Rajinikanth: ఆ విషయంలో ఏకైక భారతీయ నటుడు.. రజనీకాంత్‌ బర్త్‌డే స్పెషల్‌

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విశేషాలు తెలుసుకుందాం..

Published : 12 Dec 2023 09:47 IST

Happy Birthday Thalaivar స్టైల్‌గా నడుస్తూ సిగరెట్‌ వెలిగించడం.. కళ్లజోడు పెట్టుకోవడం.. జుట్టు తిప్పడం.. ఇలా తెరపై రజనీకాంత్‌ (Rajinikanth) ఏది చేసినా కళ్లు అప్పగించడమే ప్రేక్షకుల వంతవుతుంది. ‘నా దారి.. రహదారి’ అని ఆయన ఒక్కసారి చెప్పినా వందసార్లు మార్మోగుతుంది. నటుడిగా ఎన్నో అవార్డులు- రివార్డులు అందుకున్న ఈ అగ్ర హీరో వ్యక్తిగా ఎలా ఉంటారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! నేడు ఆయన పుట్టినరోజు (1950 డిసెంబరు 12) సందర్భంగా ఆ సంగతుల్లో కొన్నింటిని చూద్దాం (Happy Birthday Rajinikanth).. 

  • రజనీకాంత్‌ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌ ( Shivaji Rao Gaikwad) అని, బస్‌ కండక్టర్‌గా పనిచేశారని చాలామంది తెలుసు. కానీ, అంతకంటే ముందు ఆయన కూలీగా, కార్పెంటర్‌గా పనిచేశారు.
  • రజనీకాంత్‌ నటించిన తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’ (తమిళం) (Apoorva Raagangal). తొలి తెలుగు సినిమా ‘అంతులేని కథ’ (Anthuleni Katha). కెరీర్‌ ప్రారంభంలో ఆయన విలన్‌గాను మెప్పించారు. 1978లో సుమారు 20కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన ‘భైరవి’ ఘన విజయం అందుకోవడంతో అప్పటి నుంచి ఆయన పేరు ముందు ‘సూపర్‌స్టార్‌’ని చేర్చారు.
  • బెంగళూరులోని ఓ గుడిలో రజనీకాంత్‌ కూర్చొని ఉండగా అక్కడున్న యాచకులు ఆయన చేతిలో డబ్బులు వేశారట! ఆ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ ..‘‘నేనేంటో ఆ సంఘటనే తెలియజేస్తుంది. అందుకే పైపై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వను’’ అని చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
  • ‘దళపతి’ (Thalapathi) సినిమా చిత్రీకరణ సమయంలో అరవిందస్వామి తనకు తెలియక.. రజనీకాంత్‌ రూమ్‌కు వెళ్లారు. అక్కడున్న బెడ్‌పై ఆయన నిద్రపోయారు. గాఢ నిద్రలో ఉన్న అరవిందస్వామిని లేపడం ఇష్టంలేక రజనీ అదే గదిలో నేలపై పడుకున్నారు. అప్పటికి అంతగా గుర్తింపులేని తన విషయంలో రజనీ అలా వ్యవహరించడంతో ఆశ్చర్యపోవడం అరవిందస్వామి వంతైంది.
  • 1996 ఎన్నికల సమయంలో రజనీ ఓ పార్టీకి మద్దతు తెలిపారు. మరో పార్టీ తరఫున ప్రచారం చేసిన నటి మనోరమ ఆయన్ను కించపరుస్తూ మాట్లాడారు. దాంతో, ఎన్నికల తర్వాత మనోరమకి సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ విషయం తెలుసుకున్న రజనీ స్వయంగా కలగజేసుకుని తన ‘అరుణాచలం’ సినిమాలో ఆమెకు అవకాశం ఇప్పించి మంచి మనసు చాటుకున్నారు.
  • సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు రజనీకాంత్‌. ‘ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టు ఫిల్మ్‌స్టార్‌’ పేరుతో సీబీఎస్‌ఈ ఆరో తరగతి విద్యార్థులకు రజనీ జీవితం ఓ పాఠంగా ఉంది.
  • సంపాదనలో 50 శాతాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయించే రజనీకి ఎప్పటికైనా హిమాలయాల్లో స్థిరపడాలన్నది చిరకాల కోరిక.

  • పద్మభూషణ్ (2000), పద్మ విభూషణ్‌ (2016), దాదా ఫాల్కే (2019) అవార్డులు అందుకున్నారు. ‘ఫాల్కే’ పురస్కారాన్ని తన గురువు, దర్శకుడు బాలచందర్‌, మిత్రుడు (బస్‌ డ్రైవర్) రాజ్‌ బహుదూర్‌, తనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులు, సహ నటులు, సాంకేతిక నిపుణులు, థియేటర్ల యజమానులు, అభిమానులు, తమిళ ప్రజలకు అంకితమిచ్చారు.
  • ఒకానొక సమయంలో రాజకీయరంగ ప్రవేశంపై ఆసక్తి చూపిన రజనీ తర్వాత వద్దనుకున్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పాలిటిక్స్‌కు దూరమయ్యాయని ఓ సందర్భంలో తెలిపారు.
  • 2007లో.. ఆసియాలో అత్యధిక పారితోషికం అందుకున్న రెండో నటుడిగా రజనీకాంత్‌ నిలిచారు. జాకీ చాన్‌ది తొలిస్థానం.
  • ‘మన్నన్‌’, ‘కొచ్చడైయాన్‌’ సినిమాల్లో రజనీ పాటలు కూడా పాడారు. వల్లి (1993), ‘బాబా’ (2002) చిత్రాలకు స్క్రీన్‌ రైటర్‌గాను పనిచేశారు. నిర్మాత కూడా ఆయనే. తాను నటించిన సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే వారికి డబ్బుని తిరిగిచ్చే కొత్త సంస్కృతిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది రజనీనే.
  • ఓ వైపు వయసు పెరగడం, మరోవైపు ‘బాబా’ (Baba) సినిమా ఘోర పరాజయం పొందడంతో ‘ఇక రజనీకాంత్‌ పని అయిపోయింది’ అని చాలామంది అభిప్రాయపడ్డారు. దాదాపు మూడేళ్ల విరామం అనంతరం ‘చంద్రముఖి’తో ఆయన విమర్శకులకు సమాధానమిచ్చారు. ఆ తర్వాత నటించిన ‘శివాజీ’, ‘రోబో’లు కూడా బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచాయి.
  • ‘లింగా’, ‘కబాలి’, ‘కాలా’, ‘పేట’, ‘దర్బార్‌’, ‘అన్నాత్తే’.. ఇలా వరుస సినిమాలు అభిమానులను ఓకే అనిపించినా ఏదో అసంతృప్తి. ఆ లోటును ఈ ఏడాది విడుదలైన ‘జైలర్‌’ (Jailer) తీర్చేసింది. ఆయన కీలక పాత్ర పోషించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) 2024 సంక్రాంతికి విడుదలకానుంది. ప్రస్తుతం ఆయన తన 170వ (Thalaivar 170) సినిమాతో బిజీగా ఉన్నారు. టీజీ జ్ఞానవేల్‌ దర్శకుడు. ఇది పూర్తయ్యాక లోకేశ్‌ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తారు. వెండితెరపై రజనీ మరిన్ని ‘కాంతు’లీనాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని