‘ప్రస్థానం’ చిత్రానికి పదేళ్లు

కొన్ని కొన్ని సినిమాలు చూస్తుంటే అవన్నీ నిజ జీవిత పాత్రల్లా అనిపిస్తాయి. ఇంటికొచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతూనే

Updated : 07 Dec 2022 22:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని కొన్ని సినిమాలు చూస్తుంటే అవన్నీ నిజ జీవిత పాత్రల్లా అనిపిస్తాయి. ఇంటికొచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ పాత్రలు, సంభాషణలు, వాటి మధ్య జరిగే ఘర్షణ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి అరుదైన చిత్రాల్లో ‘ప్రస్థానం’ ఒకటి. ఈ చిత్రం విడుదలైన నేటికి (ఏప్రిల్‌16, 2010) పదేళ్లు పూర్తి చేసుకుంది. దేవా కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఒకెత్తయితే, శర్వానంద్‌, సాయికుమార్‌, సందీప్‌ కిషన్‌ల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. 

కథేంటంటే: దశరథ రామనాయుడు(మన్నవ బాలయ్య) రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. అతని చివరి కోరిక మేరకు రాజకీయ వారసత్వాన్ని తన భుజాలపై వేసుకుంటాడు లోకనాథం నాయుడు(సాయికుమార్‌). అంతేకాదు, ప్రత్యర్థుల దాడిలో కొడుకు కేశవ (రవి ప్రకాశ్‌) చనిపోవడంతో తన కోడలు సావిత్రి(పవిత్రా లోకేశ్‌) ని కూడా పెళ్లి చేసుకోవాలని లోకనాథాన్ని కోరతాడు దశరథరామయ్య. అప్పటికే ఆమెకు మిత్రానంద్‌(శర్వానంద్‌) అనే కొడుకుంటాడు. పెళ్లి తర్వాత లోకనాథంకూ, సావిత్రికి చిన్నా(సందీప్‌ కిషన్‌) పుడతాడు. మిత్ర, చిన్నా ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. రాజకీయంగా తన వారసుడిగా మిత్రను ప్రకటిస్తాడు లోకనాథం. ఇది నచ్చని చిన్నా కక్ష పెంచుకుంటాడు. తాగిన మత్తులో లోకనాథంకు మిత్రుడైన బాషా కుమార్తె నదియా(రష్మి గౌతమ్‌)పై అత్యాచారం చేసి చంపేస్తాడు. మరి లోకనాథం, మిత్ర, చిన్నా, బాషాల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చివరకు ఏం జరిగింది? అన్నదే ‘ప్రస్థానం’ కథ.

చిన్న సినిమాగా విడుదలై..

2010  ఏప్రిల్‌ 16, చిన్న సినిమాగా విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది ‘ప్రస్థానం’. ముఖ్యంగా దేవ కట్టా సినిమాలోని పాత్రలను డిజైన్‌ చేసిన విధానం కట్టిపడేసింది. పొలిటికల్‌ డ్రామాగా మలుపులతో ఆద్యంతం ఉత్కంఠ కలిగించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. ప్రతి నటుడూ తన పాత్రకు జీవం పోశాడు. ఇక దేవకట్టా సంభాషణలు ప్రేక్షకలను విశేషంగా మెప్పించాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో సాయికుమార్‌ చెప్పిన ‘ఒక్కసారి ఆ పురాణాలు దాటి వచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప.. హీరోలు.. విలన్లు లేరీ నాటకంలో..’ అంటూ ఆయన పలికిన సంభాషణలు ఒళ్లు గగుర్పొడుస్తాయి.

బాలకృష్ణ, ప్రభాస్‌ సినిమాలను తట్టుకుని..

2010 ఏప్రిల్‌లో మరో రెండు పెద్ద సినిమాలు కూడా విడుదలయ్యాయి. బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ ఘన విజయాన్ని అందుకుంది. ఇక ప్రభాస్‌-కరుణాకరన్‌ల ‘డార్లింగ్‌’ కూడా ఇదే నెలలో విడుదలయ్యాయి. రెండు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలకు దీటుగా ‘ప్రస్థానం’ ఆడటం విశేషం. 

రెండు నంది అవార్డులు

‘ప్రస్థానం’ చిత్రం రెండు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, ఉత్తమ సహాయ నటుడిగా సాయికుమార్‌ నంది అవార్డు దక్కాయి. ఇక ఫిల్మ్‌ ఫేర్‌లో కూడా సాయికుమార్‌కు అవార్డు వచ్చింది. ఉత్తమ సౌత్‌ క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ చిత్రంగా దేవకట్టా ఫిల్మ్‌ఫేర్‌ను సొంతం చేసుకున్నారు. 

ప్రస్థానం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సందీప్‌ కిషన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘వావ్‌ ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు వచ్చేశాయి. నా పదేళ్ల ప్రయాణంలో సగం పోరాడుతూ, నా కలలను సాకారం చేసుకుంటూ ఉన్నా. నాకు ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇదే నా ప్రపంచం’’ అని ట్వీట్‌ చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని