ఆ రోజే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది!

తొలినాళ్లలో నటుడిగా తనదైన ముద్రవేసిన హరికృష్ణ.. ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే నడిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో

Updated : 27 Jan 2020 19:33 IST

ఆ పాత్ర చేయడానికి అందరూ భయపడుతుంటే...!

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలినాళ్లలో నటుడిగా తనదైన ముద్రవేసిన హరికృష్ణ.. ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే నడిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘శ్రీరాములయ్య’తో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అందులో ‘సత్యం’ పాత్ర చేయడానికి చిత్ర పరిశ్రమలోని వారందరూ భయపడుతుంటే ధైర్యంగా ఆ పాత్ర చేసి మెప్పించారు హరికృష్ణ.

‘‘పరిటాల రవి వచ్చి ‘సత్యం క్యారెక్టర్‌ నువ్వు చేయాల్సిందే’ అని అడగడంతో సరేననక తప్పలేదు. నిజానికి ఆ వేషం వేయడానికి పరిశ్రమలో చాలామంది భయపడ్డారు. ఎందుకంటే అది ఓ నక్సలైటు పాత్ర. ‘అసలేమిటీ సత్యం మాస్టారు నేపథ్యం’ అని రవిని అడిగాను. ‘ఆయన ఓ మాస్టారు. నక్సలైటుగా మారారు. ఆయన చేతులు నరికినా ముంజేతులతో కరప్రతాలు రాసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ముఖ్యంగా రాములయ్యని ఉత్తేజపరిచిన వ్యక్తి’ అని చెప్పడంతో ఒప్పుకొన్నాను. ‘సీతారామరాజు’లో కుటుంబ పెద్దగా, ‘సీతయ్య’లో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ఆడిన మాట తప్పని ‘శివరామరాజు’ల తండ్రిగా, రైతు సమస్యల మీద పోరాటం చేసిన ‘టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌’గా.. ఇలా అన్నీ సందేశాత్మక పాత్రలే. మళ్లీ నటించాలన్న కోరికతో ఈ సినిమాలు చేయలేదు. ఇవన్నీ సమాజాన్ని అంతో ఇంతో ప్రభావితం చేసేవే. అందుకే చేశా’’ అని తాను మళ్లీ సినిమాల్లోకి రావడం వెనుక ఉన్న కారణాన్ని చెప్పేవారు హరికృష్ణ.

ఇక వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ఆయన నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అందులో ఓ సన్నివేశాన్ని ప్రాణాలకు తెగించి మరీ చేశారు హరికృష్ణ. తన ప్రత్యర్థి జయప్రకాష్‌రెడ్డి ఎదురుగా కారులో వస్తుండగా, ఆగమని హరికృష్ణ లైట్లు వేసినా ఆగకుండా వచ్చేస్తాడు. దీంతో కార్లు రెండూ రైల్వే ట్రాక్‌పైకి వచ్చి సరిగ్గా మధ్యలో ఆగిపోతాయి. కొద్దిసేపటి వరకూ ఎవరూ వెనక్కి తగ్గరు. అదే సమయంలో రైలు వేగంగా వస్తుండటంతో భయపడిన జయప్రకాష్‌రెడ్డి తన కారును వెనక్కి పోనీయమని చెబుతాడు. అయితే, వెంటనే హరికృష్ణ తన కారును స్టార్ట్‌ చేసి ముందు పోవాల్సి ఉండగా, కారు స్టార్ట్‌కాలేదట. అయినా, హరికృష్ణ భయపడకుండా మరో రెండు, మూడు సార్లు ప్రయత్నిస్తే కారు స్టార్ట్‌ అయి ముందుకు కదిలింది. లేకపోతే ఆ రోజు పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ సన్నివేశం తర్వాత యూనిట్‌ సభ్యుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయిందట. దర్శకుడు వైవీఎస్‌ చౌదరి అయితే ఒక్కసారిగా షాకయ్యారట. అలా కారును ముందుకు నడిపిన తర్వాత హరికృష్ణ చెప్పే డైలాగ్‌ ఏంటో తెలుసా? ‘మగాడు అన్నాక తెగింపు ఉండాలిరా! చావుకి మనం భయపడకూడదు. చావే మనల్ని చూసి భయపడాలి’! వెండితెరపైనే కాదు, నిజం జీవితంలో హరికృష్ణ చాలా డేరింగ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని