ఎన్టీఆర్‌.. మనోజ్‌.. ఓ బ్రహ్మకథ..!

అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌, నటుడు మంచు మనోజ్‌ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమా షూటింగ్‌ సమయం నుంచి...

Updated : 07 Nov 2020 12:41 IST

అలా నాకు టార్చర్‌ ప్రారంభమైంది: తారక్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌, నటుడు మంచు మనోజ్‌ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమా షూటింగ్‌ సమయం నుంచి మనోజ్‌-ఎన్టీఆర్‌ స్నేహితులుగా మారారు. అయితే వీరిద్దరూ ఒకే ఏడాది, ఒకే నెల, ఒకే రోజున కొన్ని గంటల తేడాతో జన్మించారు. అలా మంచు మనోజ్‌ కంటే ఎన్టీఆర్‌ సుమారు ఆరు గంటల పెద్దవాడు. మనోజ్ చేసే కొంటె పనుల కారణంగా ఎన్టీఆర్‌ ఎన్నోసార్లు ఇంట్లో ఇబ్బందులు పడేవాడట. అంతేకాకుండా తామిద్దరు ఈ భూమ్మీదకి ఎలా వచ్చారో తెలియజేస్తూ మనోజ్‌కు తారక్‌ ఎప్పుడూ ఓ బ్రహ్మకథ చెప్పేవాడినని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

‘బ్రహ్మదేవుడు ఓసారి దీర్ఘంగా ఆలోచించి రెండు బొమ్మలను తయారుజేశాడు. అందులో ఒకటి కొంచెం తెల్లగా, మరొకటి కొంచెం నల్లగా, ఒకదానికి కొంచెం రింగుల జుట్టు, ఇంకొదానికి కొంచెం సిల్కీ హెయిర్‌. ఇలా కొన్ని మార్పులతో ఆలోచనా విధానం మాత్రమే ఒకేలా ఉండేలా రెండు బొమ్మలు రూపొందించాడు. ఆ రెండు బొమ్మలకు ఓ పరీక్ష పెట్టాడు. అప్పుడు ఓ బొమ్మ చాలా వినయంగా ఎలాంటి అల్లరి చేయకుండా ఉంది. అది చూసి బ్రహ్మదేవుడు.. ‘ఈ బొమ్మ చాలా పద్ధతిగా ఉంది. కాబట్టి దీన్నే ముందు భూమ్మీదకి పంపిస్తాను.’ అని చెప్పి మొదటి బొమ్మను కిందకు పంపించారు. అదే నేను. అయితే బ్రహ్మ చేతిలో ఉన్న రెండో బొమ్మ.. ‘మా ఇద్దరిని ఒకేసారి తయారు చేసి.. వాడిని ఎలా ముందు భూమ్మీదకి పంపిస్తారు’ అనుకుని ఆయన్ని గట్టిగా గిల్లాడు. దీంతో బ్రహ్మదేవుడు అనుకోకుండా రెండో బొమ్మను కూడా భూమి మీదకు వదిలాడు. ‘నన్నే ఇంత ఇబ్బంది పెట్టాడంటే ఈ బొమ్మ తప్పకుండా మోహన్‌బాబు ఇంట్లోనే పుట్టాలి’ అని బ్రహ్మదేవుడు రెండో బొమ్మను మోహన్‌బాబు ఇంట్లో పుట్టించాడు. వాడే మనోజ్‌. అక్కడి నుంచి నాకు టార్చర్‌ ప్రారంభమైంది. వాడు వస్తున్నాడంటే ప్రకృతి ముందే చెప్పేస్తుంది. ఇద్దరం ఒకేసారి పుట్టాం. కానీ నేను మనోజ్‌ కంటే కొన్నిగంటల ముందు పుట్టాను. వాడు మాత్రం నాకు ఎలాంటి గౌరవం ఇవ్వడు. ఏరా.. ఏంట్రా అని పిలుస్తాడు’ అని ఎన్టీఆర్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని