Hansika: నా భర్త గతం నాకు తెలుసు.. తన విడాకులకు నేను కారణం కాదు: హన్సిక

‘గతంలో నేను ఓ రిలేషన్‌లో ఉన్నాను. ఆ విషయం చాలా మందికి తెలుసు. మళ్లీ అలాంటి బంధాన్ని కొనసాగించాలని లేదు. ఈ సారి పబ్లిక్‌లోకి వస్తే నా భర్తతోనే రావాలనుకున్నా. సోహైల్‌ నా జీవితంలోకి వచ్చిన క్షణాలు ఎప్పటికీ ప్రత్యేకమే’’ అని అంటున్నారు నటి హన్సిక (Hansika)

Published : 11 Feb 2023 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి హన్సిక (Hansika) గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 4న తన ప్రియుడు సోహైల్‌తో ఆమె ఏడడుగులు వేశారు. అయితే, హన్సిక పెళ్లి ఎలా జరిగింది? ఆమెకు సోహైల్‌ ఎలా పరిచయం? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విశేషాలతో ‘లవ్‌ షాదీ డ్రామా’ (Love Shaadi Drama) పేరుతో హన్సిక వెడ్డింగ్‌ (Hansika Wedding) వీడియో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా శుక్రవారం రిలీజ్‌ అయ్యింది. పెళ్లికి కొన్నిరోజుల ముందు.. సోహైల్‌కు గతంలోనే వివాహమైందని, అతడు తన భార్య నుంచి విడిపోవడానికి తానే కారణమని ఎన్నో వార్తలు బయటకు వచ్చిన విషయాన్ని హన్సిక ఈ వీడియోలో ప్రస్తావించారు.

‘‘నా పెళ్లి గురించి అన్ని విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా. అయితే, నాకు తెలియకుండానే పెళ్లి వార్తలు బయటకు వచ్చేశాయి. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. ఒక సెలబ్రిటీగా ఇది నాకు నేను చెల్లించుకుంటున్న మూల్యం. సోహైల్‌ గురించి మొదట్లో వార్తలు వచ్చినప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి సమయంలో అమ్మ ఇచ్చిన సూచనతో మొదటిసారి మా ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశాను. సోహైల్‌ ప్రపోజ్‌ చేసిన ఆ ఫొటోలు చూసి అందరూ అభినందనలు తెలిపారు. నాకెంతో ఆనందంగా అనిపించింది. పరిస్థితులన్నీ చక్కబడ్డాయని అనుకున్న సమయంలో తిరిగి షూటింగ్స్‌ కోసం చెన్నైకు వెళ్లాను. అదే సమయంలో అతడికి గతంలోనే పెళ్లి అయ్యిందని వార్తలు వచ్చాయి. ఆ పెళ్లిలో నేను పాల్గొన్న ఫొటోలు షేర్‌ చేస్తూ.. సోహైల్‌ తన భార్య నుంచి విడిపోవడానికి నేనే కారణం అని విమర్శలు చేశారు. నిజం చెప్పాలంటే, నా భర్త గతం నాకు తెలుసు. అతడి విడాకులకు నేను కారణం కాదు’’ అని హన్సిక వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని