Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ హిట్‌లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ

ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్‌’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ..

Updated : 23 Dec 2023 10:47 IST

ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే.. అందులోని నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడికి క్రేజ్ రావడం సహజం. నిర్మాణ సంస్థ గురించీ ప్రేక్షకులంతా మాట్లాడుకోవడం విశేషం. అలాంటి వాటిలో హోంబలే ఫిల్మ్స్ ఒకటి. కేజీయఫ్, కాంతార, సలార్...ఇలా సినీ ప్రియులకు కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ గా నిలిచింది. మరి నిర్మాతలు ఎవరు? అసలు హోంబలే అంటే ఏంటి? తెలుసుకుందాం...

హోంబలే అర్థమిదీ..

కర్ణాటకకు చెందిన విజయ్‌ కిరంగదూర్‌ (Vijay Kiragandur), చలువే గౌడ (Chaluve Gowda), కార్తీక్‌ గౌడ (Karthik Gowda)కు సినిమాలపై ఉన్న ఆసక్తే ‘హోంబలే ఫిల్మ్స్‌’ (Hombale Films)కు కారణమైంది. వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు విజయ్‌ కిరంగదూర్‌ మాండ్య నుంచి బెంగళూరుకు షిఫ్ట్‌ అయ్యారు. అదే సమయంలో కార్తీక్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. కానీ, ఈ కజిన్స్‌కు మాత్రం సినిమాపై ప్రేమ పోలేదు. ఎలాగైనా చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలని నిర్ణయించుకుని, 2013లో ‘హోంబలే ఫిల్మ్స్‌’ను ప్రారంభించారు. దీనికి కిరంగదూర్‌, చలువే గౌడ అధినేతలుకాగా కార్తీక్‌ గౌడ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహస్తున్నారు. తమ ఇలవేల్పు హోంబలమ్మ పేరు మీద నిర్మాణ సంస్థకు ‘హోంబలే ఫిల్మ్స్‌’ అని నామకరణం చేశారు.

తొలి ప్రయత్నం.. చేదు అనుభవం

సినిమాలు నిర్మించేందుకు కావాల్సిన డబ్బు, ఆసక్తి ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో విజయం దక్కుతుందా..? సినీ నిర్మాణంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో తొలి ప్రయత్నంలో పరాజయం అందుకున్నారు ఈ నిర్మాతలు. కొత్త దర్శక, నిర్మాతలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే పునీత్‌ రాజ్‌కుమార్‌తో వారు తొలుత ‘నిన్నిందలే’ అనే సినిమాను నిర్మించారు. 2014లో విడుదలైన ఆ సినిమా నష్టాన్ని మిగిల్చింది. ఇతర వృత్తుల్లో ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆ ముగ్గురు చిత్ర పరిశ్రమలో పోగొట్టుకున్నట్టైంది. అయినా వారు వెనకడుగేయలేదు. ‘నిర్మాత అంటే డబ్బు ఖర్చు పెట్టడమే కాదు కథను జడ్జ్‌ చేయాలి’ అనే ధోరణిలో ఏడాది తిరిగేలోపు ‘మాస్టర్‌పీస్‌’ అనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. యశ్‌తో వారి ప్రయాణం ఈ చిత్రంలోనే మొదలైంది. ఈ సినిమా 2015లో రిలీజై ‘హోంబలే’ పేరును ఎక్కువ మందికి తెలిసేలా చేసింది. ఈ చిత్రం వసూళ్లు సుమారు రూ. 35 కోట్లు.

పునీత్‌తో మరోసారి..

పునీత్‌ రాజ్‌కుమార్‌తో తమ తొలి ప్రయత్నం విఫలమైనా ‘హోంబలే’ నిర్మాతలు మరోసారి ఆయనతోనే సినిమా చేశారు. అదే ‘రాజకుమార’. 2017 మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది. కన్నడ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు (సుమారు రూ. 76 కోట్లు: గ్రాస్‌) రాబట్టిన ఆరో చిత్రంగా నిలిచింది. మల్టీప్లెక్స్‌ల్లో ఆరు వారాల్లో 6000 షోస్‌ ప్రదర్శితమైన తొలి కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది.

‘కేజీయఫ్‌’.. సంచలనానికి నాంది

తొలి సినిమా రొమాంటిక్‌ కామెడీ డ్రామా, రెండు, మూడు చిత్రాలు యాక్షన్‌ డ్రామాలు.. ఇవి నేర్పిన పాఠాలతో నిర్మాతలు ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 1’ (KGF Chapter 1) అనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. యశ్‌ (Yash) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కన్నడలో రూపొంది, తర్వాత ఇతర భాషల్లోకి డబ్‌ అయి అన్ని చోట్లా సత్తా చాటింది. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌’ (KGF) కథ దాదాపు రూ. 250 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఓ కన్నడ సినిమా ఇన్ని కోట్ల వ్యాపారం చేసిందంటే అందరికీ ఆశ్చర్యమే మరి! ఈ ఒక్క చిత్రం హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌, నిర్మాతల కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. 2018 డిసెంబరు వరకు కన్నడనాట పరిమితమైన వారి పేర్లు ‘కేజీయఫ్‌’తో జాతీయ స్థాయిలో మెరిశాయి. కంటెంట్‌ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాను సూపర్‌హిట్‌ చేస్తారనడానికి ‘కేజీయఫ్‌’ ఓ నిదర్శనం.

విజయం దక్కితే ఆటోమేటిక్‌గా బాధ్యత పెరుగుతుంది. అంతకు మించిన ఒత్తిడీ ఉంటుంది. వాటన్నింటినీ అధిగమించి ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’ (సుమారు రూ. 1250 కోట్లు)తో తన మార్క్‌ను మరోసారి చూపించింది హోంబలే సంస్థ. ఈ భారీ ప్రాజెక్టుకు ముందు ఈ సంస్థ మళ్లీ పునీత్‌ రాజ్‌కుమార్‌తో ‘యువరత్న’ అనే సినిమా నిర్మించింది. 2021లో విడుదలైన ఈ చిత్రానికీ ప్రశంసలు దక్కాయి.

చిన్న చిత్రం.. ఘన విజయం

‘కేజీయఫ్‌ 1’ తర్వాత తక్కువ బడ్జెట్‌తో ‘యువరత్న’ను ప్లాన్‌ చేసినట్టే ‘కేజీయఫ్‌ 2’ (KGF Chapter 2) తర్వాత ‘కాంతార’ (Kantara)ను నిర్మించింది ‘హోంబలే ఫిల్మ్స్‌’. కన్నడ వరకే పరిమితం చేద్దామనుకున్న ఈ సినిమా ఊహించని రీతిలో ప్రేక్షకాదరణ పొందింది. దాంతో ఇతర భాషల్లోకి డబ్‌ చేసి, విడుదల చేశారు. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో.. కర్ణాటకలోని తుళునాడు సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 390 కోట్లు వసూళ్లు (గ్రాస్‌) రాబట్టి.. కన్నడ ఇండస్ట్రీ గురించి దేశమంతా మరోసారి చర్చించుకునేలా చేసింది.

ఇప్పుడు ‘సలార్‌’తో..

‘కాంతార’ తర్వాత నిర్మించిన ‘రాఘవేంద్ర స్టోరీస్‌’, ‘ధూమమ్‌’ (మలయాళం) ఈ ఏడాదిలోనే విడుదలై పాజిటివ్‌ రివ్యూలు తెచ్చుకున్నాయి. ఓవైపు ఇలా చిన్న సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించారు. ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్‌టాక్‌తో దూసుకెళ్తోంది. ‘ఇన్నేళ్లకు ప్రభాస్‌ కటౌట్‌ తగ్గ సినిమా’ అంటూ అభిమానగణం సంబరాలు చేసుకుంటోంది. హోంబలే తదుపరి ప్రాజెక్టులివి: యువ, భగీర (Bagheera), కాంతార ఛాప్టర్‌ 1 (Kantara: Chapter 1), రిచర్డ్‌ ఆంథోనీ (కన్నడ). రఘుతాత (తమిళ్‌) (Raghu Thatha), టైసన్‌ (మలయాళం).

పరాజయం నేర్పిన పాఠాలు..

‘‘మేం ఏ కథనైనా ప్రేక్షకుల కోణంలోనే చర్చిస్తాం. ‘ఎలాంటి అంశాలు ఉంటే ఆడియన్స్‌కు నచ్చుతుంది. కొత్తగా ఏం చూపించాలి?’ అనే దృష్టితోనే ఉంటాం. మా తొలి చిత్రం పరాజయం అందుకున్నా.. మాకెన్నో పాఠాలు నేర్పింది. మరోసారి ఫెయిల్యూర్‌ ఎదురుపడకూడదని మేం అప్పుడే నిశ్చయించుకున్నాం. ఓ ప్లానింగ్‌ ప్రకారం ముందుకెళ్తున్నాం. వీధి నాటకాలు, హరికథలు సామాజిక, సాంస్కృతిక అవగాహన కల్పించేవి. మన మూలాలను గుర్తుచేసుకుంటూ ఆ నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు ఓ సందర్భంలో తెలిపారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని