Kumari Srimathi Review: రివ్యూ: కుమారి శ్రీమతి.. నిత్యామేనన్‌ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

kumari srimathi review: నిత్యామేనన్‌ కీలక పాత్రలో నటించిన కుమారి శ్రీమతి ఎలా ఉందంటే?

Updated : 29 Sep 2023 18:21 IST

kumari srimathi review: వెబ్‌సిరీస్‌ రివ్యూ: కుమారి శ్రీమతి; నటీనటులు: నిత్యామేనన్‌, గౌతమి, తిరువీర్‌, నిరుపమ్‌, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీ మోహన్‌ తదితరులు; ప్రొడక్షన్‌ డిజైన్‌: లతా నాయుడు; కాస్టూమ్స్‌: గీతా గౌతమ్‌, నీరజ కోన(నిత్యామేనన్‌); సంగీతం: స్టెక్కటో & కమ్రాన్; లిరిక్స్‌: కడలి; సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ; ఎడిటర్: సృజన అడుసుమిల్లి; కథ: బలభద్రపాత్రుని రమణి, మల్లిక్‌రామ్‌; రచన: ఉదయ్‌ అగమర్షన్‌, జయంత్‌ తాడినాడ, కౌశిక్‌ సుబ్రహ్మణ్య; స్క్రీన్‌ప్లే, సంభాషణలు, షో క్రియేట్‌: శ్రీనివాస్‌ అవసరాల; నిర్మాత: స్వప్న సినిమా; దర్శకత్వం: గోమఠేష్‌ ఉపాధ్యాయి; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

సినిమాలకు దీటుగా ఇటీవల కాలంలో వెబ్‌సిరీస్‌లు అలరిస్తున్న సంగతి తెలిసిందే. వెండితెరపై అలరించిన నటీనటులు కూడా వెబ్‌సిరీస్‌లలో నటిస్తుండటంతో వాటిపై మరింత ఆసక్తి పెరుగుతోంది. కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యామేనన్‌ వరుసగా సిరీస్‌లలో నటిస్తున్నారు. తాజాగా ‘కుమారి శ్రీమతి’ అంటూ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా పలకరించారు. మరి ఈ కుమారి శ్రీమతి ఎవరు?(kumari srimathi review) ఆమె లక్ష్యం ఏంటి?

కథేంటంటే: రాజమహేంద్రవరం సమీపంలోని రామరాజులంకలో తల్లి దేవకి (గౌతమి), చెల్లి కల్యాణి (ప్రణీత పట్నాయక్‌), నాయనమ్మ శేషమ్మ (రామేశ్వరి)లతో కలిసి ఉంటుంది సిరి అలియాస్‌ శ్రీమతి (నిత్యామేనన్‌). హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి, ఓ రెస్టారెంట్‌లో రూ.13వేల జీతానికి పనిచేస్తుంటుంది. మరోవైపు తాతల నాటి ఇంటిని అమ్మేందుకు సిరి బాబాయి కేశవరావు (ప్రేమ్‌సాగర్‌) ప్రయత్నించడంతో న్యాయస్థానంలో పోరాటం చేస్తుంటుంది. అలా 18ఏళ్ల పాటు కోర్టులో కేసు నడిచిన తర్వాత తన నాన్న రాసిన వీలునామా దొరికిందని, దాని ప్రకారం ఇంటిని తనకే ఇవ్వాలని కేశవరావు కోర్టులో ఆధారాలు చూపిస్తాడు. అయితే, ఇంటి విలువను రూ.38లక్షలుగా కోర్టు లెక్కగడుతుంది. తాతల నాటి ఆస్తి కావడంతో మొత్తాన్ని ఆరు నెలల్లో కేశవరావుకు చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చని శ్రీమతికి కోర్టు ఒక అవకాశం ఇస్తుంది. నెల జీతం, తల్లి దేవకి కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న శ్రీమతి రూ.38లక్షలు సంపాదించడానికి ఊళ్లో బార్‌ పెట్టాలనుకుంటుంది. మరి శ్రీమతి తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఊళ్లో బార్‌ పెట్టడానికి ఆమె పడిన కష్టం ఏంటి? (kumari srimathi review in telugu) ఈ క్రమంలో పక్కంటి అబ్బాయి శ్రీరామ్‌ (నిరుపమ్‌), చిన్ననాటి స్నేహితుడు అభి (తిరువీర్‌), కాలేజ్‌ మిత్రుడు దొరబాబు (గవిరెెడ్డి శ్రీనివాస్‌) చేసిన సాయం ఏంటి? అసలు శ్రీమతి తండ్రి విశ్వేశ్వరరావు (నరేష్‌) ఏమయ్యాడు? చివరకు శ్రీమతి తాతలనాటి ఇంటిని దక్కించుకుందా? తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: వారసత్వపు ఆస్తిని దక్కించుకునే నేపథ్యంలో ఇప్పటికే అనేక చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ఈ కథల్లో కాన్సెప్ట్‌లు వేరైనా లక్ష్యం ఒక్కటే. తాత/తండ్రి సంపాదించిన ఆస్తిని తిరిగి దక్కించుకోవడం. ఇందుకు కథానాయకుడు/నాయిక ఏం చేశారు? ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు అనే అంశాలను ఎంత ఆసక్తికరంగా చూపించారన్న దానిపై సినిమా/వెబ్‌సిరీస్‌ విజయం ఆధారపడి ఉంటుంది. ‘కుమారి శ్రీమతి’ని ఎంటర్‌టైనింగ్‌గా చూపించడంలో దర్శక-రచయితలు కొంత మేర విజయం సాధించారు. సుమారు 30 నుంచి 40 నిమిషాల నిడివి గల మొత్తం ఏడు ఎపిసోడ్స్‌లో కొన్ని భావోద్వేగాల మిళితంగా, మరికొన్ని ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. శ్రీమతి కుటుంబ నేపథ్యంతో పాటు పాత్రలను మొదటి ఎపిసోడ్‌లో పరిచయం చేశారు. (kumari srimathi review) అంతేకాదు, అసలు కథ తాతల నాటి ఇల్లు.. దాని దక్కించుకునేందుకు రూ.38లక్షలు సంపాదించడం.. అందుకు ఊళ్లో బార్‌ పెట్టాలని శ్రీమతి నిర్ణయం తీసుకోవడం.. వంటి కీలక అంశాలతో మొదటి ఎపిసోడ్‌ను ముగించి,  తర్వాతి ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందోననే ఆసక్తిని పెంచారు. శ్రీమతి బార్‌ పెట్టేందుకు పడే అవస్థలను ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తారనుకుంటే అక్కడక్కడ మాత్రమే మెరుపులు కనిపించాయి. చాలా సన్నివేశాలు రిపీట్‌ అయినట్లు అనిపిస్తాయి. అయితే, కేశవరావు, అతని కొడుకులు కనిపించే సన్నివేశాలు మాత్రం సరదాగా ఉంటాయి.

శ్రీమతి చిన్న నాటి స్నేహితుడు అభిరామ్‌ రాకతో కథ మరోమలుపు తిరుగుతుంది. ఒకవైపు శ్రీమతి బార్‌ ప్రయత్నాలు కొనసాగిస్తూనే, మరోవైపు ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అవి అంతగా పండలేదు. మధ్య మధ్యలో శ్రీమతి విషయంలో ఆమె తల్లి దేవకి కనే పగటి కలలు మాత్రం బాగా నవ్వులు పంచుతాయి. 4, 5, 6 ఎపిసోడ్స్‌ శ్రీమతి పెట్టిన ‘తాజ్‌ మహల్‌’ బార్‌ చుట్టూనే తిరుగుతాయి. అవన్నీ ఒక రొటీన్‌ ఫార్మాట్‌లో ఉంటాయి. పైగా చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూస్తున్నామా? అనిపిస్తుంది. అయితే, మధ్యలో హీరో నాని గెస్ట్‌గా కనిపించే సన్నివేశాలు అలరిస్తాయి. ఇక శ్రీమతి రూ.38లక్షల టార్గెట్ పూర్తి చేస్తుందా? అన్న విషయంతో మొదలైన ఏడో ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. అప్పటివరకూ సాగదీసిన చాలా విషయాలను వివరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. (kumari srimathi review) శ్రీమతి తండ్రి విశ్వేశ్వరరావు తిరిగి రావడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. అదే సమయంలో భావోద్వేగాలపరంగానూ మెప్పిస్తుంది. ఇక్కడే ఒకట్రెండు ట్విస్ట్‌లు ఉంటాయి. అవి అలరిస్తాయి. అయితే, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే దర్శకుడు ‘కుమారి శ్రీమతి’ని ముగించాడు. మరీ ముఖ్యంగా శ్రీరామ్‌ తన ప్రేమను శ్రీమతికి చెప్పాడా? లేదా? అలాగే తాతల నాటి ఇంట్లో దొరికిన కాగితాలను శ్రీమతి ఎందుకు చింపేసింది? భార్య పిల్లలను వదిలి విశ్వేశ్వరరావు ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నాడు? తదితర ప్రశ్నలకు సమాధానం లేదు. బహుశా ‘కుమారి శ్రీమతి2’ ఉంటుందేమో చూడాలి.

ఎవరెలా చేశారంటే: సిరీస్‌ మొత్తాన్ని, శ్రీమతి పాత్రను నిత్యామేనన్‌ తన భుజాలపై మోసింది. ప్రతి సన్నివేశంలోనూ ఆమె కనిపిస్తుంది. భావోద్వేగాలపరంగా ఆమె నటనను వేలు పెట్టి చూపే అవసరం లేదు. తన అభిమాన కథానాయకుడు కనపడితే ఒక సగటు అభిమాని ఎలా ఎమోషనల్ అవుతామో నాని కనిపించినప్పుడు నిత్యామేనన్‌ పలికించిన హావభావాలు అంతే సహజంగా ఉన్నాయి. దేవికగా గౌతమి, శేషమ్మగా రామేశ్వరి, కల్యాణిగా ప్రణీత పట్నాయక్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. (kumari srimathi review) ఇక శ్రీమతి బాబాయ్‌ కేశవరావు పాత్ర చేసిన ప్రేమ్‌సాగర్‌ తనదైన నటనతో అలరించారు. మరీ ముఖ్యంగా తన కొడుకుల విషయంలో కన్‌ఫ్యూజన్‌, గుండె పోటుతో ఆస్పత్రిలో చేరినప్పుడు ఆయన చేసే నటన చక్కటి వినోదాన్ని పంచుతుంది. తన కొడుకులు తింగరోళ్లు అనుకుని, భ్రమపడుతూ వచ్చిన కేశవరావుకు చివరిలో వచ్చే ట్విస్ట్‌తో కళ్లు తెరుచుకుంటాయి. ఇక తిరువీర్‌, నిరుపమ్‌, మురళీమోహన్‌ తమ పరిధి మేరకు నటించారు. అవసరాల శ్రీనివాస్‌, నాని అతిథి పాత్రల్లో అలరించారు.

సాంకేతికంగా.. సిరీస్‌ బాగుంది. స్టెక్కటో & కమ్రాన్ సంగీతం గోదావరి పడవ ప్రయాణంలా సాగిపోయింది. ఒకట్రెండు పాటలు ఉన్నాయి కానీ, అవన్నీ కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. పెద్దగా గుర్తుండవు. గోదావరి అందాలను తన కెమెరాతో బాగా చూపించారు మోహనకృష్ణ. సృజన అడుసుమిల్లి ఎడిటింగ్‌ ఓకే. కొన్ని ఎపిసోడ్స్‌లో రిపీటెడ్‌ సీన్స్‌ కథాగమనానికి అడ్డు తగులుతున్నట్లు అనిపిస్తాయి. వాటిని పరిహరించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. (kumari srimathi review) అవసరాల శ్రీనివాస్‌ (srinivas avasarala) సంభాషణలు ఈ సిరీస్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి. అచ్చ తెలుగు పదాలు, పడికట్టు పదాలు, జాతీయాలు, అలతి పదాలతో వచ్చే సంభాషణలు బాగున్నాయి. అభి జీతం గురించి వాళ్ల తాత అడిగినప్పుడు కోటిన్నర అని చెబుతాడు. అప్పుడు వాళ్ల తాత ‘వెనకేసుకుందామనుకుంటున్నావేమో.. వెనకే ఉండిపోతుంది. వెంట రాదు’ వంటి సంభాషణల్లో లోతైన భావం ఉంది. దర్శకుడు గోమఠేష్‌ ఉపాధ్యాయి అచ్చ తెలుగు సిరీస్‌ను అందించడంలోనూ, నటీనటుల నుంచి నటన రాబట్టుకోవడంలోనూ విజయం సాధించారు. కానీ, సన్నివేశాలను పునరావృతం కాకుండా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.

మరొకొన్ని విషయాలు కూడా కచ్చితంగా మాట్లాడుకోవాలి. రెండు మూడు చోట్ల చిరంజీవి ‘ఛాలెంజ్‌’ మూవీ రిఫరెన్స్‌ను చూపించారు. అందులో చిరంజీవి ఐదేళ్లలో రూ.50లక్షలు నీతి, నిజాయతీలతో సంపాదిస్తానని సవాల్‌ చేస్తాడు. కానీ, ఇక్కడ శ్రీమతి తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బార్‌ పెడుతుంది. ‘ఊళ్లో తాగుబోతులను తయారు చేస్తావా’ అని శ్రీరామ్‌ అంటే, ‘అన్నావూ.. నేను తయారు చేస్తేనే ప్రపంచంలో అందరూ తాగుబోతులయ్యారా? నేను నా కాళ్లమీద నిలబడాలనుకుంటున్నా’ అంటూ శ్రీమతి తన ఐడియాను సమర్థించుకుంటుంది. (kumari srimathi review) అంటే ఊళ్లో వాళ్లు తాగి నాశనమైపోయినా తన లక్ష్యం మాత్రం నెరవేరాలి. అలాగే ఊళ్లో ఆడవాళ్లందరూ బార్‌పై దాడి చేస్తే, వాళ్ల మీద కేసు పెట్టడానికి శ్రీమతికి చేతులు రావు. అదేంటని అడిగితే ‘వాళ్లందరూ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్లు’ అంటుంది. పైగా తాగిన వారందరినీ తానే దగ్గరుండి ఇంటికి పంపిస్తానని చెబుతుంది. మహిళా సాధికారతతో కూడిన కథను తీసినప్పుడు మద్యం, బార్‌లాంటి పాయింట్‌లు ఎంచుకుంటే ప్రధాన పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. స్వార్థంతో కూడిన శ్రీమతి పాత్రకు ఈ లక్షణాలను ఆపాదించినప్పుడు ఆ పాత్రను సాఫ్ట్‌గా చూపించాల్సిన అవసరం లేదు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ కాకుండా ఇంకేదైనా అంశాన్ని ఎంచుకుంటే, సిరీస్‌ మరొక రకంగా ఉండేదేమో.

కుటుంబంతో కలిసి చూడొచ్చా: నిరభ్యంతరంగా చూడొచ్చు. ఇటీవల కాలంలో వెబ్‌సిరీస్‌లంటే అసభ్యత, అశ్లీల పదాలను యథేచ్చగా వాడేస్తున్నారు. కానీ, ఇందులో ఎలాంటి అసభ్యతకు తావులేదు. ఎక్కడా అలాంటి సంభాషణలు కూడా లేవు. ఒక క్లీన్‌ ఎంటర్‌టైనింగ్‌ వెబ్‌సిరీస్‌ ఇది.  నటీనటుల దుస్తుల దగ్గరి నుంచి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాత్రలన్నీ పల్లెటూళ్లలో మన పక్కింట్లో ఉన్న వాళ్లలానే అనిపిస్తాయి. (kumari srimathi review) ఈ వీకెండ్‌లో టైమ్‌ పాస్‌ కోసం ఏదైనా వెబ్‌సిరీస్‌ చూడాలనుకుంటే ‘కుమారి శ్రీమతి’ చూడొచ్చు.

  • బలాలు
  • + నిత్యామేనన్‌ నటన
  • + హృద్యమైన కామెడీ
  • + సినిమాటోగ్రఫీ, సంభాషణలు
  • బలహీనతలు
  • - అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
  • - పునరావృతమయ్యే కొన్ని సన్నివేశాలు
  • చివరిగా: కుమారి శ్రీమతి.. మద్యం షాపుతో సాధికారత సాధించే మహిళ కథ (kumari srimathi review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని