Aadavallu Meeku Johaarlu Review: రివ్యూ: ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు

శర్వానంద్‌ నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా రివ్యూ

Published : 05 Mar 2022 01:58 IST

చిత్రం: ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు; నటీనటులు: శర్వానంద్, రష్మిక, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, తదితరులు; ఛాయాగ్రహ‌ణం: సుజిత్ సారంగ్‌; సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్; కూర్పు: శ్రీకర్ ప్రసాద్; క‌ళ‌: ఏఎస్ ప్రకాష్; నిర్మాత: సుధాకర్ చెరుకూరి; దర్శకత్వం: తిరుమల కిషోర్; బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్; విడుద‌ల‌: 4-3-2022

కుటుంబ క‌థ‌ల్లో చక్కగా ఒదిగిపోయే యువ క‌థానాయ‌కుల్లో శ‌ర్వానంద్ ఒక‌రు. ఇలాంటి వినోదంతో తెర‌కెక్కిన ప‌లు సినిమాల‌తో ఆయ‌న విజ‌యాల్ని అందుకున్నారు. అయితే.. కొంత‌కాలంగా శ‌ర్వా త‌న శైలికి భిన్నంగా సీరియ‌స్‌గా సాగే క‌థ‌ల్ని ఎంచుకుంటూ వస్తున్నారు. చాలా రోజుల విరామం త‌ర్వాత మ‌ళ్లీ త‌న మార్క్ కుటుంబ క‌థ‌తో ఆయన చేసిన చిత్రం ‘ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు’. ప్రేక్షకుల్లో ఆస‌క్తి రేకెత్తించే కాంబినేషన్‌లో ఈ సినిమా మొద‌లు కావ‌డం, ప్రచార చిత్రాలు కూడా ఆక‌ట్టుకునేలా ఉండ‌టంతో చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?.. శ‌ర్వానంద్‌ని మ‌ళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చే స‌త్తా ఉన్న క‌థేనా? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం.

క‌థేంటంటే: ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఒకే ఒక్క అబ్బాయి చిరంజీవి (శ‌ర్వానంద్‌). త‌నంటే  ఇంటిల్లిపాదికీ గారాబం. చిరుకి పెళ్లి చేయాల‌ని సంక‌ల్పిస్తారు కుటుంబ స‌భ్యులు. అతడికి న‌చ్చినా.. ఇంట్లో ఆడ‌వాళ్లకి మాత్రం ఓ ప‌ట్టాన అమ్మాయిలు న‌చ్చరు. అలా బోలెడ‌న్ని సంబంధాల్ని తిర‌స్కరిస్తారు. పెళ్లి ప్రయ‌త్నాల్లోనే ఉన్న చిరు జీవితంలోకి అనుకోకుండా ఆద్య (ర‌ష్మిక‌) ప్రవేశిస్తుంది. ఆ ఇద్దరూ తొంద‌ర‌గా ద‌గ్గర‌వుతారు. చిరు కుటుంబ స‌భ్యుల‌కీ న‌చ్చడంతో ఆద్యనే త‌మ ఇంటి కోడ‌లిగా తీసుకు రావాల‌నుకుంటారు. కానీ ఆద్యకి పెళ్లి చేయ‌డం వాళ్లమ్మ, వ్యాపార‌వేత్త అయిన వ‌కుళ (ఖుష్బూ)కి ఇష్టం ఉండ‌దు. కార‌ణం త‌న జీవితంలో చోటు చేసుకున్న ప‌రిణామాలే. ఆద్యనేమో త‌ల్లి మాట జ‌వ దాట‌ని కూతురు. మ‌రి ఈ ప‌రిస్థితుల మ‌ధ్య చిరు-ఆద్యల పెళ్లి ఎలా జ‌రిగింద‌న్నదే మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: క‌రోనా త‌ర్వాత ఇంటిల్లిపాదీ క‌లిసి థియేట‌ర్‌కి వ‌చ్చేంతగా ఉత్సుక‌త రేకెత్తించిన సినిమాలు అరుదుగానే వ‌చ్చాయి. ఈ సినిమా మాత్రం కుటుంబ ప్రేక్షకులే ల‌క్ష్యంగా రూపొందింది. పేరు మొద‌లుకొని.. తెర‌పై క‌నిపించే పాత్రలు, మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల్ని ఆక‌ర్షించేలా ఉండ‌టం క‌లిసొచ్చే విష‌యం. ద‌ర్శకుడు తిరుమ‌ల కిషోర్ స్వచ్ఛమైన కుటుంబ వినోదంతో ఈ సినిమాని తెర‌కెక్కించారు. ఆడ‌వాళ్ల మ‌ధ్య పెరిగిన ఓ ప‌ద్ధతైన కుర్రాడు, పెళ్లిపై స‌దాభిప్రాయం లేని ఓ మ‌హిళ చుట్టూ ఈ క‌థ‌ని న‌డిపించాడు. చిరు పెళ్లి క‌ష్టాల‌తోనే సినిమా మొద‌ల‌వుతుంది. చిరు కుటుంబం పలువురు అమ్మాయిల్ని తిర‌స్కరించ‌డం ద‌గ్గర్నుంచి.. అమ్మాయిలే చిరుని తిర‌స్కరించ‌డం వ‌ర‌కూ సాగే ఎపిసోడ్ న‌వ్విస్తుంది.  ఆద్యతో చిరు ప్రయాణం మొద‌లయ్యాక ఓ ప్రేమ‌క‌థ‌ని చూసిన అనుభూతి క‌లుగుతుంది. స‌న్నివేశాలు ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టే సాగుతున్నట్టు అనిపించినా తిరుమ‌ల కిషోర్ ర‌చ‌నలో బ‌లం వ‌ల్ల సంభాష‌ణ‌లు అర్థవంతంగా అనిపిస్తాయి. అక్కడ‌క్కడా పంచ్‌లు పేలాయి. దాంతో కాల‌క్షేపం అవుతుంది.

ద్వితీయార్ధంలోనే క‌థ‌లో అస‌లు సంఘ‌ర్షణ క‌నిపిస్తుంది. ఆద్య త‌ల్లి వ‌కుళ ప్రపంచంలోకి చిరు వెళ్లడం, అక్కడ చోటు చేసుకునే ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాలు.. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అయితే ద‌ర్శకుడు అక్కడ బ‌ల‌మైన సంఘ‌ర్షణ లేకుండా సాదాసీదాగా క‌థ‌ని ముగింపు దిశ‌గా తీసుకెళ్లడం పెద్దగా మెప్పించ‌దు. వ‌కుళ గ‌తం గురించి కేవ‌లం మాట‌ల్లోనే చెప్పించ‌డంతో అంత‌గా భావోద్వేగాలు పండ‌లేదు. మొత్తంగా సినిమా మాత్రం స్వచ్ఛమైన కుటుంబ క‌థ‌తో ఇంటిల్లిపాదినీ మెప్పిస్తుంది. ‘మ‌గాళ్ల విష‌యంలో స‌మ‌స్య‌, ప‌రిష్కారం రెండూ వేర్వేరు,  కానీ ఆడ‌వాళ్ల విష‌యంలో స‌మస్యని అర్థం చేసుకోవ‌డ‌మే ప‌రిష్కారం’ త‌ర‌హా సంభాష‌ణ‌ల‌తో ద‌ర్శకుడు తిరుమ‌ల కిషోర్ చ‌క్కటి ర‌చ‌న చేశారు. ఒక్క క‌థానాయ‌కుడు, అక్కడ‌క్కడా అలా వ‌చ్చిపోయే పాత్రలు మిన‌హా క‌థ‌నంతా ఆడ‌వాళ్ల చుట్టూ తిప్పిన విధానం కూడా మెచ్చుకోద‌గ్గదే.

ఎవ‌రెలా చేశారంటే: శ‌ర్వానంద్ త‌న పాత్రలో ఒదిగిపోయాడు. త‌న జోన్ క‌థ‌, పాత్ర కావ‌డంతోనేమో మ‌రింత ఆత్మవిశ్వాసంతో క‌నిపించాడు. వెన్నెల కిషోర్‌, ఊర్వశి త‌దిత‌రులతో క‌లిసి చేసిన స‌ర‌దా స‌న్నివేశాల్లో బాగా న‌వ్వించాడు. ముఖ్యంగా శ‌ర్వా - ఊర్వశి విరామం స‌మ‌యంలో చేసిన సంద‌డి కడుపుబ్బా న‌వ్వించింది. ర‌ష్మిక సంప్రదాయ‌మైన వ‌స్త్రధార‌ణ‌తో అందంగా క‌నిపించింది. రాధిక‌, ఖుష్బూ, ఝాన్సీ త‌దిత‌రులు బ‌ల‌మైన పాత్రల్లో క‌నిపించ‌డం సినిమాకి క‌లిసొచ్చింది. వెన్నెల కిషోర్ ప్రథ‌మార్ధంలో, స‌త్య‌, ప్రదీప్ రావ‌త్ ద్వితీయార్ధంలో న‌వ్వించారు. సాంకేతిక విభాగాల్లో కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. దేవిశ్రీ ప్రసాద్  స‌మ‌కూర్చిన బాణీల్లో హాస‌మ్.. అంటూ సాగే పాట‌, దాన్ని చిత్రీక‌రించిన విధానం మెప్పిస్తుంది. టైటిల్ గీతంతోపాటు, నేప‌థ్య సంగీతం కూడా బాగుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. ద‌ర్శకుడు తిరుమ‌ల కిషోర్ రాసిన క‌థ‌, క‌థ‌నాల్లో చెప్పుకోద‌గ్గ మ్యాజిక్ క‌నిపించ‌క‌పోయినా..  ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా సినిమాని తీర్చిదిద్దిన విధానం మాత్రం మెచ్చుకోద‌గ్గది.

బ‌లాలు

కీలకపాత్రధారుల నటన
స్వచ్ఛమైన కుటుంబ క‌థ‌
వినోదం, సంభాష‌ణ‌లు
బ‌ల‌హీన‌త‌లు
- ఊహ‌కు త‌గ్గట్టుగా సాగే క‌థ‌నం

చివ‌రిగా: ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు... కుటుంబమంతా క‌లిసి చూసేలా!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని