Indian 2: ‘భారతీయుడు2’ కోసం మరో అద్భుతం చేయబోతున్న శంకర్‌!

Indian 2: భారతీయుడు2 కోసం శంకర్‌ సరికొత్త టెక్నాలజీతో నటులను రీక్రియేట్‌ చేయబోతున్నారు.

Published : 17 Jul 2023 20:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమల్‌హాసన్‌ (Kamal Haasan)- దర్శకుడు శంకర్‌ (S. Shankar) కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ (Indian) బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ (Indian 2)ను రూపొందిస్తున్నారు. కరోనాతో పాటు, బడ్జెట్‌ పరిమితులు, ఇతర సమస్యల కారణంగా ఇన్నాళ్లూ ఆలస్యమైన ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో టెక్నాలజీని అద్భుతంగా వాడుకునే దర్శకుల్లో శంకర్‌ ఒకరు. గతంలో ఆయన తీసిన సినిమాలే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు2’ కోసం మరో ప్రయోగం చేయబోతున్నారు. నేడు అందుబాటులో ఉన్న అత్యున్నత సాంకేతిక టెక్నాలజీని వినియోగించి, ప్రస్తుతం మన మధ్యలేని ఇద్దరు నటులను తెరపై చూపించబోతున్నారు.

‘భారతీయుడు2’ మొదలు పెట్టినప్పుడు తమిళ నటుడు వివేక్‌ (Vivek) కూడా చిత్రంలో భాగమయ్యారు. కొన్ని రోజులకు గుండె పోటు రావడంతో ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. అలాగే మలయాళ నటుడు నెడుముడి వేణు (Nedumudi Venu) కూడా ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. ‘భారతీయుడు’లో సేనాపతిని పట్టుకునే పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా బారిన పడిన వేణు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. ఇలా సినిమాలో నటిస్తున్న ఇద్దరు ముఖ్య నటులు కన్నుమూయడంతో సమస్య ఏర్పడింది. ఎందుకంటే సినిమా మొదలైన సమయంలో వీరి కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను తీశారు. అవి మళ్లీ రీషూట్‌ చేయడం తలకుమించిన భారం. దీంతో శంకర్‌ వారి రూపాలను సీజీఐ (కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) ద్వారా తెరపై చూపించనున్నారు. హాలీవుడ్‌ సినిమాల్లో ఇలాంటి టెక్నాలజీ కొత్తేమీ కాదు. కానీ, ఇండియన్‌ సినిమా కోసం శంకర్‌ ఈ టెక్నాలజీని అడాప్ట్‌ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్‌.

‘భారతీయుడు2’లో సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.350కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని