web series: సినిమాలే కాదు.. వెబ్‌సిరీస్‌లు రీమేక్‌.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌!

పలు విదేశీ వెబ్‌సిరీస్‌లు భారతీయ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు రీమేక్‌ అయి, అలరిస్తున్నాయి.

Updated : 24 Jan 2023 14:48 IST

విదేశీ చిత్రాలను భారతీయ భాషల్లో రీమేక్‌ చేయడం కొత్తేం కాదు. హాలీవుడ్‌తో పాటు కొరియన్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ తదితర భాషల్లో విజయవంతమైన చిత్రాలు ఇప్పటివరకూ బాలీవుడ్‌తోపాటు దక్షిణాది భాషల్లోనూ రీమేక్‌ అయ్యాయి. అయితే ఓటీటీలు వచ్చాక వెబ్‌ సిరీసులను రీమేక్‌ చేసే ట్రెండు కూడా మొదలైంది. ప్రపంచంలో ఏ దేశంలో వెబ్‌ సిరీస్‌ హిట్టయినా, ఇక్కడి దర్శక నిర్మాతలు, ఓటీటీ నిర్వాహకులు వెంటనే వాటి హక్కులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. భారతీయ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వాటిని తెరకెక్కించి విడుదల చేస్తున్నారు. ఈ తరహాలో వచ్చిన ఎన్నో వెబ్‌ సిరీసులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరికొన్ని సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో చదివేయండి.

బాబాయ్‌ దగ్గుబాటి వెంకటేశ్‌, అబ్బాయ్‌ రానా కలసి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. విశేషాదరణ పొందిన అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘రే డొనవన్‌’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ సిరీస్‌లో 2013 నుంచి 2019 వరకూ వచ్చిన మొత్తం 7 సీజన్లు ప్రేక్షకులకు వినోదాలు పంచాయి. సెటిల్మెంట్లు చేయడాన్ని వృత్తిగా మలచుకున్న ఓ వ్యక్తిౖ కథ ఇది. అతడి తండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత చోటుచేసుకునే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇది రూపొందింది. ఇప్పటికే విడుదలైన ‘రానా నాయుడు’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌ విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.


బ్రిటిష్‌ వెబ్‌ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ అదే పేరుతో హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటులు అనిల్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌, శోభిత ధూళిపాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. స్టార్‌ హోటల్‌లో రాత్రిపూట మేనేజర్‌గా పనిచేసే ఓ సాధారణ ఉద్యోగి అనుకోని పరిస్థితుల్లో ఓ అక్రమ ఆయుధాల వ్యాపారి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయన్న కథాంశంతో ఇది తెరకెక్కింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 17న విడుదలవుతోంది.


ప్రముఖ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ ‘రుద్ర: వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెట్టారు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.125 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. బీబీసీ స్టుడియోస్‌ ఆంగ్లంలో నిర్మించిన ‘లూథర్‌’ వెబ్‌ సిరీస్‌కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ గతేడాది అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీసుల్లో ఒకటిగా నిలిచింది. బీబీసీ స్టుడియోస్‌ గతంలో నిర్మించిన ‘క్రిమినల్‌ జస్టిస్‌’, ‘ది ఆఫీస్‌’ వెబ్‌ సిరీసులు కూడా అవే పేర్లతో హిందీలో రీమేక్‌ అయి ప్రేక్షకాదరణ పొందాయి.


బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ తొలిసారి ఓటీటీలో అడుగుపెడుతూ నటించిన సిరీస్‌ ‘ఆర్య’. నెదర్లాండ్స్‌ వెబ్‌ సిరీస్‌ ‘పెనొజా’కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి చేసిన పోరాటంతో రూపొందిన ఈ సిరీస్‌లో సుస్మితా సేన్‌ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. దీనికి ఆదరణ దక్కడంతో రెండో సీజన్‌ తెరకెక్కించారు.


జ్రాయెల్‌ వెబ్‌ సిరీస్‌ ‘హోస్టేజెస్‌’ ఆధారంగా అదే పేరుతో హిందీలో తెరకెక్కిన సిరీస్‌ కూడా ప్రేక్షకుల మెప్పు పొందింది. కొందరు నేరస్థులు ఓ వైద్యురాలి కుటుంబ సభ్యులను బందీలుగా చేసుకుని, ముఖ్యమంత్రికి ఆమె చేయబోయే ఆపరేషన్‌ విఫలమై మరణించేలా చేయాలని బెదిరిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న అంశాన్ని ఇందులో ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.


బ్రిటిష్‌ సిరీస్‌ ‘ప్రెస్‌’ ఆధారంగా హిందీలో ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ తెరకెక్కింది. ‘పాతాళ్‌లోక్‌’ వెబ్‌ సిరీస్‌తో అభిమానులను సంపాదించుకున్న జైదీప్‌ అహ్లావత్‌, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించారు. రెండు టీవీ చానళ్ల మధ్య పోటీ వాతావరణం, దానివల్ల నలిగిపోయిన జర్నలిస్టుల జీవితాలను ఇందులో ఆవిష్కరించారు. గతేడాది హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జీ5లో విడుదలైన ఈ సిరీస్‌ వీక్షకులను అలరించింది. వీటితోపాటు మరిన్ని విదేశీ వెబ్‌ సిరీస్‌లు భారతీయ భాషల్లోకి రీమేక్‌ కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు