Jayasudha: భర్త ఆత్మహత్యపై స్పందించిన జయసుధ

తన భర్త నితిన్‌ కపూర్‌ సూసైడ్‌ చేసుకోవడానికి తాను కారణం కాదన్నారు ప్రముఖ నటి జయసుధ.

Published : 06 Mar 2024 00:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిర్మాత, తన భర్త నితిన్‌ కపూర్‌ (Nitin Kapoor) ఆత్మహత్యపై ప్రముఖ నటి జయసుధ (Jayasudha) తొలిసారి స్పందించారు. ఆ ఘటనకు తాను బాధ్యురాలిని కాదు అని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను హోస్ట్‌ ప్రశ్నించగా సమాధానమిచ్చారు. ‘అప్పుల బాధ తట్టుకోలేక నితిన్‌ చనిపోయారు. దానికి జయసుధ కారణమంటూ అప్పట్లో వార్తలొచ్చాయి..’ అని హోస్ట్‌ ప్రస్తావించగా నటి ఇలా వివరించారు.

‘‘సినిమా వాళ్ల విషయంలో కొందరు తమకు ఏది అనిపిస్తే అది రాసేస్తుంటారు. నిజం తెలుసుకోరు. మాకు అప్పులు లేవు. వాటిని తీర్చలేక ఆయన సూసైడ్‌ చేసుకున్నారనేది నిజం కాదు. నితిన్‌ సోదరుడు, వారి బంధువులైన ఇద్దరు మహిళలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్పుడో ఒకప్పుడు నితిన్‌కు ఇలా జరుగుతుందని అనుకున్నాం. నేను, మా అత్తగారు వాళ్లు దాన్ని ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించాం. కానీ, ఆయన్ను కాపాడుకోలేకపోయాం. రాబోయేతరాలకు ఈ పరిస్థితి ఉండకూడదని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. నితిన్‌ లేరన్న బాధ నుంచి కోలుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. ఆ సమయంలో ఫ్యామిలీ సపోర్ట్‌గా నిలిచింది’’ అని అన్నారు.

‘ఆది దంపతులు’, ‘కలికాలం’, ‘హ్యాండ్సప్‌’, ‘మేరా పతి సిర్ఫ్‌ మేరా హై’, ‘వింత కోడళ్లు’ తదితర చిత్రాలను నితిన్‌ నిర్మించారు. 2017లో సూసైడ్‌ చేసుకున్నారు. వీరి తనయుడు నిహర్‌ కపూర్‌ ‘రికార్డు బ్రేక్‌’ (Record Break) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 8న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇంతకుముందు.. ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’లో కీలక పాత్ర పోషించిన నిహర్‌ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని