బాక్సర్‌గా మారిన ఆర్య

సినిమా హీరోలు తమ అభిమానులను మెప్పించాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలి. ట్రెండ్‌ను బట్టి స్టైల్‌ను.. సినిమాను బట్టి శరీరాకృతిని....

Published : 20 Feb 2020 21:51 IST

చెన్నై: సినిమా హీరోలు తమ అభిమానులను మెప్పించాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలి. ట్రెండ్‌ను బట్టి స్టైల్‌ను.. సినిమాను బట్టి శరీరాకృతిని మార్చుకుంటూ ఉండాలి. అందుకోసమే ఇటీవల చాలా మంది హీరోలు సిక్స్‌ప్యాక్‌ బాడీపై దృష్టి పెడుతున్నారు. తోటి హీరోలతో పోటీపడి మరీ కండలు పెంచేస్తున్నారు. తాజాగా తమిళ కథానాయకుడు ఆర్య సైతం ఇదే దారిని ఎంచుకున్నాడు. తన తర్వాతి సినిమా కోసం కండలు పెంచేందుకు తీవ్రంగా చెమటోడుస్తున్నాడు. రానున్న సినిమాలో చొక్కా విప్పి కనిపించేందుకు సిద్ధమయ్యాడు.
తమిళ స్టార్‌ ఆర్య హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిజమైన బాక్సర్‌లా కనిపించాలన్న లక్ష్యంగా తన కండలకు పనిచెప్పే పనిలో పడ్డాడు ఆర్య. అందుకోసం జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దానికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఇది నా కెరీర్‌లోనే సవాల్‌తో కూడుకున్న సినిమా. అందుకోసం బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాను’ అంటూ పోస్టు చేశాడు. ఈ సినిమాకు అన్బూ అరివు ఫైట్‌ మాస్టర్‌గా పనిచేస్తుండగా సంతోష్‌ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్‌లో ‘రాజారాణి’, ‘వరుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆర్య సుపరిచితుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని