RRR: ఆస్కార్‌ .. ఎన్టీఆరే కాదు రామ్‌ చరణ్ సైతం.. ట్రెండింగ్‌ ఇదే!

క్రేజీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) భారీ వసూళ్లు సాధించటమే కాదు ఆస్కార్‌లోనూ నిలుస్తుందని చాలామంది ఎప్పుడో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Published : 17 Sep 2022 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రేజీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) భారీ వసూళ్లు సాధించటమే కాదు ఆస్కార్‌లోనూ నిలుస్తుందని చాలామంది ఎప్పుడో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో హాలీవుడ్‌ ప్రముఖ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ఓ అడుగు ముందుకేసిన సంగతి తెలిసిందే. ఏయే విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ అవుతుందో ఊహించి, ఇటీవల ఓ జాబితా విడుదల చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (ఎన్టీఆర్‌) (NTR), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పోటీ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తాజాగా అప్‌డేట్‌ చేసిన లిస్ట్‌లో ఉత్తమ నటుడి కేటగిరిలో రామ్‌ చరణ్‌ సైతం పోటీపడే అవకాశం ఉండనుందని తెలిపింది. ఉత్తమ గీతం (దోస్తీ)  విభాగంలోనూ ఈ సినిమా పోటీ చేసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ప్రతి గురువారం ఈ మ్యాగజైన్‌ ‘ప్రిడిక్షన్‌ లిస్ట్‌’ అప్‌డేట్‌ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే రామ్‌ చరణ్‌ (Ram Charan) పేరు బయటకు వచ్చింది. దీనిపై రామ్‌ చరణ్ అభిమానులు, సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తప్పకుండా ఆస్కార్‌ అందుకుంటుందనే అభిప్రాయాన్ని కామెంట్లు రూపంలో తెలియజేస్తున్నారు. దాంతో, #RamCharanForOscar #NTRForOscar #RRR అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నట విశ్వరూపం చూపిన సంగతి తెలిసిందే. నటన, గ్రాఫిక్స్‌, పాటలు.. ఇలా అన్ని విషయాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. బాక్సాఫీసు వద్ద రూ. 1200 కోట్లకు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ తన సత్తా చాటింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని