Kangana Ranaut: ఆ సినిమా చూశాక.. నేను ప్రధానిని కావాలని ఎవరూ కోరుకోరు: కంగనా రనౌత్

‘ప్రధానమంత్రి కావాలని అనుకున్నారా?’ అన్న ప్రశ్నపై నటి కంగనా రనౌత్‌ స్పందించారు.

Published : 11 Feb 2024 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే కథానాయిక కంగనా రనౌత్‌ (Kangana Ranaut). తాజాగా ఆమె.. ‘రజాకార్‌: ది సైలెంట్‌ జెనోసైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ (Razakar: The Silent Genocide of Hyderabad) సినిమా హిందీ ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్‌ రిలీజ్‌ అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో.. ‘ప్రధానమంత్రి కావాలని ఎప్పుడైనా అనుకున్నారా?’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. తన సినిమాపై తానే కామెంట్‌ చేశారు. ‘‘ఇటీవల నేను ‘ఎమర్జెన్సీ’ (Emergency)లో నటించా. త్వరలోనే విడుదల కానుంది. అది చూశాక ఎవరూ నేను పీఎం కావాలని కోరుకోరు’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

కంగనా తీరుని బట్టి ఆమె రాజకీయాల్లోకి వస్తారని చాలామంది భావించారు. ఈ మేరకు పలు ఇంటర్వ్యూల్లో ఎదరైన ప్రశ్నలకు ఆమె సానుకూలంగానే స్పందించారు. ‘భగవాన్‌ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా పోరాడుతా’ అని పాలిటిక్స్‌ ఎంట్రీపై గతేడాది హింట్‌ ఇచ్చారు. భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమే ‘ఎమర్జెన్సీ’. దీనికి కంగనానే దర్శకత్వం వహించారు. నిర్మాతగాను వ్యవహరించారు. ఇందిరా గాంధీగా కంగన, జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా జూన్‌ 14న విడుదల కానుంది.

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన బహుభాషా చిత్రం ‘రజాకార్‌’. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ‘‘రక్తంతో తడిసిన చరిత్ర మట్టిలో కలిసిపోయింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబరు 17 కథా వస్తువుగా మారింది. ఆనాడు జరిగిన విముక్తి పోరాటం ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇది మత ఘర్షణ కాదు. స్వాతంత్య్ర పోరాటం’’ అని దర్శకుడు ఓ సందర్భంలో తెలిపారు. మార్చి 1న సినిమా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని