Thalaivar 171: స్టోరీ చెప్పగానే రజనీకాంత్‌ చేసిన పనికి చాలా సంతోషించా: లోకేశ్‌ కనగరాజ్‌

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ ఓ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారు. దీని షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభంకానుంది.

Published : 19 Dec 2023 12:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం రజనీకాంత్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘తలైవా 171’గా (Thalaivar 171) ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను లోకేశ్‌ పంచుకున్నారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. దీని షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సినిమా గురించి తెలియగానే మొదట కమల్‌ హాసన్‌ ఫోన్‌ చేసి అభినందించినట్లు తెలిపారు.

‘‘ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 2024 నాటికి అవి పూర్తవుతాయి. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా. చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్‌ ఇలాంటి సినిమాలో నటించనున్నారు. దీని స్క్రిప్ట్‌ విన్నాక ఆయన చాలా సంతోషించారు. అనిరుధ్, నేను కలిసి వెళ్లి ఆయనకు కథ వినిపించాం. వెంటనే ఆయన నన్ను కౌగిలించుకుని ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. చాలా సంతోషించాను’’ అని చెప్పారు. ఇక రజనీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషించనున్నారు. అలాగే ఇందులో అతిథి పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ను ఇప్పటికే లోకేశ్‌ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై రణ్‌వీర్‌ ఆసక్తిగా ఉన్నారని, కథ కూడా వినేందుకు అంగీకరించినట్లు సమాచారం.

‘డంకీ’.. షారుక్‌ ఖాన్‌ కొత్త సినిమా విశేషాలివీ!

ఇక ఇటీవల కమల్‌ హాసన్‌తో ‘విక్రమ్‌’ (Vikram), విజయ్‌తో ‘లియో’ (Leo), కార్తితో ‘ఖైదీ’ తెరకెక్కించిన లోకేశ్‌ కనగరాజ్‌ కొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ సినిమాటిక్‌ యూనివర్స్‌ అనే కాన్సెప్ట్‌తో (Lokesh Cinematic Universe) అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తున్నారు. ఇప్పుడు ‘తలైవా 171’ కూడా అందులో భాగం కానుందో లేదో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని