‘గీత గోవిందం’ చేద్దామనుకున్న అల్లు అర్జున్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘గీత గోవిందం’. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత విజయ్‌ కెరీర్‌లో మరుపురాని

Updated : 11 Jul 2023 17:10 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘గీత గోవిందం’. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత విజయ్‌ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను పరుశురామ్‌ తెరకెక్కించిన విధానం, క్యారెక్టరైజేషన్‌, గోపీ సుందర్‌ సంగీతం, సిధ్‌ శ్రీరామ్‌ పాట, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ సినిమా  రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

నిర్మాత అల్లు అరవింద్‌, బన్ని వాసులకు పరుశురామ్‌ చెప్పిన ‘గీత గోవిందం’ కథ ఎంతో నచ్చిందట. మరీ ముఖ్యంగా బన్ని వాసు అయితే, ఇండస్ట్రీలోని నలుగురైదుగురు హీరోలకు ఫోన్‌ చేసి ‘ఈ కథ చేయండి. మీ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రమవుతుంది’ అని చెప్పారట. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో అల్లు అర్జున్‌కు కూడా పరుశురామ్‌ ఈ కథ వినిపించారట. ఆయనకు కూడా బాగా నచ్చింది. అయితే, బన్ని అప్పటికే బోయపాటి దర్శకత్వంలో ‘సరైనోడు’ చేశారు. అది అల్లు అర్జున్‌ మాస్‌ ఇమేజ్‌ను మరింత పెంచింది. దీంతో ఇలాంటి సాఫ్ట్‌ క్యారెక్టర్‌ చేస్తే, అభిమానుల అంచనాలను అందుకోలేమేమోనని అనుకున్నారట.

అయితే, ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత ఈ కథ బన్ని చెప్పి ఉంటే, తప్పకుండా చేసేవారని దర్శకుడు పరుశురామ్‌ ఓ సందర్భంలో అన్నారు. అంతేకాదు, ఒకసారి తన దగ్గరకు వచ్చి, ‘నేను చేస్తే బాగుంటుందేమో, ఇలాంటి క్యారెక్టరైజేషన్‌ కలిగిన పాత్ర మళ్లీ దొరకదేమో’ అన్నారట అల్లు అర్జున్‌. ఆ తర్వాత రెండు మూడు రోజులకు మళ్లీ పరుశురామ్‌ను కలిసి, ‘వేరే వాళ్లతో చేయండి. మీకు అన్ని విధాలా సపోర్ట్‌ చేస్తా’ అని భరోసా ఇచ్చారట. అలా అన్నీ కుదిరి ఉంటే అల్లు అర్జున్‌ ‘గీత గోవిందం’ చేసేవారు.

అన్నట్లు ఇటీవల 15ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భద్ర’ సినిమానూ బన్ని చేయాల్సింది. అప్పటికి మాస్‌ ఇమేజ్‌ లేకపోవడం, బరువైన పాత్ర కావడంతో అల్లు అర్జున్‌ ఒప్పుకోలేదు. అప్పుడు ఆ సినిమాకు మాస్‌ ఇమేజ్‌ సరిపోలేదు.. ఇప్పుడు ఈ సినిమాకు మాస్‌ ఇమేజ్‌ ఎక్కువైపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని