చిరంజీవి ఆ బజార్‌కు వెళ్లేవారు కాదట!

సినిమా పరిశ్రమలో వారసులకు కొదవలేదు. కానీ, నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ స్టార్‌ హీరో స్థాయికి ఎదగడం మామూలు

Updated : 03 Mar 2020 18:39 IST

హైదరాబాద్: సినిమా పరిశ్రమలో వారసులకు కొదవలేదు. కానీ, నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ స్టార్‌ హీరో స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. అలా స్వయంకృషితో పైకి వచ్చిన వాళ్లు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో పాటు సానుకూల ఆలోచన ధోరణి కూడా నటులకు ముఖ్యమే. అలాంటివన్నీ కలబోసిన కొద్దిమంది వ్యక్తుల్లో ‘మెగాస్టార్‌’ చిరంజీవి ఒకరు. స్వశక్తితో పైకి వచ్చిన ఆయన తోటి నటీనటులతో పాటు, అభిమానుల పట్ల ఎంతో గౌరవ, మర్యాదలతో నడుచుకుంటారు. ముఖ్యంగా ప్రతి విషయంలో సానుకూల ధోరణితో ఆలోచిస్తారు. నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకు, ఆ ప్రాంతానికి దూరంగా ఉంటానని కప్ప కథను జోడిస్తూ, ఆనాటి విశేషాలను చిరంజీవి ఇలా చెప్పుకొచ్చారు.

‘‘కొన్ని కప్పలు నిటారుగా ఉన్న స్తంభాన్ని ఎక్కాలని ప్రయత్నిస్తున్నాయట. కొంతమంది ‘కప్పలేంటి.. స్తంభం ఎక్కడం ఏంటి’ అని ఎగతాళి చేశారట. ఆ మాట ఎక్కడానికి ప్రయత్నిస్తున్న కొన్ని కప్పల చెవిన పడింది. వెంటనే ఆ కప్పలు ‘అవునా... అంత ఎత్తు ఎక్కలేమా’ అని నీరసపడిపోయి ఆగిపోయాయి. ఆ మాటలు పట్టించుకోని కొన్ని కప్పలు ఎక్కడం మొదలు పెట్టాయి.  దాదాపు మూడొంతులు ఎక్కిన తర్వాత ‘చూస్తూ ఉండండి. ఆ కప్పలు కింద పడిపోతాయి’ అనే మాటలు వినిపించాయి. వాటిలో కొన్నింటికి నమ్మకం పోయి కింద పడిపోయాయి. నాలుగైదు కప్పలు మాత్రం దాదాపు చివరకు చేరుకున్నాయి. మళ్లీ ఎవరో కింద నుంచి ‘చూస్తూ ఉండండి. చివర్లో పడిపోతాయి’ అని  అన్నారు. అంతే అక్కడి నుంచి ఆ కప్పలు పడిపోయాయి. ఒక్క కప్ప మాత్రం స్తంభంపైకి నిలబడింది. అందరూ శభాష్‌ అని పొగిడారు. అది దిగి వచ్చిన తర్వాత ‘నీకు ఎంత ధైర్యం.. అంత పైకి ఎలా ఎక్కావు’ అని అడిగితే ‘ఏంటి అన్నావు’ అని ఆ కప్ప అన్నదట. ఎందుకంటే అది చెవిటిది’’

‘‘ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నెగెటివ్‌ మాటలు మాట్లాడేవాళ్ల ముందు మనం చెవిటివాళ్లం అయిపోవాలి. నేను ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్నప్పుడు, కెరీర్‌ ప్రారంభంలో ఉండగా, పాండీబజార్‌ వైపు వెళ్లేవాడిని కాదు. అక్కడ అంతా వెస్ట్రన్‌ అంటే ఆసక్తి ఉన్నవాళ్లు.. అవకాశాలు సద్వినియోగం చేసుకోని వాళ్లు..  అవకాశాలు రాని వాళ్లు..ఫ్రస్ట్రేషన్‌తో కలిగిన వాళ్లు నిండుగా ఉండేవారు. పాండి బజార్‌కు వెళ్తే ఎక్కడ నాపై నాకు నమ్మకం పోతుందోనని అటువైపు వెళ్లే వాడిని కాదు. ఈ విషయాన్ని నాకు ఎవరూ చెప్పలేదు. నాకున్న కనీస పరిజ్ఞానం చెప్పేది. భోజనానికి వెళ్లినా, ఆ పని పూర్తయిన తర్వాత వెంటనే నా రూమ్‌కి వచ్చేసేవాడిని. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. అక్కడున్న వాళ్లు పొరపాటున ‘నువ్వా.. సినిమా యాక్టర్‌ అవుతావా? ఫేస్‌ ఎప్పుడైనా చూసుకున్నావా’ అంటే మనపై మనకు ఉన్న నమ్మకం పోతుంది. యువతకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. ఎప్పుడూ నెగిటివ్‌గా ఆలోచించవద్దు. ఏ పనిలోనైనా వందశాతం మీ శ్రద్ధను పెట్టండి. కచ్చితంగా సాధిస్తారు’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని