‘వేదం’ అలా పుట్టింది!

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క కీలక పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘వేదం’. 2010 జూన్‌ 4న విడుదలైన  ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని

Updated : 07 Dec 2022 14:28 IST

అల్లు అర్జున్‌ ‘వేదం’ చేస్తానంటే నవ్వాను: క్రిష్‌

అనుష్కను ఒప్పించడానికి భయం వేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క కీలక పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘వేదం’. 2010 జూన్‌ 4న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుని  నేటితో(జూన్‌ 4, 2020) పదేళ్లు పూర్తి చేసుకుంది. కేబుల్‌ రాజుగా అల్లు అర్జున్‌, రాక్‌స్టార్‌ వివేక్‌ చక్రవర్తిగా మంచు మనోజ్‌, వేశ్యగా సరోజ పాత్రలో అనుష్క, వృద్ధుడు రాములుగా నాగయ్య, భారత్‌ విడిచి వెళ్లిపోవాలనుకునే ముస్లిం రహీముద్దీన్‌ ఖురేషీ పాత్రలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ తమ నటనతో మెప్పించారు. ఇక కీరవాణి సంగీతం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది. 

‘వేదం’ అలా పుట్టింది!

‘గమ్యం’ తర్వాత క్రిష్‌ కమర్షియల్‌ హంగులతో ఒక భారీ సినిమా చేయాలని ప్లాన్‌ చేశారు. అయితే, అదే సమయంలో అమరావతి వెళ్లిన క్రిష్ అక్కడ చూసిన ఓ సంఘటన‌ ఆయన ఆలోచనలను మార్చి, ‘వేదం’ వైపు అడుగులు వేసేలా చేసింది. ‘వేదం’కథ ఎలా పుట్టిందో ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు క్రిష్‌. ‘‘గమ్యం’ హిట్టయిన తర్వాత ఒక కమర్షియల్‌ హంగులతో సినిమా చేయాలని ఎన్నో అనుకున్నాం. అదే సమయంలో విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వార్షికోత్సవానికి పిలిస్తే అక్కడకు వెళ్లా. అక్కడ విద్యార్థులు చేసిన ప్రదర్శన నాకు బాగా నచ్చింది. మాకన్నా గొప్ప ఆలోచనలతో పలు ప్రదర్శనలు చేశారు. ఆ ఈవెంట్‌ అయిపోయిన తర్వాత ఆ  ఆలోచనలతోనే అక్కడి నుంచి బయలుదేరా’’

‘‘మా ఎడిటర్‌ శ్రవణ్‌, కెమెరామెన్‌ జ్ఞానశేఖర్‌, మేనేజర్‌ మురళిగారితో అమరావతి పక్కనే వైకుంఠపురం ఆలయానికి వెళ్లాం. అక్కడ వైష్ణవి అనే అమ్మాయి, ఆమె తమ్ముడు గుడికి వచ్చారు. తను నన్ను గుర్తుపట్టింది. ‘మీరు గమ్యం క్రిష్‌ కదా’ అని అంది. ‘అవును’ అని సమాధానం ఇచ్చా. అదే విషయాన్ని వాళ్ల తమ్ముడికి కూడా చెప్పింది. ‘గమ్యం’లో నీకు ఏం నచ్చింది’ అని అడిగా. ‘జానకిని వెతికేందుకు బయలుదేరిన అభిరామ్‌ ఆ ప్రయాణంలో తనని తాను తెలుసుకుంటున్నానని చెప్పిన డైలాగ్‌ బాగుంది’ అని చెప్పింది. ఆ తర్వాత అందరం కలిసి ఉండవల్లి గుహలను చూడటానికి వెళ్లాం’’

‘‘అక్కడ ఓ చిన్న పిల్లాడు వృద్ధుడి వేలు పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని మేం ఫొటో తీశాం. అక్కడి నుంచి రాగానే కథ చెప్పాను. ‘ఒక చిన్న పిల్లాడు. వెట్టిచాకిరీ చేస్తాడు. వాడిని విడిపించుకోవడానికి వాళ్లమ్మ కిడ్నీలు అమ్ముకుంటుంది’ ఇది అసలు ‘వేదం’ కథకు బీజం. ఆ తర్వాత మనోజ్‌ కథ పుట్టింది. మిగిలిన కథలు అప్పటికి అనుకోలేదు. నాకు ఏదైనా ఆలోచన వస్తే, సీతారామశాస్త్రిగారితో పంచుకుంటా. ఇది కూడా ఆయనతో పంచుకున్నా. అంతకుముందు చేద్దామనుకున్న కమర్షియల్‌ సినిమాను చేయనని నిర్మాతలకు చెప్పేశా. ఈ విషయం అల్లు అర్జున్‌కు తెలిసి నాకు ఫోన్‌ చేశాడు. ‘క్రిష్‌ నీకు సమయం ఉంటే మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం’ అన్నాడు. అప్పుడు బన్ని ‘ఆర్య 2’ షూటింగ్‌లో ఉన్నాడు. షూటింగ్‌కు ఒక రోజు విరామం కావడంతో ఇద్దరం భోజనం చేయడానికి వెళ్లాం. అప్పుడే నేను ‘వేదం’ అనే చిన్న సినిమా చేస్తున్నట్లు చెప్పా. ‘గమ్యం బాగా తీశావు. మంచి సినిమా చెయ్‌ కావాలంటే నేను డేట్స్‌ ఇస్తా’ అన్నాడు. అప్పుడే ‘వేదం’ అందులోని కేబుల్‌ రాజు క్యారెక్టర్‌ చెప్పా. తనకు బాగా నచ్చింది. సినిమాకు తనే ప్రొడ్యూస్‌ చేస్తానని చెప్పాడు. ఇక రాక్‌స్టార్‌ పాత్రకు రానా లేదా మంచు మనోజ్‌ అయితే బాగుంటుందని అనుకున్నా. అయితే, అప్పుడు రానా ‘లీడర్‌’ సినిమా చేస్తున్నాడు. దాంతో మనోజ్‌కు కథ చెబితే వెంటనే ఒప్పుకొన్నాడు. ఇక మాకు అసలు సవాల్‌ వేశ్య పాత్రకు అనుష్కను ఒప్పించడం. ‘తను ఒప్పుకొంటే సినిమా మరో స్థాయిలో ఉంటుంది’ అని బన్ని చెప్పాడు. తనని కలిసి ఎలా కథ చెప్పాలో అర్థంకాలేదు. ఒక రోజు ఆమె దగ్గరకు వెళ్లి భయపడుతూనే కథ చెప్పా. కథ విన్న వెంటనే ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. వెంటనే ఒప్పుకొంది. అలా ‘వేదం’ పట్టాలెక్కింది’’ అని చెప్పుకొచ్చారు.

అనుష్క పోస్టర్‌ 40కు పైగా యాక్సిడెంట్‌లు

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్కలు నటిస్తుండటంతో చిన్న సినిమా కాస్తా  పెద్దది అయిపోయింది. అంచనాలూ పెరిగిపోయాయి. జూన్‌ 4న విడుదలైన ఈ చిత్రం విమర్శకులను మెప్పించింది. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వృద్ధుడి వద్ద డబ్బులు కొట్టేసినప్పుడు, తిరిగి ఇచ్చినప్పుడు అల్లు అర్జున్‌ కనబరిచిన నటన థియేటర్‌లోని ప్రేక్షకుడితోనూ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇక వేశ్యగా అనుష్క నటన హైలైట్‌ అని చెప్పాలి. కథానాయికగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలో ఆ పాత్రను ఎంచుకోవడం నిజంగా ధైర్యమనే చెప్పాలి. ఏమాత్రం తేడాగా నటించినా సినిమాపైనా, అనుష్క కెరీర్‌పైనా గట్టి ప్రభావం చూపించేది. కానీ, అనుష్క అలవోకగా చేసేశారు. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా అనుష్క వెనక్కి తిరిగి కొంటెగా చూస్తున్న ఫొటోను పెద్ద హోర్డింగ్‌ చేసి, పంజాగుట్ట సెంటర్‌లో పెట్టారు. ఆ సమయంలో 40కు పైగా యాక్సిడెంట్‌లు అయ్యాయి. ఒకానొక దశలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో జీహెచ్‌ఎంసీ వాళ్లతో కలిసి పోలీసులు ఆ హోర్డింగ్‌ను తొలగించారు. అంతలా అనుష్క మెస్మరైజ్‌ చేసింది. 

అవార్డుల వెల్లువ... 

బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించడమే కాదు. ‘వేదం’ చిత్రానికి అవార్డులూ వరించాయి. 2010కి గానూ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకోగా, వృద్ధుడి పాత్ర పోషించిన నాగయ్యకు స్పెషల్‌ జ్యూరీ పురస్కారం వచ్చింది. 58వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రం (శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని), ఉత్తమ దర్శకుడు (క్రిష్‌), ఉత్తమ నటుడు (అల్లు అర్జున్‌), ఉత్తమ నటి (అనుష్క) అవార్డులు దక్కాయి. తమిళంలో ఈ చిత్రాన్ని ‘వానం’ పేరుతో తెరకెక్కించారు. శింబు, భరత్‌, ప్రకాష్‌రాజ్‌, అనుష్క కీలక పాత్రలు పోషించారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

‘‘వేదం’కు దశాబ్దం. అందమైన ప్రయాణం. ఈ సినిమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. దర్శకుడు క్రిష్‌ విజన్‌, ప్యాషన్‌ అద్భుతం. మనోజ్‌, అనుష్క, మనోజ్‌ బాజ్‌పాయ్‌ జి, ఇతర నటీనటులకు, సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు. కీరవాణిగారికి, ఆర్కా మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు’’ -అల్లు అర్జున్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని