Leo: ‘లియో’ విడుదల వేళ.. లోకేశ్‌ కనగరాజ్‌ విజ్ఞప్తి..

కోలీవుడ్‌ హీరో ‘లియో’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడు చెప్పిన ఆసక్తికర విషయాలకు అవి రెట్టింపయ్యాయి.

Published : 14 Oct 2023 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ‘లియో’ (Leo). లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ (Vijay) నటించిన ఈ చిత్రం గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటోంది. భారీ అంచనాల మధ్య ఇది అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ సమీపించడంతో మూవీ యూనిట్‌ ప్రచారాలతో ఆకట్టుకుంటోంది.

అమెరికాలో వినూత్న రీతిలో కార్లు, బస్సులపై ‘లియో’ పోస్టర్లు అంటించి ర్యాలీ నిర్వహించారు. అలాగే కేరళలోనూ విజయ్‌ ఫ్యాన్స్ ఆయన పోస్టర్లతో భారీ బైక్‌ ర్యాలీ చేశారు. మరోవైపు చిత్ర దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి చేశారు. ‘లియో’ మొదటి నుంచి చివరి వరకూ అలరిస్తుందని చెప్పిన ఆయన మొదటి 10 నిమిషాలు అసలు మిస్‌ కావ్వొద్దని కోరారు. ‘‘లియో’ కోసం వేయి కంటే ఎక్కువ మంది పనిచేశారు. సంవత్సరం నుంచి వాళ్లు నిరంతరం కష్టపడ్డారు. అద్భుతమైన అవుట్‌పుట్‌ వచ్చింది. ఎప్పుడూ చూడని సినిమాటిక్‌ అనుభవాన్ని ‘లియో’లో ఎంజాయ్‌ చేయండి. ముఖ్యంగా మొదటి 10నిమిషాలు మాత్రం అసలు మిస్‌ కాకండి. సినిమాలో ఆ పది నిమిషాలు ఎంతో ప్రత్యేకం’ అని చెప్పారు. దీంతో విజయ్‌ పరిచయ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌ కానున్నట్లు తెలుస్తోంది.

‘విక్రమార్కుడు’ సీక్వెల్‌.. రవితేజ ఏమన్నారంటే!

ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ‘నా రెడీ’ (Naa Ready)పాటను తాజాగా తెలుగులోనూ విడుదల చేశారు. అయితే ఈ పాటను తమిళంలో విడుదల చేసినప్పుడు దీని పోస్టర్‌పై వచ్చిన కొన్ని విమర్శలను దృష్టిలో పెట్టుకున్న చిత్రబృందం.. తాజాగా దాన్ని ఎడిట్‌ చేసింది. హీరో సిగరెట్‌ కాలుస్తూ ఉన్న క్లోజప్‌ షాట్‌ పోస్టర్లో మార్పులు చేసింది. ‘విక్రమ్‌’ లాంటి సూపర్‌హిట్‌ తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం, ‘మాస్టర్‌’ తర్వాత లోకేశ్‌- విజయ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని