SSMB29: రాజమౌళి-మహేశ్‌ మూవీ లేటెస్ట్‌ అప్‌డేట్.. ఇక మొదలు పెట్టడమే ఆలస్యం!

మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమా గురించి చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్‌ అప్‌డేట్‌ను పంచుకున్నారు.

Published : 19 Jan 2024 18:10 IST

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులను పలకరించారు మహేశ్‌బాబు (Mahesh babu). త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ఇక ఇప్పుడు సినీ అభిమానులందరి మదిని తొలిచేస్తున్న ఏకైక ప్రశ్న రాజమౌళి-మహేశ్‌ మూవీ ఎప్పుడు...? ఈ ప్రశ్నకు సమాధానంగా రచయిత, రాజమౌళి (Rajamouli) తండ్రి విజయేంద్రప్రసాద్‌ స్పందించారు. మహేశ్‌బాబుతో చేస్తున్న మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్లు ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దీంతో మహేశ్‌బాబు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్‌ అవుతోంది. ఇక సినిమాను అధికారికంగా లాంచ్ చేసి, షూటింగ్‌ మొదలు పెట్టడమే ఆలస్యం.

సాధారణంగా రాజమౌళి తన సినిమా మొదలు పెట్టేటప్పుడు విలేకరుల సమావేశం నిర్వహించి, తన ప్రాజెక్ట్‌ గురించి అనేక విషయాలను పంచుకుంటారు. మహేశ్‌ మూవీ విషయంలోనూ ఇదే అనుసరిస్తారా? లేక అంతా గోప్యంగా ఉంచుతారా? అన్నది తెలియాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత మహేశ్‌ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. మామూలుగా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే ఆయన, ఈ సారి ఒంటరిగా వెళ్లారు. రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన టెక్నికల్‌ అంశాలపై చర్చించేందుకు అక్కడకు వెళ్లారని టాలీవుడ్‌ టాక్‌. నాలుగైదు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొంటున్నారని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే లొకేషన్ల వేట కూడా పూర్తయిందట. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియపై దృష్టిసారించినట్లు సమాచారం. ఈ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సినిమా వివరాలను రాజమౌళి స్వయంగా వెల్లడించనున్నారు. ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త అవతార్‌లో మహేశ్‌బాబును జక్కన్న చూపించనున్నారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడి పాత్రలో మహేశ్‌ కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని