ఏయన్నార్‌.. ఎన్టీఆర్‌లను దాటుకొని..

కొన్ని సినిమాలు.. కొన్ని పాత్రలు కేవలం కొందరి కోసం మాత్రమే పుడతాయి. ఆ పాత్రలో నటించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, చేరాల్సిన వారికి అది చేరుతుంది. అలాంటి పాత్రల్లో విప్లవ

Published : 01 May 2020 12:46 IST

కొన్ని సినిమాలు.. కొన్ని పాత్రలు కేవలం కొందరి కోసం మాత్రమే పుడతాయి. ఆ పాత్రలో నటించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, చేరాల్సిన వారికి అది చేరుతుంది. అలాంటి పాత్రల్లో విప్లవ వీరుడు.. బ్రిటిష్‌ సామ్రాజ్య పునాదుల్నే పెకలించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. ఎంతోమంది గొప్ప గొప్ప నటులను దాటుకొని చివరకు ‘సూపర్‌స్టార్‌’ కృష్ణను వరించింది సీతారామరాజు పాత్ర. కృష్ణ చలనచిత్ర జీవితంలో 100వ సినిమా. మేడే రోజు (01-05-1974)న విడుదలైన ఈ చిత్రం నేటికి 46 వసంతాలు పూర్తి చేసుకుంది. 

వారితో తీయాలనుకున్నారు

తేనె మనసులు(1965) చిత్రంతో చలనచిత్ర రంగప్రవేశం చేసి, అడ్వెంచర్‌ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించిన కృష్ణ 12వ చిత్రం అసాధ్యుడు (1968). ఈ సినిమాలోని ఒక అంతర్నాటకంలో కృష్ణ అల్లూరి సీతారామరాజుగా నటించినప్పుడు, ఆ విప్లవ వీరుని ఇతివృత్తాన్ని ఒక చక్కని సినిమాగా సొంతంగా మలచాలన్న ఆకాంక్షకు తొలిబీజం పడింది. అందుకు ముందు జగ్గయ్య కూడా ఆలు-మగలు (1958) సినిమాలోని ఒక అంతర్నాటకంలో సీతారామరాజుగా నటించారు. అది కూడా కృష్ణకు స్ఫూర్తే! అక్కినేని నాగేశ్వరరావుతో ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశరావు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో తీయాలేకపోయారు. ఇదే ఆలోచన ఎన్టీఆర్‌కి కూడా వచ్చింది. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు కూడా తయారు చేయించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. తరువాత వంతు శోభన్‌బాబుది. దేవదాసు నిర్మాత డి.ఎల్‌. శోభన్‌బాబుతో ఈ సినిమా తీయాలని చూసినా, అది కూడా సాధ్యం కాలేదు. ఇక కృష్ణ విషయానికి వస్తే, అప్పుడప్పుడే సినిమాల్లో హీరోగా నిలదొక్కుకుంటూ ఉండటంతో తన పథకాన్ని మనసులోనే పదిలపరుచుకొని, సమయంకోసం వేచి చూసి, చివరకు త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రూపొందించి చిత్ర నిర్మాణానికి నడుం బిగించారు. మహారథి అప్పట్లో చాలా బిజీ రచయిత. కేవలం ఈ చిత్రం కోసం ఆయన అంతకు ముందు ఒప్పుకొన్న సినిమాలను రద్దుచేసుకుని, ఆ ఆదర్శయోదుడి వీర చరిత్ర గురించి అనేక పరిశోదనలు చేసి పకడ్బందీగా స్క్రిప్టును తయారుచేశారు. అలా మహా నటులను దాటుకొని చివరకు కృష్ణ అల్లూరి సీతారామరాజుగా నటించారు. 

పరుచూరి సోదరులను కథ రాయమన్న ఎన్టీఆర్‌

మేడే రోజు విడుదలైన ఈ చిత్రం  ఘనవిజయాన్ని సాధించింది. రిపీట్‌ రన్‌లో కూడా వందరోజులు ఆడిన ‘మాయాబజార్‌’, ‘దేవదాసు’ వంటి అతి తక్కువ సినిమాల సరసన ‘అల్లూరి సీతారామరాజు’ చోటు సంపాదించింది. ఎన్టీఆర్‌ ఈ సినిమాని మళ్లీ తీద్దామని అనుకుని, పరుచూరి సోదరులను పిలిచి, కథ సిద్ధం చేయమన్నారు. అంతటి పెద్దాయన చెప్పిన తర్వాత వారు కాదనలేకపోయారు. అయితే, కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్లీ కలిసిన సందర్భంలో ‘‘అన్నగారూ.. కృష్ణగారు తీసిన ‘అల్లూరి సీతారామరాజు’ను ఒక్కసారి చూడండి. అప్పటికీ మీరు తీయాలని అనుకుంటే తప్పకుండా కథ సిద్ధం చేస్తాం’’ అని అనడంతో అప్పుడు వెంటనే కృష్ణకు ఎన్టీఆర్‌ ఫోన్‌ చేసి, ‘బ్రదర్‌ మీరు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమా చూడాలని ఉంది. వేస్తారా’ అనగానే, ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేక ప్రదర్శన వేశారు. అది చూసి,  కృష్ణను అభినందించి, తను సినిమా నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఎన్టీఆర్‌. తీరని కోరికగా మిగిలిపోయిన సీతారామరాజు పాత్రను అతిథి పాత్రగా వివిధ సందర్భాల్లో పోషించి సంతోషపడ్డారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌ ‘అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండటం విశేషం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని