Jaya Bachchan: అప్పుడు నేనెంతో బాధపడ్డా.. ప్రశంసలు కాదు గుర్తింపు కావాలి: జయాబచ్చన్‌

తన కెరీర్‌, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జయా బచ్చన్‌ (Jaya Bachchan).

Published : 15 Mar 2024 18:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన మనవరాలు నవ్య నిర్వహిస్తోన్న ‘వాట్‌ ది హెల్‌ నవ్య’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సతీమణి జయాబచ్చన్‌ (Jaya Bachchan). ఒకానొక సమయంలో అమితాబ్‌ బచ్చన్‌ ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ‘‘జీవితంలోని వివిధ దశల్లో మేము ఎన్నో పరాజయాలు చవిచూశాం. మేమిద్దరం కలిసి సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక వ్యక్తికి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అతడి భార్య ఎలాంటి గొడవలు పడకుండా పక్కనే ఉండి ధైర్యానివ్వాలి. అనవసర ప్రశ్నలు వేయకుండా నేనున్నా అని భరోస్తా ఇస్తే ఆ బంధం మరింత బలోపేతం అవుతుంది. అదే నేను నమ్మా. ఇది కరెక్టో, కాదో నాకు తెలియదు కానీ నేను ఇదే చేశా’’ అని ఆమె అన్నారు.

కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘అనుకున్న స్థాయిలో గుర్తింపు పొందనప్పుడు నటీనటులు ఎవరైనా బాధ పడతారు. ఆ రోజుల్లో మేము అద్భుతంగా వర్క్‌ చేశామని, ఎంతోమందికి మార్గనిర్దేశంగా నిలిచామని భావిస్తుంటా. కానీ, దానికి సరిపడా గుర్తింపు రాలేదు. ప్రశంసల గురించి కాదు. గుర్తింపు గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. నా తలరాత ఇంతేనని భావించా. నేను ఎంతో బాధకు గురయ్యా’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కుమార్తె శ్వేత మాట్లాడుతూ.. ‘‘వృత్తిపరంగా నేనూ పరాజయాన్ని ఎదుర్కొన్నా. నేనొక పుస్తకం రాశా. ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా దానిని తీర్చిదిద్దలేకపోయా. ఏదైతే అది జరిగింది. తిరిగి ప్రయత్నిద్దామనుకునే వ్యక్తిని కాదు నేను. దాంతో ఆ పరాజయం నన్నెంతో బాధించింది. ఆ బాధతో రాయడం మానేశా’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని