Pawan kalyan: నేను రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్‌కు ఇష్టం లేదు: పవన్‌కల్యాణ్‌

తన మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan). సమాజం కోసం తాను ఆలోచిస్తే.. తనకోసం ఆలోచించే వ్యక్తి త్రివిక్రమ్‌ అన్నారు.

Published : 15 Mar 2024 00:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో పార్టీని ఎలా నడపాలో, డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలో తెలియక ఇబ్బందిపడుతున్నప్పుడు తన మిత్రుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అండగా నిలిచారన్నారు.

‘‘దాదాపు పది ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు ఉండుంటే ఈపాటికి గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీ అయ్యేది. ఆరోజు నా వ్యూహాన్ని ఎవరూ అమలు చేయనివ్వలేదు. నేను వెళ్తే లక్షలాది మంది జనం వచ్చేస్తారు. లక్షలాది ఓటర్లు కాదు. నాకు ఆ స్పష్టత ఉంది. దారుణం ఏమిటంటే.. 2019 ఎన్నికల్లో ఓడిపోతానన్న విషయం కూడా నాకు తెలుసు. యుద్ధం చేసినప్పుడు జయాపజయాలతో సంబంధం లేదు. వీటన్నింటినీ తట్టుకుని.. సినిమాలన్నీ వదులుకుని.. డబ్బుల్లేక.. ఇంత అభిమాన బలం ఉండి.. ఓడిపోయిన తర్వాత.. దేశం మీద ఇంత పిచ్చి మంచిదా? అనుకున్నా.

‘‘పార్టీని ఎలా నడపాలో.. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాలేదు. అలాంటి సమయంలో వెన్నంటే ఉన్న నా స్నేహితుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను సమాజం కోసం ఆలోచిస్తే నాకోసం ఆలోచించేవారు ఒకరు ఉండాలి కదా. ‘వకీల్‌సాబ్‌’తోపాటు మరో మూడు, నాలుగు సినిమాలు చేశాం. నేను రాజకీయాల్లోకి రావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. టీనేజ్‌లో ఉద్యమంలోకి వెళ్లిపోవాలనుకున్నా.. కుదరలేదు. సమాజం పట్ల మనసులో ఎంతో కోపం ఉండిపోయింది. నా వ్యధ చూసిన ఆయన.. ఆ బాధనంతా సినిమాలో మాటలుగా రాసేస్తే రాజకీయాల్లోకి వెళ్లనని భావించి ‘జల్సా’లో ఇంటర్వెల్‌ సీన్‌ రాశారు. నా ఆవేశం చూసి.. చివరకు ఆయన చేతులెత్తేశారు. మీ ఇష్టం వచ్చింది చేయండన్నారు’’ అని పవన్‌కల్యాణ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని