఆ సినిమా చూడాలని చిత్రబృందాన్ని గ్వాలియర్‌, గ్యాంగ్‌టక్‌కు తీసుకువెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల మూడు రోజులపాటు ఫ్లైట్‌లోనే ఉండాల్సి వచ్చింది. దాంతో సరైన భోజనం లేక నేను బాగా ఇబ్బందిపడ్డా. ముంబయి చేరుకున్నాక మా మామయ్య ఓ రెస్టారెంట్‌లోకి పంపించి భోజనం చేయమన్నారు. కానీ అక్కడికి వెళ్లగానే కడుపులో తిప్పేసింది. మా మామయ్య వెంటనే ఓ గ్లాస్‌ జ్యూస్‌ ఇచ్చారు. అది తాగిన తర్వాత కొద్దిగా సెట్‌ అయ్యిందనిపించింది. ఏదో నిరాహార దీక్ష విరమించిన భావన కలిగింది. (నవ్వులు)

నటిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారట?

కృష్ణవేణి: అవును రెండు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాను. అందులో ఒకటి ‘ఇల్లాలు వర్ధిల్లు’, మరొకటి ‘ధర్మవడ్డీ’. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి వెళ్లాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం బుల్లితెర ధారావాహికల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను.

మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణమైన వ్యక్తి ఎవరు?

కృష్ణవేణి: మా మామయ్య పాండు రంగారావుగారు. ఆయన న్యాయవాది. నన్ను నటన వైపు నడిపించిందే ఆయన. మేము ఓ నాటకం వేస్తున్నప్పుడు దర్శకుడు విశ్వేశ్వరావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. అప్పట్లో రమీజాబి గురించి గొడవలు జరుగుతున్నాయి. ఆమెనే హీరోయిన్‌గా పెట్టుకుని ఓ సినిమా చేయాలనే ఉద్దేశంతో విశ్వేశ్వరరావు గారు ఓ కథ రాసుకున్నారు. ఇంతలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. మా నాటకం చూసిన వెంటనే కృష్ణవేణిని పెట్టి సినిమా చేస్తా అన్నారు. అలా ఆయన నన్ను.. ‘నగ్నసత్యం’తో వెండితెరకు పరిచయం చేశారు. విశ్వేశ్వరరావు గారు ఓ కన్ను.. పాండురంగారావు గారు మరోకన్ను. వాళ్లిద్దరి వల్లే నేను సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డాను.

మీ నటనకు పొందిన అవార్డుల్లో మీరు గర్వంగా చెప్పుకునే సినిమా ఏది? అవార్డు ఏది?

జానకి: ‘ఆమూల్యం’ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. స్టేజ్‌ పోటీల్లో ఎన్నో అవార్డులు వచ్చాయి. 1979లో నన్ను కన్నాంబ అవార్డు వరించింది. రాజమండ్రి ఎల్‌కేఎన్‌ పరిషత్‌లో జరిగిన నాటక పోటీల్లో ఎంతోమంది గొప్ప నటీనటుల్ని దాటుకుని నేను ఆ అవార్డు సొంతం చేసుకున్నా. పోటీ ఫలితాలను ప్రకటిస్తున్న సమయంలో న్యాయ నిర్ణేతలు పేర్లు అనౌన్స్‌ చేయడానికి ఓ కవర్‌ ఓపెన్‌ చేయగానే అందరూ ‘జానకీ జానకీ’ అంటూ కేకలు వేశారు. నా నటన పట్ల వాళ్లు చూపించిన ఆదరణకు ఆరోజు కన్నీళ్లు వచ్చేశాయి.

సినిమా, నాటకం ఏదంటే మీకు ఎక్కువ ఇష్టం?

జానకి: నాటకం. ప్రత్యేక్షంగా ప్రేక్షకుల ఎదుటే మనం ప్రదర్శిస్తాం. నటన నచ్చితే ప్రజలు కొట్టే చప్పట్లే మాకు ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం వల్ల పొందే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.

కిళ్లీ తిని మీరు ఆస్పత్రిలో చేరారంట?

జానకి: చిన్నప్పుడు మా ఇంటి అరుగుపై ఓ వ్యక్తి కిళ్లీషాపు పెట్టుకున్నాడు. అతను కిళ్లీ ఎలా కడుతున్నాడా అని ప్రతిరోజూ చూసేదాన్ని. ఓరోజు ఆయన బయటకు వెళ్తూ కొంతసేపు నన్ను షాపులో కూర్చొమన్నాడు. సరే కదా అని వెళ్లి.. తమలాపాకు తీసుకుని వక్కతోపాటు అన్ని రకాల మసాలాలను కలిసి కిళ్లీ సిద్ధం చేసుకున్నాను. షాపు ఆయన వచ్చేస్తున్నాడని గ్రహించి వెంటనే దాన్ని తినేశాను. దాంతో కళ్లు తిరిగి పడిపోయాను. వెంటనే మా ఇంట్లో వాళ్లు ఆస్పత్రిలో చూపించి.. చికిత్స చేయించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ నేను కిళ్లీ తినలేదు.

పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు?

కృష్ణవేణి: నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేశారు. 14 సంవత్సరాలు వచ్చే సరికి ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇప్పుడు నాకో ముని మనవరాలు ఉంది.

స్కూల్‌ డేస్‌లోనే రక్తం రుచి చూశారట?

కృష్ణవేణి: స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఎక్కువగా కాలువలో ఆడుకునేదాన్ని దాని వల్ల జుట్టు పాడైపోతుందని మా అమ్మ ప్రతిరోజూ తిట్టేది. ఓ సారి ఆమె నా జుట్టు కత్తిరించేసింది. దాంతో నన్ను అందరూ బోడి, బోడి అనే పిలిచేవారు. అదే సమయంలో నాకు పెళ్లి చేసేశారు. పెళ్లి అయ్యాక అమ్మ నా మెడలో నల్లపూసలు కట్టి పంపించింది. నాకు పెళ్లి అయ్యిందని తెలిసి స్కూల్‌లో వాళ్లందరూ షాక్‌ అయ్యారు. బోడీకి పెళ్లి అయ్యింది అంటూ కామెంట్లు చేశారు. నాకు బాగా కోపం వచ్చేసి.. వెళ్లి వాళ్ల చేతులు కొరికేశా. అలా చిన్నప్పుడే రక్తం రుచి చూశా. ఆ తర్వాత గోడ దూకి ఇంటికి వచ్చేశా. వాళ్ల పెద్ద వాళ్లందరూ గొడవకు వచ్చారు.

సెట్‌లో బాధపడిన సంఘటన ఏదైనా ఉందా?

జానకి: ఆర్టిస్టులన్నప్పుడు అందర్నీ ఒకేలా చూడాలి. కానీ కొన్ని సార్లు కొంతమందిని ఎక్కువగా మరికొంతమందిని తక్కువగా చూసేవాళ్లు. అలాంటి సందర్భంలో బాధగా అనిపించేది. అలాగే హీరోయిన్స్ పాత్రలు ఇచ్చి.. తీరా ఉదయాన్నే సెట్‌కి వెళ్లే సరికి మన స్థానంలో వేరే వాళ్లను తీసుకోవడం చూసి బాగా బాధపడ్డా. నేను అందరితోనూ సరదాగా ఉంటాను. కానీ ఎవరైనా కించపరిచి మాట్లాడితే తట్టుకోలేకపోయేదాన్ని. బాధగా అనిపించేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని