Krishna: అలా చేయకపోవడం వల్లే కృష్ణ నష్టపోయారట.. నాటి జ్ఞాపకాలివీ

తన డైరెక్షన్‌ గురించి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలివి. ఆయన ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారంటే..?

Published : 16 Nov 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడిగా కృష్ణ (Krishna) చేసిన సాహసాలు అందరికీ తెలుసు. దర్శకుడిగా ఆయన సృష్టించిన సంచనాల గురించి కొందరికే తెలుసు. ఆయనెందుకు మెగాఫోన్‌ పట్టుకున్నారు? ఆయన ఎన్ని చిత్రాలు తెరకెక్కించారు? తెలుసుకుందాం..

కెరీర్‌ సంతృప్తికరంగా సాగుతున్న సమయంలోనే కృష్ణకు డైరెక్షన్‌ చేయాలనే ఆసక్తి ఉండేది. నటుడిగా తనకున్న అనుభవాన్ని రంగరించి తన అభిరుచికి తగ్గ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. ఆ ఆలోచన కార్యరూపం దాల్చి ‘సింహాసనం’ అయింది. జానపద నేపథ్యం అయితేనే గ్రాండియర్‌గా ఉంటుందని భావించిన కృష్ణ తన శ్రేయోభిలాషులతో కలిసి ఓ నిర్ణయానికొచ్చారు. నిర్మాణ వ్యయం ఎక్కువవుతుందనే కారణంగా ఆ చిత్రాన్ని హిందీ (సింఘాసన్‌)లో కూడా ప్లాన్ చేశారు. హిందీ వెర్షన్‌కూ కృష్ణనే దర్శకత్వం వహించడం విశేషం. అంతేకాదు ఎడిటింగ్‌, స్క్రీన్‌ప్లే బాధ్యతలూ కృష్ణవే. ఈ సినిమా సెట్స్‌ను రూ. 50 లక్షల వ్యయంతో రూపొందించారు. ఆ సెట్‌ ‘టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌’ అయింది. 70 ఎం. ఎం. సిక్స్‌ట్రాక్స్‌ స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌ సిస్టమ్‌తో వచ్చిన తొలి సినిమాగా పేరొందిన ‘సింహాసనం’ రూ. 3 కోట్లతో నిర్మితమైంది. ‘జానపదాలు అంతరించిపోతున్న రోజుల్లో ఇంత బడ్జెట్‌ పెట్టి జానపద చిత్రం తీయడం సాహసం’ అని కృష్ణను ఎంతోమంది కొనియాడారు. 1986 మార్చి 21న 85 ప్రింట్లతో 157 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇదీ ఓ రికార్డే.

సింహాసనం ఉత్సాహంలో..

తొలి చిత్రం ‘సింహాసనం’తో దర్శకుడిగానూ తనకు తిరుగులేదని అనిపించుకున్న కృష్ణ తదుపరి ‘శంఖారావం’, ‘కలియుగ కర్ణుడు’, ‘ముగ్గురు కొడుకులు’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘రిక్షావాలా’, ‘అన్న-తమ్ముడు’, ‘బాల చంద్రుడు’, ‘నాగాస్త్రం’, ‘ఇంద్ర భవనం’, ‘అల్లుడు దిద్దిన కాపురం’, ‘రక్తతర్పణం’, ‘మానవుడు దానువుడు’, ‘పండంటి సంసారం’, ‘ఇష్క్‌ హై తుమ్‌సే’ (హిందీ) చిత్రాలను తెరకెక్కించారు.

ఆ దర్శకులు సినిమాలు చేయడం మానేశారు..

దర్శకుడిగా కొన్నాళ్ల విరామం అనంతరం ‘పండంటి సంసారం’ సినిమా చేశారు కృష్ణ. గ్యాప్‌ ఎందుకొచ్చింది? ఆ సినిమాకి మీరే ఎందుకు దర్శకత్వం వహిస్తున్నారు? అనే ప్రశ్నలకు ఓ ఇంటర్వ్యూలో ఇలా సమాధానమిచ్చారాయన... ‘‘నా డైరెక్షన్‌లో నేను నటించిన సినిమాలే నాకు పెద్ద విజయాన్ని అందించాయి. దర్శకత్వం చేయకపోవడమే నా డ్రాబ్యాక్‌ అనుకుంటున్నా. దాని వల్ల నష్టమే ఎక్కువ జరిగింది. ‘సింహాసనం’ తర్వాత నుంచి డిమాండ్‌ ఉన్న దర్శకులెవరూ నాతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. మా పద్మాలయా సంస్థలో తెరకెక్కిన సినిమాలే నాకు హిట్స్‌ ఇచ్చాయి తప్ప పెద్ద డైరెక్టర్లు నాకు హిట్స్‌ ఇవ్వలేదు. నేను దర్శకత్వం వహించిన సినిమాల్లో 10 సూపర్‌ హిట్‌ అందుకున్నాయి’’ అని అన్నారు. ఇక హీరోగా తన కెరీర్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేను చేసిన 340కిపైగా చిత్రాల్లో సుమారు 100 మొహమాటానికి చేసినవే’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని