విజయ్‌ దేవరకొండలాంటి వ్యక్తిని చూడలేదు!

విజయ్‌ దేవరకొండలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదని బాలీవుడ్‌ నటి అనన్యా పాండే అన్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అనన్యా పాండే కథానాయిక. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన 40 రోజుల షూటింగ్‌ ముంబయిలో......

Published : 06 Apr 2020 09:28 IST

అనన్యా పాండే ఎందుకు మెచ్చుకుందంటే?

ముంబయి: విజయ్‌ దేవరకొండలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదని బాలీవుడ్‌ నటి అనన్యా పాండే అన్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అనన్యా పాండే కథానాయిక. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన 40 రోజుల షూటింగ్‌ ముంబయిలో జరిగింది. సెట్‌లో తీసిన విజయ్‌, అనన్య ఉన్న స్టిల్స్‌ వైరల్‌ అయ్యాయి. కాగా ఇందులో విజయ్‌తో కలిసి నటించడం గురించి అనన్య ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ‘విజయ్‌ పెద్ద స్టార్‌ అయినప్పటికీ చాలా వినయంగా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనది. అంతేకాదు చాలా దయ ఉన్న వ్యక్తి. సున్నితంగా మాట్లాడుతారు’ అని చెప్పారు.

అనంతరం సినిమా గురించి ముచ్చటిస్తూ.. ‘ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇది నాకు, విజయ్‌కు కొత్త అనుభూతి. దక్షిణాదికి నేను కొత్త.. విజయ్‌ నటిస్తున్న తొలి హిందీ సినిమా. ఇతర రాష్ట్ర ప్రజల్ని మెప్పించగలమా? అనే కంగారు మా ఇద్దరికీ ఉంది. సినిమాలో నాది చాలా బలమైన పాత్ర. భాషల పరంగా చిత్ర పరిశ్రమను విభజించలేం. ‘పారాసైట్‌’ (2019లో వచ్చిన కొరియన్‌ సినిమా) ఆస్కార్‌ అవార్డు గెలుచుకుని, భాష అడ్డంకి కాదని నిరూపించింది. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయాలి అనుకుంటున్నారు. డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలైన తర్వాత వీలైనంత వరకు నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పడానికి ప్రయత్నిస్తా’ అని అన్నారు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’తో అనన్య నటిగా బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆపై ‘పతి పత్ని ఔర్‌ వో’లో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని