Raj Tarun: విల్లా కోసం ఆ మూడు సినిమాలు చేయలేదు: రాజ్‌ తరుణ్‌

షార్ట్‌ ఫిల్మ్‌ నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టి.. ‘ఉయ్యాలా జంపాలా’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నటుడు రాజ్‌ తరుణ్‌. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Published : 16 Dec 2022 17:39 IST

హైదరాబాద్‌: విల్లా కోసమే తాను ఒకే బ్యానర్‌లో మూడు సినిమాలు వరుసగా చేసినట్లు గతంలో వచ్చిన వదంతులపై నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) స్పందించారు. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘అంధగాడు’, ‘రాజుగాడు’.. ఇలా వరుసగా మూడు సినిమాలు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లోనే చేశాను. విల్లా కోసమే నేను ఈ మూడు సినిమాలు చేయలేదు. పారితోషికంగా డబ్బులు తీసుకుంటే వెంటనే ఖర్చు చేసేస్తానని.. కాబట్టి విల్లా ఏదైనా కొనుగోలు చేసుకోమని రాజా రవీంద్ర సలహా ఇచ్చారు. అలా, ఈ మూడు ప్రాజెక్ట్‌లకు వచ్చిన డబ్బులతో విల్లా కొనుగోలు చేశా. అంతేకానీ విల్లా కోసం ప్రాజెక్ట్‌లు ఓకే చేయలేదు’’ అని ఆయన అన్నారు.

అనంతరం కారు యాక్సిడెంట్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మద్యం సేవించి కారు నడపడం వల్లే నేను యాక్సిడెంట్‌ చేశానని అప్పట్లో అందరూ అనుకున్నారు. అది నిజం కాదు. మణికొండలో మా ఇంటికి దగ్గర్లోనే నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉండేవాడు. ఓరోజు రాత్రి సమయంలో అతడు ఫోన్‌ చేసి వాళ్లింటికి రమ్మని చెప్పాడు. కారులో వెళ్తున్నప్పుడు.. అనుకోకుండా రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టాను. మా ఇంటి పక్కనే అది జరిగింది. ఆ క్షణం నాకెంతో కంగారుగా అనిపించింది. వెంటనే కారు దిగి అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తాను. ఇంటికి వెళ్తే నాకు ఎవరో ఒకరు సాయం చేస్తారనిపించి.. వెళ్లిపోయాను. అంతేకానీ నేను పారిపోలేదు. అప్పుడు నాకు జరిమానా విధించారు. కట్టాను. అంతటితో ఆ కథ ముగిసిపోయింది’’ అని రాజ్‌ తరుణ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని