Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్‌.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్‌ గురించి ఈ విశేషాలు తెలుసా?

ప్రముఖ హీరో వెంకటేశ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..

Updated : 13 Dec 2023 11:24 IST

Happy Birthday Venkatesh అమాయకత్వంలో ఆయన పేరు ‘చంటి’. సహనంలో ‘రాజా’. ప్రజలకు అండగా నిలిచే ‘చినరాయుడు’. అందరి మనసులు దోచే ‘అబ్బాయిగారు’. ప్రేమతో..రా’, ‘ప్రేమించుకుందాం..రా’ అంటూ తన ‘ప్రేమ’ని వ్యక్తం చేశారు. ‘సుందరకాండ’, ‘నారప్ప’గా చదువు విలువ చెప్పారు. క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అందరితోనూ ‘బాబు బంగారం’ అనిపించుకున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఆయనెవరో! నేడు ‘వెంకీమామ’ పుట్టినరోజు (1960 డిసెంబరు 13) సందర్భంగా ఆయన గురించి పలు విశేషాలు మీకోసం (Happy Birthday Victory Venkatesh)..

  • అమెరికాలో ఎంబీఏ చదివిన వెంకటేశ్‌ ఇండియా తిరిగొచ్చాక ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ, తన తండ్రి ప్రముఖ నిర్మాత రామానాయుడు.. దర్శకుడు రాఘవేంద్రరావును ఇంటికి పిలిచి ‘మా వాణ్ణి పరిచయం చేద్దాం’ అని అన్నారు. అలా వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ (1986).
  • బాల్యంలో ‘ప్రేమనగర్‌’ (1971) చిత్రంలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన చిత్రమిది.
  • చిన్నప్పటి నుంచి నటనపై ఆయనకు ఆసక్తిలేదు కాబట్టి ఏ ఫిల్మ్‌ స్కూల్‌లోనూ వెంకటేశ్‌ శిక్షణ తీసుకోలేదు. అందుకే నటుడైన తర్వాత అద్దం ముందే ఎక్కువ సమయం గడిపేవారు. ఆయా పాత్రలకు తగ్గట్టు హావభావాలు ఎలా పలికిస్తే బాగుంటుందో అద్దం ముందు ప్రాక్టీస్‌ చేసేవారు. అందుకే అద్దమే తన ఫిల్మ్‌ స్కూల్‌ అని ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
  • వెంకటేశ్‌కు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. టీమిండియా ఎక్కడ మ్యాచ్‌ ఆడినా ఆయా స్టేడియాలకు వెళ్లి చూస్తుంటారు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో పాల్గొని సందడి చేస్తారు.
  • ‘బిగ్‌బాస్‌’, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమాలకు హోస్ట్‌గా ముందు వెంకటేశ్‌నే అనుకున్నారు నిర్వాహకులు. దానికి ఈ హీరో అంగీకరించలేదు.

  •  అధ్యాత్మిక చింతన ఎక్కువ. జీసస్‌, రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస తదితరుల పుస్తకాలు చదివిన తర్వాత తన జీవితం మారిపోయిందని ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్‌ తెలిపారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేననని చెప్పారు.
  • అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటుడీయనే. కలియుగ పాండవులు (స్పెషల్‌ జ్యూరీ బెస్ట్‌ మేల్‌ డెబ్యూ), స్వర్ణకమలం (స్పెషల్‌ జ్యూరీ), ప్రేమ, ధర్మచక్రం, గణేష్‌, కలిసుందాం..రా, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాల్లోని నటనకుగాను బెస్ట్‌ యాక్టర్‌గా పురస్కారాలు దక్కించుకున్నారు. మరోవైపు, ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు సొంతం చేసుకున్నారు. 
  • అత్యధిక రీమేక్స్‌ చిత్రాల్లో నటించడమే కాకుండా సక్సెస్‌ రేట్‌ సొంతం చేసుకున్న వారిలో వెంకటేశ్‌ ముందుంటారు. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘శీను’, ‘సంక్రాంతి’, ‘నారప్ప’, ‘దృశ్యం’.. ఇలా 30కిపైగా రీమేక్స్‌తో వెంకీ ఆకట్టుకున్నారు.
  • వేరే హీరోలతో కలిసి పనిచేసేందుకు వెంకటేశ్‌ ఎప్పుడూ సిద్ధమే. ఇప్పటికే ఆయన పవన్‌ కల్యాణ్‌ (గోపాల గోపాల), మహేశ్‌ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), రామ్‌ (మసాలా), వరుణ్‌తేజ్‌ (ఎఫ్‌2, ఎఫ్‌ 3), ఓరి దేవుడా (విశ్వక్‌సేన్‌), కమల్‌ హాసన్‌ (ఈనాడు), అక్కినేని నాగేశ్వరరావు (బ్రహ్మరుద్రులు) తదితరులతో కలిసి నటించి అలరించారు. ‘కృష్ణంవందే జగద్గురుమ్‌’ (రానా)లోని ఓ పాటలో, ‘ప్రేమమ్‌’ (నాగచైతన్య), ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (సల్మాన్‌ ఖాన్‌)లో అతిథిగా ఆకట్టుకున్నారు.
  • టైటిల్స్‌లో ‘..రా’, ‘రాజా’ ఉండడం వెంకటేశ్‌కు బాగా కలిసొచ్చిన అంశం. ‘రాజా’, ‘బొబ్బిలి రాజా’, ‘కొండపల్లి రాజా’, ‘పోకిరి రాజా’, ‘ప్రేమించుకుందాం.. రా’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘కలిసుందాం..రా’, ‘జయం మనదేరా’, ‘ప్రేమతో.. రా’.. వీటిలో పోకిరి రాజా మినహా మిగిలినవన్నీ బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.
  • 90ల్లో కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్‌ సంపాదించుకున్న వెంకీ.. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ విషయంలో వారికి షాక్‌ ఇచ్చారు. రానాతో కలిసి ఆయన నటించిన ఈ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తగా ఫీడ్‌బ్యాక్‌ చూశానని, దాని సీక్వెల్‌ విషయంలో జాగ్రత్తపడతానని వెంకటేశ్‌ చెప్పడం అభిమానులకు ఆయన ఎంత విలువిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ హీరో 75వ చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav) 2024 జనవరి 13న విడుదల కానుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని