Oscar 2024: ఆస్కార్-2024.. అధికారిక ఎంట్రీ కోసం పోటీ పడుతున్న చిత్రాలివేనా?

Oscar 2024: వచ్చే ఏడాది జరగనున్న ‘ఆస్కార్‌ అవార్డుల వేడుక’ కోసం ప్రక్రియ షురూ అయింది. భారత్‌ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో పోటీ సినిమాకు సంబంధించిన వడపోత కార్యక్రమం మొదలైంది.

Updated : 21 Sep 2023 18:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2023 భారతీయ సినిమా చరిత్రలో మర్చిపోలేని సంవత్సరం. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ వేదికపై తెలుగు సినిమా చిరస్మరణీయ ముద్రవేసింది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘RRR’ రెండు విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది భారత్‌ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ను పంపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమాకు ఎలాంటి అవార్డు లభించలేదు. మరోవైపు ‘ఎలిఫెంట్‌ విష్పర్స్‌’ డాక్యుమెంటరీ సిరీస్‌కు అవార్డు వచ్చింది. ఈ క్రమంలో ‘ఆస్కార్‌ 2024’ (Oscar 2024) అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ షురూ అయింది. ఫిల్మ్‌ మేకర్‌ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ సినిమాలను వీక్షిస్తోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ సినిమాల వివరాలను విశ్వసనీయవర్గాలు ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నాయి. వాటిలో ‘ది స్టోరీ టెల్లర్‌ (హిందీ), మ్యూజిక్‌ స్కూల్‌ (హిందీ), మిస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే (హిందీ), 12th ఫెయిల్‌ (హిందీ), విడుదలై పార్ట్‌-1 (తమిళ్‌), ఘూమర్‌ (హిందీ), దసరా (తెలుగు), వాల్వి (మరాఠీ), గదర్‌2 (హిందీ), అబ్‌ థో సాబ్‌ భగవాన్‌ భరోస్‌ (హిందీ), బాప్‌ లాయక్‌ (మరాఠీ)లతో పాటు కరణ్‌ జోహార్‌ ‘రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్ కహానీ’, నందిదాస్‌ ‘జ్విగాటో’, వివేక్‌ అగ్నిహోత్రి ‘ది కేరళ స్టోరీ’, తెలుగులో చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన ‘బలగం’ తదితర చిత్రాలు ఉన్నట్లు సమాచారం.

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

ఈ సినిమాలను వీక్షించిన అనంతరం వీటిల్లో ఒకదానికి భారత్‌ తరపున ‘ఉత్తమ విదేశీ చిత్రం’ కేటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు. వీటిల్లో కొన్ని చిత్రాలు ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై విమర్శకులను సైతం మెప్పించాయి. ముఖ్యంగా ‘విడుదలై పార్ట్‌-1’ లెటర్‌బాక్స్‌ టాప్‌-50 జాబితాలో నిలిచింది. అలాగే హృదయాలను మెలిపెట్టేలా భావోద్వేగాలను పంచిన ‘జ్విగాటో’, ‘బలగం’ ఆస్కార్‌ ఎంట్రీ సాధించేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వచ్చే ఏడాది ఆస్కార్‌ అవార్డుల కోసం భారత్‌ నుంచి ఏ సినిమా అధికారికంగా వెళ్తుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని