రెండు దశాబ్దాల ‘కలిసుందాం...రా’

సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ, కుటుంబమంతా కలిసి చేసుకునే పండుగ. అటువంటి పండుగకు అందర్నీ మెప్పించేలా ఒక పూర్తి స్థాయి కుటుంబ నేపథ్యం ఉన్న సినిమా విడుదలైతే ఎంత

Updated : 06 Jul 2021 18:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ, కుటుంబమంతా కలిసి చేసుకునే పండుగ. అటువంటి పండుగకు అందర్నీ మెప్పించేలా ఒక పూర్తి స్థాయి కుటుంబ నేపథ్యం ఉన్న సినిమా విడుదలైతే ఎంత పెద్ద సూపర్‌హిట్‌ అవుతుందో తెలిపే చిత్రమే ‘కలిసుందాం..రా’. ఇరవై వసంతాల కిందట సరిగ్గా ఇదే రోజున(జనవరి 14) విడుదలైంది ఈ మ్యూజికల్‌ హిట్‌ మూవీ. ఉదయ్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రమిది. సిమ్రన్‌ కథానాయిక. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ముఖ్య పాత్ర పోషించారు. రాజ్‌ కూమార్‌ స్వరపరిచిన గీతాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌.

కథేంటంటే: తాతయ్య వీరవెంకట రాఘవయ్య (కె.విశ్వనాథ్) షష్టిపూర్తికి ముంబయి నుంచి వస్తుంది రఘు(వెంకటేశ్‌) కుటుంబం. రఘు అందరినీ ఆటపట్టిస్తూ, సంతోషపరుస్తూ ఉంటాడు. ఎన్నో చిలిపి తగాదాల తరువాత మంగ(సిమ్రన్‌), రఘు ప్రేమలో పడతారు. ఆ ఊరి ఆనకట్ట విషయంలో చాకచక్యంగా మాట్లాడి అందరి మెప్పు పొందుతాడు. మనవడి వాగ్దాటికి మురిసిన రాఘవయ్య అతనికి బహూకరించేందుకు బంగారు గొలుసు తేవడానికి ఇంటికి వెళ్లగా, ఈలోగా మాటా మాటా పెరిగి ఎర్రబాబు(శ్రీహరి)తో గొడవ పడతాడే రఘు. అది చూసిన రాఘవయ్య.. రఘుని చెంపదెబ్బ కొడతాడు. అసలు రాఘవయ్య తన మనవడిని కొట్టడానికి కారణం ఏంటి? ఎర్రబాబుతో రాఘవయ్యకుటుంబానికి ఉన్న గొడవేంటి? ఆ తర్వాత ఆ రెండు కుటుంబాలను రఘు ఎలా కలిపాడు? చివరకు మంగను ఎలా పెళ్లి చేసుకున్నాడు. అన్నదే ‘కలిసుందాం రా..’కథ.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ  చిత్రం కుటుంబ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇందులోని పాటలన్నీ సూపర్‌ హిట్టే. ప్రతి పాట కూడా కథానుగుణంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల్ని ఇంతగా అలరించిన ఈ చిత్రం హిందీ, కన్నడలోకి కూడా రీమేక్‌ అయ్యింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును పొందింది. వెంకటేష్‌ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.  బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి ఈ చిత్రం 103 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని