Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్‌’ క్రేజ్‌ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు

Hanuman ott: జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన హనుమాన్‌ మూవీ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Updated : 19 Mar 2024 13:16 IST

హైదరాబాద్‌: బాక్సాఫీస్‌ వద్దే కాదు, ఓటీటీలోనూ హనుమాన్‌ (Hanu-Man) మూవీ రికార్డు సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈనెల 16వ తేదీ నుంచి జియో సినిమాలో హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ అవుతుండగా, ఆ మరుసటి రోజే జీ5 ఓటీటీలో తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ‘హను-మాన్‌’ రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 11 గంటల కన్నా తక్కువ సమయంలో 102 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను నమోదు చేసింది. 2024లో విడుదలైన సినిమాల్లో ఈ స్థాయి క్రేజ్‌ను సొంతం చేసుకున్న చిత్రం మరొకటి లేదంటూ జీ5 సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది. అంతేకాదు, గ్లోబల్‌ ట్రెండింగ్‌లో నెం.1 పొజిషన్‌లో ఉంది.

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో తేజ సజ్జ, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, అమృత అయ్యర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆంజనేయస్వామి రక్త బిందువుతో రూపొందిన రుధిరమణి సంపాదించిన హనుమంతు(తేజ సజ్జ)కు ఎలాంటి శక్తులు లభించాయి? దాని సాయంతో అంజనాద్రి గ్రామంలోని పాలెగాడు గజపతి (దీపక్‌ శెట్టి) అకృత్యాలను ఎలా అడ్డుకున్నాడు? ఆ మణిని సొంతం చేసుకుని, సూపర్‌హీరో కావాలనుకున్న మైఖేల్‌ (వినయ్‌ రాయ్‌)తో ఎలా పోరాటం చేశాడు? అన్న కథను ఆద్యంతం అలరించేలా ప్రశాంత్‌ వర్మ తీర్చిదిద్దారు. ఇక చివరిలో ‘శ్రీరాముడికి హనుమంతుడి ఇచ్చిన మాట’ అంటూ ‘జై హనుమాన్‌’ రూపంలో మరో మూవీని తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో రెండో భాగంపై సినీప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. ఆ మూవీకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాగా, ప్రీ-ప్రొడక్షన్‌ పనులను కూడా మొదలు పెట్టారు. త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది. ఇందులో హనుమంతుడే సూపర్‌ హీరోగా కనిపించనున్నట్లు ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఆ పాత్ర కోసం స్టార్‌ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని