విరామం వచ్చినా... వినోదం రెట్టింపు

కరోనా అన్ని సినిమాలకీ బ్రేకులేసింది. నిన్న మొన్నటిదాకా ధైర్యంగా చిత్రీకరణలు చేస్తూ వచ్చిన ఆ కొన్ని సినిమాలు ఆగిపోక తప్పలేదు. ఇంకో నెల రోజులు గడిస్తే తప్ప చిత్రీకరణల పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు.

Published : 01 May 2021 18:34 IST

కరోనా అన్ని సినిమాలకీ బ్రేకులేసింది. నిన్న మొన్నటిదాకా ధైర్యంగా చిత్రీకరణలు చేస్తూ వచ్చిన ఆ కొన్ని సినిమాలు ఆగిపోక తప్పలేదు. ఇంకో నెల రోజులు గడిస్తే తప్ప చిత్రీకరణల పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. అంతా అనుకూలం అనిపిస్తే... అప్పుడు రంగంలోకి దిగి, మిగిలిన సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎంతైనా... ఒకసారి ఆగిపోయిన బండి మళ్లీ మునుపటి వేగం అందుకోవాలంటే సమయం పడుతుంది కదా. సినిమాలు కూడా అంతే. పైపెచ్చు ప్రేక్షకులు వెంటనే థియేటర్లకి వస్తారో లేదో కాబట్టి... నింపాదిగానే చిత్రీకరణలు చేసుకుందాం అనుకుంటున్న చిత్రబృందాలు చాలానే. తమ అభిమాన హీరోని ఇప్పటికప్పుడే తెరపైన చూడాలనుకునే ప్రేక్షకులకు మాత్రం ఇంకొంత కాలం ఎదురు చూపులు తప్పదు. అయితే అందరి హీరోల మాటేమో కానీ... కొద్దిమంది ఇప్పటికే ఒక సినిమాని సిద్ధం చేసేసి, రెండో సినిమానీ దాదాపుగా చివరి దశకు తీసుకొచ్చినవాళ్లు చాలా మందే కనిపిస్తున్నారు. ఎప్పుడు థియేటర్లు తెరిచినా వీళ్ల సినిమాలు సిద్ధంగా ఉంటాయన్నమాట. కొంచెం విరామంతోనే రెండో సినిమానీ రేసులో దింపుతారు.

తొలి దశ కరోనా తగ్గాక... చిత్రీకరణలు ఊపందుకున్నాక... విడుదల తేదీల్ని ప్రకటించడంలో పోటీపడ్డాయి చిత్ర బృందాలు. 2020 మొత్తం తుడిచి పెట్టుకుపోయింది కాబట్టి ఎలాగైనా ఈ యేడాది తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సిందే అని కథానాయకులు తీవ్రంగా చెమటోడ్చారు. లక్ష్యాల్ని నిర్దేశించుకుని పని చేశారు. చిత్రీకరణల్లో ఆ వేగం చూశాక... దాదాపు సినిమాలు చెప్పిన సమయానికే విడుదలయ్యేలా కనిపించాయి. కొన్ని చిత్రాలు ఎప్పట్లాగే నత్తనడకన సాగాయి. కానీ కరోనా మరోసారి పంజా విసరడంతో అన్ని, సినిమాలూ ఆగిపోయాయి. ఇప్పుడు ఏ సినిమా ఎప్పుడు    ప్రేక్షకుల ముందుకొస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అయితే కొద్దిమంది కథానాయకులు గతేడాది నుంచీ ఒకే సినిమాపైనే ఉంటే... కొద్దిమంది దొరికిన నాలుగు నెలల కాలంలో తమ చిత్రాల్ని తెరపై చూసుకున్నారు. మరో కొత్త ప్రాజెక్టు కోసం రంగంలోకి దిగారు. ఇంకొంతమంది విడుదల ముంగిట ఆగిపోవల్సిన పరిస్థితి. అయినా సరే... ఆ హీరోలంతా మేం వరుసగా రెండు సినిమాలతో మురిపిస్తాం అంటూ ఇప్పుడు రెండో సినిమానీ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

నాగచైతన్య ‘లవ్‌ స్టోరి’, నాని ‘టక్‌ జగదీష్‌’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’ సినిమాలు కరోనా రెండో దశ ఉద్ధృతితో విడుదలకి నోచుకోలేకపోయాయి. రెండు మూడు వారాల వ్యవధిలో విడుదల కావల్సిన ఈ సినిమాలన్నీ ఇప్పుడు సాధారణ పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ కథానాయకులు వీటితోపాటు... కొత్త సినిమాల పనులపైనా దృష్టి పెట్టారు. దాంతో అవీ సింహభాగం చిత్రీకరణని పూర్తి చేసుకున్నాయి. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ని పూర్తి చేసిన వెంటనే, విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘థ్యాంక్‌ యూ’ కోసం రంగంలోకి దిగారు. ఆ చిత్రం దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అలాగే నాని ‘టక్‌ జగదీష్‌’ పూర్తయిందో లేదో, ఆ వెంటనే ‘శ్యామ్‌ సింగరాయ్‌’ పనులు మొదలుపెట్టారు. ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘అంటే.. సుందరానికి’ ఇప్పటికే షురూ అయ్యింది. రానా దగ్గుబాటికి ఇటు ‘విరాటపర్వం’, అటు పవన్‌తో కలిసి ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్‌ చిత్రం. వెంకటేష్‌ మొదట ‘నారప్ప’ కోసం రంగంలోకి దిగారు. ఆ తర్వాత ‘దృశ్యం2’ చేశారు. రెండూ విడుదలకి ముస్తాబవుతున్నాయి. కరోనా తగ్గాక వరుసగా రెండు సినిమాలతో, రెట్టింపు వినోదంతో అలరించనున్న హీరోలు వీళ్లే మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని