Guntur Kaaram: మహేశ్‌ బర్త్‌డే స్పెషల్‌ ట్రీట్‌.. ఆ విషయంపై మరోసారి స్పష్టత

Guntur Kaaram: మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం స్పెషల్‌ పోస్టర్‌ను పంచుకుంది.

Published : 09 Aug 2023 06:55 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). బుధవారం మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మహేశ్‌ లుంగీ కట్టుకుని, బీడీ కాలుస్తూ మాస్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా, ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందేశాలకూ చిత్ర బృందం మరోసారి స్పష్టతనిచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక సంగీత దర్శకుడు తమన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటికి కూడా పోస్టర్‌తో సమాధానం ఇచ్చింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆయనే కొనసాగనున్నారు. 

ఇంత వరకూ బాగానే ఉన్నా, మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా కేవలం పోస్టర్‌ మాత్రమే విడుదల చేయడం పట్ల అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. సినిమా నుంచి ఏదైనా లిరికల్‌సాంగ్‌, లేదా గ్లింప్స్‌లాంటిది ఇచ్చి ఉంటే వారి ఆనందం మరో రేంజ్‌లో ఉండేది. కనీసం డైలాగ్‌ టీజర్‌నైనా విడుదల చేస్తే బాగుండేదని సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఆగస్టు 15 నాటికైనా ఏదైనా అప్‌డేట్‌ ఇస్తారేమో చూడాలి. ‘గుంటూరు కారం’లో మహేశ్‌ జోడీగా శ్రీలీల నటిస్తుండగా మరో కథానాయికగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని