Yash - KGF: కొత్త సినిమాపై యశ్‌ అదే మాట.. ఇక JAN 8 మీదే ఆశలు!

‘KGF’ స్టార్‌ యశ్‌(Yash) కొత్త సినిమా గురించి చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అభిమానులు జనవరి 8 కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రోజు యశ్‌కి, అభిమానులకు ప్రత్యేకం కావడంతో అప్‌డేట్‌ పక్కా అంటున్నారు. 

Published : 25 Dec 2022 17:12 IST

హైదరాబాద్‌: ‘కేజీయఫ్‌’ (KGF)తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయిన యశ్‌ (Yash).. తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. చాలామంది చాలారకాలుగా ప్రయత్నిస్తున్నా.. ఆయన మాత్రం ఓపెన్‌ అవ్వడం లేదు. అయితే సినిమా వచ్చి ఆరు నెలలు దాటింది కదా.. ఇప్పుడైనా చెబుతాడేమో అనుకుంటే.. ఆసక్తికర సమాధానం చెప్పి దాటేశాడు. 

‘కేజీయఫ్‌ 2’ విడుదలైన వెంటనే యశ్‌కు భారీ ఆఫర్లు వస్తాయి అని అనుకున్నారంతా. అనుకున్నట్లుగా వచ్చాయి. అయితే ఆయన ఏదో ఒకటి ఓకే చేసి ముందుకెళ్లాలి అనుకోలేదు. ఇప్పటికీ ఆయన సమాధానం అలానే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నా తర్వాతి సినిమా కోసం ఎదురుచూసే అభిమానులు కొంచెం ఓపిక పట్టాలి’’ అంటూ తన పాత మాటే మళ్లీ చెప్పడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.

మనం ఏదైనా విజయం సాధించినప్పుడు దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే దాని గురించి తెలుసుకుంటారు. ఒక రాజు ప్రజల దగ్గరకు వెళ్లి ‘నేనే రాజుని’ అని చెబితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో... మన విజయం గురించి మనం మాట్లాడినా అలానే ఉంటుంది. నా తర్వాతి సినిమాకు సంబంధించిన ప్రకటన కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ‘కేజీయఫ్‌’ సిరీస్‌ సినిమాల సక్సెస్‌కు నేనూ ఆశ్చర్యపోయాను. కానీ.. నేను ఆ సినిమా ఇచ్చిన విజయాన్ని క్యాష్‌ చేసుకునే రకం కాదు. నిరంతరం నేర్చుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏ పనినైనా ఎంత ఉత్సాహంగా ప్రారంభిస్తానో, అంతే ఉత్సాహంగా పూర్తి చేస్తాను. పని కోసం ఎంత పోరాటమైనా చేస్తాను

- యశ్‌

జనవరి 8 కోసం అందరూ...

యశ్‌ కొత్త సినిమా ప్రకటన కోసం కళ్లు కాయులు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానుల చూపు ఇప్పుడు జనవరి 8 మీద పడింది. ఆ రోజు అతని పుట్టిన రోజు కావడంతో.. అప్పుడైనా కొత్త సినిమా ప్రకటన ఉంటుందేమో అనుకుంటున్నారు. అయితే ఆ రోజు ‘కేజీయఫ్‌ 3’ గురించి అప్‌డేట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్నీమధ్య ‘కేజీయఫ్‌’ నిర్మాణ హోంబలే టీమ్‌ మాట్లాడుతూ ‘సలార్‌’ తర్వాత ‘కేజీయఫ్‌ 3’ పనులు ప్రారంభిస్తాం అని చెప్పారు. దీంతో యశ్‌ తర్వాతి సినిమా ‘కేజీయఫ్‌ 3’నే కావొచ్చు అనే ఓ టాక్‌ కూడా నడుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని