‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో అవకాశం కోల్పోయిన రకుల్‌

ప్రభాస్‌, కాజల్‌, తాప్సి కీలక పాత్రల్లో దశరథ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’. 2011లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని

Updated : 30 Jan 2021 09:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌, కాజల్‌, తాప్సి కీలక పాత్రల్లో దశరథ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’. 2011లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అటు ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు, ఇటు కుటుంబ ప్రేక్షకులను సైతం మెప్పించింది. తొలుత ఈ సినిమాలో ప్రియ పాత్ర కోసం రకుల్‌ అనుకున్నారు. నాలుగు రోజులు షూటింగ్‌ కూడా చేశారు. అయితే, ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్‌ వచ్చింది. రకుల్‌ను సినిమా నుంచి తీసేయడం వెనుక కారణం ఏంటి? ఏం జరిగింది? అన్న విషయాలను రకుల్‌ ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చింది.

‘‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ నుంచి నన్ను ఎందుకు తీసేశారో నాకూ కారణం తెలియదు. జరిగింది ఏదో మన మంచికే అనుకోవాలి.  అప్పటికే కన్నడలో ఒక సినిమా చేశా. అది విడుదలైన తర్వాత తెలుగులో నాకు ఆఫర్లు వచ్చాయి. అప్పుడు నేను డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నా. మా నాన్న ఆర్మీలో పనిచేసేవారు. దాంతో నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. దక్షిణాది చిత్రాల గురించి అస్సలు తెలియదు. అయితే, నటిని కావాలని మాత్రం బాగా ఆసక్తి ఉండేది. అలాంటి సమయంలో తొలిసారి పూరి జగన్నాథ్‌గారిని కలిశా. ‘పోకిరి’ తర్వాత నాకు ఒక సినిమా ఆఫర్‌ చేశారు. ‘నేను మ్యాథ్స్‌ ఆనర్స్‌ చేస్తున్నా. 60రోజుల కాల్షీట్‌ అంటే కుదరదు. పది రోజులుండే పాత్రలు ఏవైనా ఉంటే చెప్పండి’ అని అన్నా. అతిథి పాత్రలు, చిన్న పాత్రలు చేస్తే కెరీర్‌ ఉండదని అప్పుడు నాకు తెలియదు. కేవలం పాకెట్ మనీ వస్తే చాలనుకున్నా’’

‘‘అలాంటి సమయంలో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ వచ్చింది. అంత పెద్ద సినిమా అని నాకూ తెలియదు. స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. ప్రియ పాత్రకు తీసుకుంటున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో ఎగ్జామ్స్‌ ఉండటంతో సెట్‌లో కూడా చదువుకుంటూ నటించాను. అయితే, ‘డార్లింగ్‌’ హిట్‌ కావడంతో ఆ పెయిర్‌ను రిపీట్‌ చేస్తే బాగుంటుందని నిర్మాతలు అనుకుని ఉంటారు. కొత్త అమ్మాయితో ఎందుకు రిస్క్‌చేయడం అని భావించి ఉండవచ్చు. అందుకే నన్ను వద్దని చెప్పారు. వాళ్లు అలా చెప్పగానే షాకయ్యా. సవాళ్లు ఎదురుకాకపోతే జీవితంలో పైకి రాలేము’’

‘‘ఆ తర్వాత ‘ఆటోనగర్‌ సూర్య’లో కూడా ఆఫర్‌ వచ్చింది. ఆ సమయంలో సమంతకు డేట్స్‌ ఖాళీ లేకపోతే నన్ను తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు డేట్స్‌ అడ్జెస్ట్‌ కావడంతో ఆ సినిమా నుంచి నన్ను తప్పించారు. రెండోసారి షాక్‌ తగిలింది. ఆ తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి పెట్టా. డిగ్రీ మూడో సంవత్సరంలో మిస్‌ ఇండియా పోటీలకు వెళ్లా. ఆ తర్వాత ప్రణాళికబద్ధంగా సినిమాలు ఎంచుకోవాలని అనుకున్నా. ఆ రెండు సినిమాల్లో నుంచి నన్ను తీసేసి ఉండకపోతే సినిమా విలువ తెలిసేది కాదు. ఒక ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో నేను చేసి, ఆ సినిమా విజయం సాధించి ఉంటే, దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయేదాన్ని’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని